‘వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలవనంత మాత్రాన మా జట్టు గత రెండేళ్లలో సాధించిన విజయాల విలువ తగ్గదు. మా టీమ్ ఎన్నో గొప్ప విజయాలు అందుకుంది’... డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభానికి ముందు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్య ఇది. అంకెల్లో చూస్తే అది వాస్తవమే అయినా, ఒక మెగా ఈవెంట్‌కు ముందు ఈ తరహా నెగెటివ్ వ్యాఖ్యలు కోచ్ నుంచి రావడం ఎవరికీ నచ్చలేదు. ఓడిపోవడానికి ముందే దాని కోసం సాకులు వెతుకుతున్నట్లుగా ఉందని దీనిపై చాలా మంది క్రికెట్ అభిమానులు విమర్శించారు. చివరకు మ్యాచ్ ఫలితం అలాగే వచ్చింది.
♦ ఆటగాడిగా దిగ్గజ స్థాయి ఉన్న ద్రవిడ్ కోచ్‌గా అండర్–19, ఇండియా ‘ఎ’ టీమ్‌ల తరఫున మాత్రం గొప్ప ఫలితాలు రాబట్టాడు. అయితే సీనియర్ టీమ్ కోచ్‌గా ద్రవిడ్ ఆశించిన ఫలితాలు రాబట్టలేదనేది వాస్తవం. టీమ్ మేనేజ్‌మెంట్‌లో ప్రధాన భాగమైన ద్రవిడ్ తొలి రోజే పిచ్‌పై అంచనా తప్పడం భారత్‌ను దెబ్బ తీసిందనేది వాస్తవం. తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని తెలిసినా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పు.
ఇంగ్లండ్‌లో వాతావరణం గంటగంటకూ మారుతుందని ద్రవిడ్‌కు బాగా తెలుసు. మన పేసర్లపై నమ్మకం ఉండటమే కాదు... మబ్బులు కమ్మిన వేళ మనం బ్యాటింగ్ తీసుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోతే జట్టు కుప్పకూలిపోతుందనే భయం కూడా ద్రవిడ్ మనసులో ఉండవచ్చు. గంట తర్వాత అంతా మారిపోయింది. హెడ్, స్మిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఆ భాగస్వామ్యంతోనే భారత్ వెనకడుగు వేసింది.
తొలిరోజు ఆసీస్ 327/3 వద్ద ముగించడంతోనే మన ఓటమికి పునాది పడింది. భారత్ సన్నాహాలు బాగా లేవనే వాస్తవాన్ని మాత్రం అతను టెస్టు ముగిసిన తర్వాత అంగీకరించాడు. ‘ఒక కోచ్‌గా మాకు ప్రాక్టీస్‌కు లభించిన సమయంతో సంతృప్తిగా లేను. అయితే అది నా చేతుల్లో లేదు. షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. నాకు అందుబాటులో ఉన్న వనరులతోనే ఆడాలి’ అని ద్రవిడ్ చెప్పాడు.
♦ అగ్రశ్రేణి బౌలర్ అశ్విన్‌ను తప్పించడం కూడా చర్చనీయాంశం. అతను భారత్‌లో మాత్రమే బాగా ఆడగలడనేది కూడా అపోహ మాత్రమే. మ్యాచ్‌కు ముందు అశ్విన్ ప్రత్యేకతపై మాట్లాడిన సచిన్ టెండూల్కర్ మ్యాచ్ తర్వాత అదే అభిప్రాయం వ్యక్తం చేయడం అతని విలువను చూపిస్తుంది. ‘గొప్ప బౌలర్లకు పిచ్‌తో పని లేదు. టరి్నంగ్ లేని చోట కూడా ఫలితాలు సాధించే అశ్విన్‌ను ఎందుకు ఆడించలేదో నాకూ అర్థం కాలేదు’ అని సచిన్ చెప్పాడు.
ఆసీస్‌పై మెరుగైన రికార్డు, ఆ జట్టులో టాప్–6లో నలుగురు ఎడంచేతి వాటం కావడంతో కచ్చితంగా అతను ప్రభావం చూపించగలిగే వాడనేది వాస్తవం. ఆల్‌రౌండర్, గత ఓవల్ టెస్టులో ప్రదర్శన ఆధారంగా శార్దుల్‌కు చోటు ఖాయం కాగా... ఉమేశ్ యాదవ్‌కు బదులు అశ్విన్‌ను ఆడించి ఉండే బాగుండేది. ఉమేశ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలం కాగా... చివరి ఇన్నింగ్స్‌లో లయన్ చూపించిన ప్రభావం అశ్విన్‌ను గుర్తు చేసింది.
♦ మ్యాచ్‌లో మన ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే కొంత విరామం తర్వాత పునరాగమనం చేసిన అజింక్య రహానేకే ఎక్కువ మార్కులు పడతాయి. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతను ప్రభావం చూపించగలిగాడు. ఇక శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్నా... రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరూ విఫలమయ్యారు. బౌలర్లుగా వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేదు. షమీ, సిరాజ్ మాత్రమే చాలావరకు తమ స్థాయిలో గట్టిగా ప్రయత్నించారు.
అయితే ఎన్ని విశ్లేషణలు చేసినా... టాప్–4 బ్యాటింగ్ వైఫల్యమే జట్టును దెబ్బ తీసిందనేది వాస్తవం. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఈ నలుగురు విఫలం కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయాల్లో రోహిత్, పుజారా చెత్త షాట్లు ఆడి ఛేదనను కఠినంగా మార్చేశారు. లయన్ తొలి ఓవర్లోనే స్వీప్ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ చేసిన సాహసం. చాలా రోజులుగా కౌంటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన పుజారా అనుభవం ఇక్కడ పనికొస్తుందని భావించగా, అది అర్ధ సత్యమే.
పుజారా చేసిన పరుగులన్నీ కౌంటీలో పేలవమైన బౌలర్లు ఉండే ద్వితీయ శ్రేణి మ్యాచుల్లోనే! ఐపీఎల్ ఆడని ఒకే ఒక ఆటగాడు పుజారా ఐపీఎల్ తరహా షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడం ఆశ్చర్యకరం. ‘కోహ్లి చెత్త షాట్ ఆడాడు. అది ఎందుకు ఆడాడో అతడినే అడగాలి. గెలవాలంటే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని అతను చెబుతుంటాడు. ఇలాంటి షాట్‌తో అది సాధ్యమా’ అని గావస్కర్ విమర్శించడం విశేషం.
♦ బుమ్రా, పంత్ లేని లోటు కనిపించిందనేది వాస్తవమే అయినా... ఓటమికి అది మాత్రం కారణం కాదు. ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ బ్యాటింగ్‌పై చాలా మంది విమర్శలు చేస్తున్నా ఆ మాటలకు విలువ లేదు. తన అసలు బాధ్యత వికెట్ కీపింగ్‌లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టాప్–6 పరుగులు చేయకుండా 7వ నంబర్ ఆటగాడిని ప్రశ్నించడం అర్థరహితం. రెండేళ్ల క్రితం కూడా న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత్ ఇదే టాప్–5తో ఆడింది. నాడూ రెండు ఇన్నింగ్స్‌లోలనూ బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఓడింది. ఇప్పుడూ అదే పునరావృతమైంది.
♦ మరోవైపు సొంతగడ్డపై వరుసగా రెండు సిరీస్‌లు, ఇటీవల భారత గడ్డపై మరో సిరీస్ కలిపి వరుసగా 3 సిరీస్‌లలో టీమిండియా చేతిలో ఓడిన ఆ్రస్టేలియా ఈ మ్యాచ్‌కు మాత్రం బాగా సన్నద్ధమై వచ్చింది. ఐపీఎల్ ఆడిన వార్నర్, గ్రీన్ మినహా అంతా చాలా రోజులుగా కఠోర సాధన చేశారు. అది ఓవల్‌లో కనిపించింది. రెండేళ్ల క్రితం ఓవర్‌రేట్ జరిమానాగా పాయింట్ల కోతతో ఫైనల్ అవకాశాలు కోల్పోయిన కంగారూలు ఈ సారి తుది పోరుకు అర్హత సాధించడంతో పాటు తమ పూర్తి సత్తాను చాటి విజేతగా నిలిచారు.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment