
‘కొత్త’ రాహుల్
► వన్డేల్లో చెలరేగిన కర్ణాటక కుర్రాడు
► టెస్టు క్రికెటర్ ముద్రనుంచి బయటకు
పేరులోనే కాదు... ఆటలో కూడా దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌తో లోకేశ్ రాహుల్‌కు పోలికలు కనిపిస్తాయి. బెంగళూరుకే చెందిన ఈ ఇద్దరూ సాంకేతికంగా బలమైన బ్యాట్స్‌మెన్. టాపార్డర్‌లో ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడతారు. సుదీర్ఘ సమయం ఆడగల నైపుణ్యం, ఓపిక ఉన్నాయి. అవసరమైతే వికెట్ కీపింగ్ కూడా చేయగల సమర్థులు. ఇప్పుడు మరో విషయంలో కూడా లోకేశ్, సీనియర్ రాహుల్‌ను గుర్తుకు తెస్తున్నాడు. ఆరంభంలో టెస్టు క్రికెటర్‌గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తమదైన ముద్ర వేయడంలో వీరిద్దరు ఒకేలా కనిపించారు. ఇటీవల ఐపీఎల్, వన్డే సిరీస్‌లతో రాహుల్‌లోని కొత్త తరహా బ్యాటింగ్ శైలి ముందుకు వచ్చింది.
సాక్షి క్రీడా విభాగం:- రంజీ ట్రోఫీలో వరుసగా రెండేళ్ల పాటు కర్ణాటక విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో లోకేశ్ రాహుల్‌కు టెస్టు జట్టులో అవకాశం తొందరగానే లభించింది. అయితే మెల్‌బోర్న్‌లో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా రెండు ఇన్నింగ్స్‌లోనూ నిర్లక్ష్యపు షాట్‌లు ఆడి అవుట్ కావడంతో అంతా పెదవి విరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో లైఫ్ లభించినా దానిని ఉపయోగించుకోలేక డీప్‌లో క్యాచ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అదృష్టవశాత్తూ తర్వాతి టెస్టులోనూ రాహుల్‌పై నమ్మకముంచిన కోహ్లి ఓపెనర్‌గా పంపాడు. సిడ్నీ టెస్టులో చక్కటి షాట్లతో సెంచరీ చేసి తన అసలు ఆట ఏమిటో లోకేశ్ చూపించాడు. ఆ తర్వాత శ్రీలంకపై కూడా అతను మరో ఆకట్టుకునే శతకం సాధించాడు. ఆ తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు జట్టులో ఉన్నా... మ్యాచ్ దక్కలేదు గానీ టెస్టులో రెగ్యులర్ సభ్యుడు మాత్రం అయిపోయాడు.
అంతంత ప్రదర్శనే
దేశవాళీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాహుల్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రెండు సీజన్లు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2014లో 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 20.75 సగటుతో 166 పరుగులు మాత్రమే చేశాడు. 2015లోనూ 8 ఇన్నింగ్స్‌లలో 28.40 సగటుతో 142 పరుగులే చేయగలిగాడు. ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకపోగా, రెండు సీజన్లలో అతని స్ట్రయిక్ రేట్ 101.21, 112.69 ఏ దశలోనూ రాహుల్‌కు టి20 బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తీసుకురాలేకపోయింది. దేశవాళీ వన్డేల్లో చెప్పుకోదగ్గ రికార్డే (44.40 సగటు) ఉన్నా, అది రాహుల్‌పై ఉన్నముద్రను తొలగించలేకపోగా... అతను టెస్టు క్రికెటర్ మాత్రమేనని, పరిమిత ఓవర్లకు పనికి రాడని అందరిలో ఒకరకమైన నమ్మకం ఏర్పడిపోయింది.
రాత మార్చిన ఐపీఎల్-9
ఈ సీజన్ ఐపీఎల్‌లో సొంతజట్టు బెంగళూరుకు ఎంపికైన రాహుల్‌కు తొలి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత మొదటి రెండు మ్యాచ్‌లు విఫలం కావడంతో పక్కన పెట్టేశారు. టీమ్ ఐదో మ్యాచ్‌లో (గుజరాత్‌తో) తుది జట్టులో ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా టాస్ తర్వాత మన్‌దీప్ గాయపడంతో ప్రత్యర్థి కెప్టెన్ అనుమతితో మళ్లీ రాహుల్‌ను తీసుకోవాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో 35 బంతుల్లో 51 పరుగులు చేయడంతో ఒక్కసారిగా రాహుల్‌పై అందరి దృష్టి పడింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు అర్ధ సెంచరీలతో అతను కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగిపోయాడు.
సీజన్ మొత్తంలో 44.11 సగటుతో 397 పరుగులు చేసి కోహ్లి, ఏబీ తర్వాత ఆర్‌సీబీ తరఫున మూడో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ‘ఐపీఎల్‌లో సమయంలో వారిద్దరితో చాలా సమయం గడిపా. నా శైలి గురించి చెబుతూ పరిమిత ఓవర్లలో నేను సఫలం కావాలంటే ఏం చేయాలో వారిని అడిగా. వారి సూచనలు, సలహాలు ఎంతో ఉపకరించాయి. టి20ల్లో పరుగులు ఎలా రాబట్టాలనేదానిపైనే పూర్తిగా దృష్టి పెట్టా. నేను ఈ ఫార్మాట్ ఆడలేననేవారికి నా గణాంకాలే సమాధానం చెప్పాయి. వరుసగా మూడు అర్ధ సెంచరీల తర్వాత నేను ఎక్కడైనా ఆడగలలనే నమ్మకం ఏర్పడింది’ అని రాహుల్ తన ఐపీఎల్ అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.
వన్డే సిరీస్‌లోనూ...
ఐపీఎల్ ఆట తర్వాత జింబాబ్వే పర్యటనకు రాహుల్‌ను ఎంపిక చేయడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. తన ఎంపికను సరైనదిగా నిరూపిస్తూ రాహుల్ 196 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయ్యాడు. జింబాబ్వే బౌలింగ్ బలహీనం అయితే కావచ్చు గాక... కానీ ఎక్కడా తడబాటు లేకుండా, పూర్తి ఆధిపత్యంతో చక్కటి షాట్లు ఆడటం రాహుల్‌లోని ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. దీని కోసం తాను ఎంతో శ్రమించానని అతను చెప్పాడు. ‘నా బ్యాటింగ్ బలహీనతలను అధిగమించా. వన్డేల్లో, టి20ల్లో వికెట్ల మధ్య చురుగ్గా పరుగెత్తడం, స్ట్రయిక్ రొటేట్ చేయడం, మెరుపు ఫీల్డింగ్ చేయడం అవసరం.
అలాంటి ఆటగాళ్లనే కెప్టెన్‌లు కోరుకుంటారు. దీని కోసం కష్టపడి నా ఫిట్‌నెస్‌ను మరింత మెరుగు పర్చుకున్నా’ అని రాహుల్ అన్నాడు. మూడు వన్డేలలో అతను రెండు సార్లు నాటౌట్‌గానే నిలిచాడు. 168 పరుగుల ఛేదనలో కూడా సెంచరీ చేయగలగడం అతని ఆటతీరును ప్రతిబింబిస్తోంది. తాజా ఫామ్‌ను బట్టి చూస్తే టి20 సిరీస్‌లోనూ అతను ఓపెనర్‌గానే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
అన్నింటికీ రెడీ...
‘బయటి వ్యక్తులే కాదు కొంత మంది కోచ్‌లు కూడా నేను ఈ ఫార్మాట్‌కు పనికి రానని చెబుతూ వచ్చారు. అయితే ఇలా అందరి సలహాలు పట్టించుకోవలసిన అవసరం లేదు. నాకంటూ కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని సమర్థంగా ప్రదర్శించగలననే నమ్మకముంది.
చాలా మందిని నేను తప్పుగా నిరూపించగలిగా’ అని 24 ఏళ్ల లోకేశ్ చెప్పడం అతను ఎంతగా సన్నద్ధమయ్యాడో చూపిస్తోంది. వికెట్‌కీపర్‌గా ఐపీఎల్‌లో కొన్ని సందర్భాల్లో తడబడ్డా, తాజా సిరీస్‌లో ధోనినుంచి ఈ విషయంలో మరింతగా నేర్చుకుంటున్నానన్న రాహుల్‌కు... భవిష్యత్తులో భారత్‌కు మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్ సభ్యుడయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.