టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉందన్న వార్తల నేపథ్యంలో.. ఆసక్తికర అంశాలు తెరమీదకు వచ్చాయి. ఇషాన్ మాదిరి బోర్డు ఆదేశాలు ధిక్కరించే ఆటగాళ్లకు కొత్త నిబంధనలు విధించేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. విశ్రాంతి తీసుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో రంజీల్లో ఆడాల్సిందిగా తన సొంతజట్టు జార్ఖండ్ నుంచి ఇషాన్‌కు ఆహ్వానం కూడా అందింది.
అదే విధంగా.. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. ఇషాన్ దేశవాళీ క్రికెట్‌లో ఆడిన తర్వాతే పునరాగమనం చేయగలడని గట్టిగానే హెచ్చరించాడు. అయినా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇవేమీ పట్టించుకోలేదు. రంజీల్లో ఆడకుండా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ నెట్ సెషన్‌లో పాల్గొనేందుకు వెళ్లాడు.
ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ బరోడాలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన ఈ యువ ఆటగాడి తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడి పేరును తప్పించేందుకు కూడా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపించాయి.
అయితే, ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తాము సెంట్రల్ క్రాంటాక్టుల విషయం చర్చించలేదని స్పష్టం చేశారు. అయితే, ఇకపై యువ ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడేలా బోర్డు చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని చూచాయగా చెప్పారు.
ఈ మేరకు.. ‘‘కొంతమంది ఆటగాళ్లు రెడ్ బాల్(టెస్టు) క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేరని బీసీసీఐ పెద్దలకు తెలిసింది. అలాంటి వాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోలేనపుడు కనీసం ముస్తాక్ అలీ వంటి దేశవాళీ టీ20 ట్రోఫీలోనైనా ఆడాలి.
అందుకూ సిద్ధపడని వాళ్లు.. కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇచ్చే వాళ్లకు ముకుతాడు వేయాలని బోర్డు యోచిస్తోంది. తప్పనిసరిగా 3- 4 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన వాళ్లకు మాత్రమే ఐపీఎల్ ఆడేందుకు అనుమతినివ్వాలని భావిస్తోంది.
రంజీల్లో ఆడేందుకు నిరాకరిస్తే.. ఐపీఎల్ వేలానికి ముందు రిలీజ్ అయిన వాళ్లకు మళ్లీ వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదనే నిబంధన తెచ్చే యోచనలో ఉంది. కొంతమంది రంజీ ట్రోఫీ ఆడటాన్ని తక్కువ చేసి చూడటం బోర్డు దృష్టికి వచ్చింది. అయితే, హార్దిక్ పాండ్యా వంటి ప్రధాన ఆటగాళ్లకు ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా ఇలాంటి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నారు’’ అని సదరు అధికారి పేర్కొనడం విశేషం.
చదవండి: Virat Kohli-Anushka Sharma: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment