వెన్ను నొప్పిని సాకుగా చూపుతూ రంజీల్లో ఆడకుండా (ఐపీఎల్ కోసం) తప్పించుకు తిరుగుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు ప్రచారం నేపథ్యంలో అలర్ట్ అయ్యాడు. బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విధంగా రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడు. తన విషయంలో బీసీసీఐ పెద్దలు సీరియస్‌గా ఉన్నారని గ్రహించిన అయ్యర్ ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాగా, రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు అయ్యర్.. ముంబై క్రికెట్ ఆసోసియేషన్‌కు తప్పుడు సమాచారం అందించిన విషయం తెలిసిందే. బరోడాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఎంసీఏకి నివేదించాడు. అయితే ఇదంతా వట్టిదేనని ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) కొట్టిపారేయడంతో అయ్యర్ డ్రామా బయటపడింది. తప్పుడు నివేదిక నేపథ్యంలో బీసీసీఐ సీరియస్ కావడంతో అయ్యర్ దిగొచ్చినట్లు తెలుస్తుంది. రంజీ సెమీఫైనల్లో ఆడేందుకు అంగీకరించాడని సమాచారం.
ఇదిలా ఉంటే, రంజీల్లో ఆడే విషయంలో శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. అయ్యర్ విషయంలో ఆచితూచి వ్యవహరించిన బీసీసీఐ.. ఇషాన్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైందని సమాచారం. బీసీసీఐ పెద్దలు సహా టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇషాన్‌పై గుర్రుగా ఉన్నాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ గత కొద్ది రోజులుగా ఆటగాళ్లను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment