
టైటాన్స్ జట్టు (Photo Courtesy: BCCI)
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్, గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబడ (Kagiso Rabada)కు భారీ ఊరట లభించింది. అతడిపై ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.
ఈ విషయాన్ని సౌతాఫ్రికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రగ్ ఫ్రీ స్పోర్ట్స్ (SAIDS) సోమవారం ధ్రువీకరించింది. రబడపై నిషేధం తొలగిపోయిందని.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో అతడు వెంటనే గుజరాత్ టైటాన్స్ జట్టుతో చేరేందుకు మార్గం సుగమమైంది.
రూ. 10.75 కోట్లకు కొనుగోలు
కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో గుజరాత్ ఫ్రాంఛైజీ రబడను రూ. 10.75 కోట్ల మేర భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల అనంతరం అతడు ‘వ్యక్తిగత కారణాలతో’ దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు. అయితే, ఇందుకు గల స్పష్టమైన కారణాన్ని మాత్రం ఐపీఎల్ యాజమాన్యం బయటకు వెల్లడించలేదు. రబడ త్వరలో మళ్లీ జట్టుతో చేరతాడని కూడా టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టోర్నీ మధ్యలో ప్రకటించాడు.

PC: BCCI/IPL
అలాంటివి ఇందులో ఉన్నాయి.. అయితే..
అయితే కొన్ని రోజుల క్రితం అసలు వాస్తవం బయటకు వచ్చింది. డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా దొరికిపోవడంతో రబడపై సస్పెన్షన్ వేటు పడింది. సరదా కోసం తీసుకునే (రిక్రియేషనల్) డ్రగ్‌ను రబడ వాడినట్లు తేలడంతో ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే, పూర్తి స్థాయిలో ఇంకా ఎంత కాలం సస్పెన్షన్ వేటు పడుతుందనేదానిపై స్పష్టత రాలేదు.
తాజాగా SAIDS ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. రబడపై నెల రోజుల పాటు పడిన నిషేధం తొలగిపోయినట్లు తెలిపింది. ‘‘రబడపై సస్పెన్షన్ నేపథ్యంలో అతడు ఇండియా నుంచి వెంటనే సౌతాఫ్రికాకు తిరిగి వచ్చాడు.
అయితే, డ్రగ్స్ వాడకానికి సంబంధించి రబడ తన తప్పును అంగీకరించాడు. కానీ దురుద్దేశంతో వాటిని వాడలేదన్న అతడి వాదన సబబుగానే ఉంది. వెంటనే అతడు మళ్లీ మైదానంలో దిగవచ్చు.
క్రీడా రంగం వెలుపలి సమాజంలో ఈ పదార్థాలు ఎక్కువగా దుర్వినియోగమవుతాయి కాబట్టి వీటిని అందరూ తప్పుగానే చూస్తున్నారు. కొకైన్, హెరాయిన్, ఎండిఎంఎ/ఎక్సటసీ, టీహెచ్‌సీ వంటివి ఇందులో ఉన్నాయి’’ అని సోమవారం నాటి ప్రకటనలో వెల్లడించింది.
కాగా క్రీడల్లో మెరుగైన ప్రదర్శనకు ఉపయోగపడే డ్రగ్స్ తరహాలో కాకుండా కొకైన్, హెరాయిన్, గంజాయివంటివాటిని రిక్రియేషనల్ డ్రగ్స్‌గా వ్యవహరిస్తారు. పోటీలు లేని సమయంలో ఆటగాళ్లు వీటిని వాడుతుంటారు. సాధారణంగా ఇలాంటి డ్రగ్స్ వాడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా నాలుగేళ్ల వరకు నిషేధం పడుతుంది.
సరదా కోసమే వాటిని వాడానని నిరూపిస్తే
అయితే తాను సరదా కోసమే వాటిని వాడానని, ఆ సమయంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగడం లేదని సదరు ప్లేయర్ నిరూపించగలిగితే కేవలం 3 నెలల నిషేధం విధిస్తారు. ఇక రబడ విషయానికొస్తే.. సొంతగడ్డపై జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ టోర్నీ సమయంలో అతడు ఈ డ్రగ్ తీసుకున్నట్లుగా సమాచారం.
ఇక ఇప్పుడు నెల రోజుల నిషేధం తొలగిపోవడంతో అటు గుజరాత్ టైటాన్స్‌తో చేరడంతో పాటు జూన్‌లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్లోనూ అతడు ఆడేందుకు లైన్ క్లియర్ అయింది.
కాగా ఐపీఎల్-2025లో కగిసో రబడ రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు తీశాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక రబడ రాకతో ఆ జట్టు పేస్ దళం మరింత పటిష్టంగా మారుతుందనడంలో సందేహం లేదు.
కాగా టైటాన్స్‌లో మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ, గెరాల్డ్ కోయెట్జి తదితర ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీరిలో ప్రసిద్ పది మ్యాచ్‌లలో 19 వికెట్లు కూల్చి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. గుజరాత్ తమ పదకొండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో మంగళవారం తలపడుతుంది.
చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే..