వార్షిక క్రాంటాక్టుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ అనుసరించిన తీరుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విస్మయం వ్యక్తం చేశాడు. ఏ నిబంధనైనా టీమిండియా ఆటగాళ్లందరికీ ఒకేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
భారత జట్టు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ఇలాంటి పోకడలు నష్టం చేకూరుస్తాయని పఠాన్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల విషయంలో టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పేర్లు గల్లంతైన విషయం తెలిసిందే.
రంజీ టోర్నీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశారన్న కారణంగానే వీళ్లిద్దరికి మొండిచేయి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
‘‘శ్రేయస్, ఇషాన్ ఇద్దరూ ప్రతిభావంతులైన క్రికెటర్లే. తిరిగి పుంజుకుని రెట్టించిన ఉత్సాహంతో వాళ్లిద్దరు కమ్‌బ్యాక్ ఇస్తారనే అనుకుంటున్నా. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడకూడదు అనుకున్నపుడు.. కనీసం దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనైనా వాళ్లను ఆడించాలి కదా?
జాతీయ జట్టుకు దూరమైనపుడు వాళ్లు కూడా దేశవాళీ బరిలో దిగాలి కదా? ఒకవేళ ఈ నిబంధన అందరికీ వర్తింపజేయకుంటే.. భారత క్రికెట్ అనుకున్న లక్ష్యాలను ఎన్నటికీ సాధించలేదు’’ అని ఎక్స్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు.
కాగా గతేడాది వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ టీమిండియా తరఫున ఇంతవరకు రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే, ఐపీఎల్-2024 బరిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగేందుకు జిమ్‌లో చెమటోడుస్తున్నాడు.
మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ రంజీ సెమీస్‌లో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడుతో ముంబై ఆడబోయే ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు
They are talented cricketers, both Shreyas and Ishan. Hoping they bounce back and come back stronger. If players like Hardik don’t want to play red ball cricket, should he and others like him participate in white-ball domestic cricket when they aren’t on national duty? If this…
— Irfan Pathan (@IrfanPathan) February 29, 2024
Comments
Please login to add a commentAdd a comment