
ప్రతిష్టాత్మక దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అబ్దుల్ సమద్ చరిత్ర సృష్టించాడు. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో సమద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన తొలి జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 117 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేసిన సమద్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 108 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సమద్ ట్విన్ సెంచరీస్‌తో చెలరేగడంతో ఒడిషాతో మ్యాచ్‌లో జమ్మూ అండ్ కశ్మీర్ పటిష్ట స్థితికి చేరింది.
జమ్మూ అండ్ కశ్మీర్ ఒడిషా ముందు 269 పరుగల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఒడిషా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. ఇవాళే (అక్టోబర్ 21) ఆటకు చివరి రోజు కాగా.. ఒడిషా ఇంకా 230 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. సందీప్ పట్నాయక్ (17), బిప్లబ్ సమంత్రే (4) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 2, సాహిల్ లోత్రా, ఉమర్ నజీర్ మిర్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సమద్ అజేయ సెంచరీతో పోరాడగా.. శుభమ్ ఖజూరియా 43, శుభమ్ పుండిర్ 40 పరుగులు చేశారు. ఒడిషా బౌలర్లలో ప్రధాన్ 3, కార్తీక్ బిస్వాల్ 2, సుమిత్ శర్మ, డి ప్రధాన్ తలో వికెట్ పడగొట్టారు.
దీనికి ముందు ఒడిషా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. ఒడిషా కెప్టెన్ గోవిందా పొద్దార్ అజేయ సెంచరీతో (133) సత్తా చాటాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 4, ఉమర్ నజీర్ 3, ఆకిబ్, యుద్ద్‌వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ సమద్ ఒక్కడే సెంచరీతో సత్తా చాటాడు. ఒడిషా బౌలర్లలో సుమిత్ శర్మ ఐదు వికెట్లు తీశాడు.
చదవండి: దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment