
నాలుగేళ్ల తర్వాత...
భారత జట్టులో అమిత్ మిశ్రా
శ్రీలంక పర్యటనకు 15 మందితో జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ముందే ఊహించినట్లుగా మార్పులేమీ లేకుండానే శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. మూడో స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చాడు. నాలుగేళ్ల క్రితం చివరిసారిగా భారత్ తరఫున టెస్టు ఆడిన 32 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌లో పర్యటించిన 14 మందిలో లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ గాయం కారణంగా అందుబాటులో లేడు.
దీంతో మిశ్రాకు లైన్ క్లియర్ అయింది. గాయం కారణంగానే బంగ్లా పర్యటన నుంచి తప్పుకున్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. హర్భజన్ సింగ్ స్థానాన్ని నిలబెట్టుకోగా... నలుగురు పేసర్లపై సెలక్టర్లు నమ్మకముంచారు. ‘శ్రీలంకలో పరిస్థితుల దృష్ట్యా లెగ్ స్పిన్నర్ అవసరం ఉంది. మాకు మిశ్రాపై ఎప్పుడూ నమ్మకం ఉంది. ఓజా పేరు కూడా చర్చకు వచ్చినా లెగ్ స్పిన్నర్ కావాలని భావించాం’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ చెప్పారు.
న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో జట్టు ఎంపిక కేవలం 30 నిమిషాల్లోనే పూర్తయింది. జింబాబ్వే పర్యటనలో వన్డేల్లో రాణించిన అక్షర్ పటేల్‌ను జట్టులోకి ఎంపిక చేయలేదు. అలాగే గాయం నుంచి కోలుకోకపోవడం వల్ల షమీ కూడా జట్టులోకి రాలేదు. జట్టులో రిజర్వ్ వికెట్ కీపర్ కూడా లేడు. ఒకవేళ అవసరమైతే ఎవరిని పంపించాలో తమకు స్పష్టత ఉందని పాటిల్ చెప్పారు.
యువ స్పిన్నర్లు లేరా?
సాధారణంగా ఏ జట్టయినా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. భార త సెలక్టర్లు మాత్రం ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌తో పర్యటనకు వెట రన్ హర్భజన్‌ను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యకర నిర్ణయమైతే... శ్రీలం క పర్యటనకు హర్భజన్‌తో పాటు మరో వెటరన్ అమిత్ మిశ్రానూ తెచ్చారు. ఈ ఇద్దరి ఎంపికను బట్టి చూస్తే దేశంలో యువ స్పిన్నర్లు లేరా అనే సందేహం వస్తోంది. సందీప్ పాటిల్ చెబుతున్న ప్రకారం ఆటగాళ్ల వయసు కంటే ఫిట్‌నెస్ ముఖ్యం. హర్భజన్, అమిత్ మిశ్రా ఇద్దరూ మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నందున వయసు గురిం చి ఆందోళన వద్దనేది ఆయన అభిప్రాయం. దేశంలో లక్షలాది మంది క్రికెట్ ఆడుతున్నారు. వందలాది మంది స్పిన్నర్లు రకరకాల ఫార్మాట్‌ల లో, టోర్నీలలో సత్తా చాటుతున్నారు. అయినా వీరెవరినీ లెక్కలోకి తీసుకోకుండా మళ్లీ పాతత రం వైపే చూడటం అంత మంచి సంకేతం కాదు.
ఒక విధానం లేకుండా...
గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో భారత జట్టు టెస్టు పర్యటన సమయంలో సెలక్టర్లు చెప్పిన మాటలు మరోలా ఉన్నాయి. కరణ్‌శర్మ, జడేజా, అశ్విన్ అప్పుడు జట్టులో ఉన్న స్పిన్నర్లు. ‘భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ స్పిన్నర్లను ఎంపిక చేశాం. ఆస్ట్రేలియా లాంటి కఠినమైన పర్యటనకు వెళ్లడం వల్ల వీళ్లు రాటుదేలతారు’ అనేది నాటి సెలక్టర్ల మాట. మరి ఇప్పుడు ఆ భవిష్యత్తు ఏమయింది? మళ్లీ ఎందుకు పాత బాట పట్టారనేదానికి సమాధానాలు లేవు.
ధోని రిటైర్ కాగానే హర్భజన్‌ను ఏ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని జట్టులోకి తెచ్చారో తెలియదు. అలాగే బంగ్లాదేశ్ తో టెస్టుల్లో అశ్విన్‌తో పోలిస్తే హర్భజన్ తేలిపోయాడు. స్పిన్ విభాగంలో వైవిధ్యం కావాలనుకుంటే ఒక ఆఫ్ స్పిన్నర్‌తో పాటు లెగ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉండాలి. మరి ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఎందుకు? అలాగే అమిత్ మిశ్రాకు కుంబ్లే రిటైరైన తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ వినియోగించుకోలేకపోయాడు. అలాంటప్పుడు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న 21 ఏళ్ల శ్రేయస్ గోపాల్ లాంటి యువ లెగ్ స్పిన్నర్ ఎందుకు కనిపించలేదో మరి..?
టెస్టు జట్టు: కోహ్లి( కెప్టెన్), ధావన్, విజయ్, లోకేశ్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్, సాహా, హర్భజన్, అశ్విన్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్, భువనేశ్వర్, వరుణ్ ఆరోన్.
శ్రీలంకతో టెస్టు సిరీస్ షెడ్యూల్
ఆగస్టు 12-16: తొలి టెస్టు (గాలె)
ఆగస్టు 20-24: రెండో టెస్టు (కొలంబో)
ఆగస్టు 28-సెప్టెంబరు 2: మూడో టెస్టు (కొలంబో)