రాహుల్ జిగేల్.. కోహ్లి కమాల్ | Lokesh Rahul Thanks Patience, Virat Kohli for Maiden Test Century at Sydney | Sakshi
Sakshi News home page

రాహుల్ జిగేల్.. కోహ్లి కమాల్

Published Fri, Jan 9 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

రాహుల్ జిగేల్.. కోహ్లి కమాల్

రాహుల్ జిగేల్.. కోహ్లి కమాల్

కళ్లెదురుగా కొండంత స్కోరు కనిపిస్తోంది... అనుభవం చూస్తే ఒక్కటే టెస్టు... కొత్త కుర్రాడు... అయినా లోకేశ్ రాహుల్ బెదరలేదు, తడబడలేదు. ఆసీస్ పేసర్ల యుక్తులకు తన టెక్నిక్‌తో జవాబు చెప్పాడు. ఆడుతున్న రెండో టెస్టులోనే ఆసీస్ గడ్డపై సెంచరీతో రాహుల్ ద్రవిడ్ వారసుడిలా కనిపించాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రస్తుతం ఆపేవాళ్లే కనిపించడం లేదు. సిరీస్‌లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా నాలుగో సెంచరీ బాదాడు.
కళ్లు చెదిరే షాట్లతో అజేయ సెంచరీ చేసి ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు.

 
రాహుల్, కోహ్లిల శతకాలతో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా బదులిచ్చింది. అయితే ఇక్కడితో కథ ముగియలేదు. మరో రెండు రోజుల ఆట మిగిలింది. భారత్ ఇంకా ఫాలోఆన్ మార్కునూ దాటలేదు. కోహ్లితో పాటు క్రీజులో ఉన్న సాహాను మినహాయిస్తే... ఇక మిగిలిన వాళ్లంతా బౌలర్లే. కాబట్టి కోహ్లి మరింత బాధ్యతగా ఆడాలి. నాలుగో రోజు కనీసం రెండు సెషన్లు క్రీజులో నిలబడితే ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకోవచ్చు.

 
శతకంతో చెలరేగిన కెప్టెన్
* సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్
* తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 342/5
* ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు

 
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ దీటుగా జవాబిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (214 బంతుల్లో 140 బ్యాటింగ్; 20 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (262 బంతుల్లో 110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీల మోత మోగించడంతో గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 115 ఓవర్లలో 5 వికెట్లకు 342 పరుగులు చేసింది. కోహ్లితో పాటు సాహా (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.రోహిత్ (53) ఫర్వాలేదనిపించినా... రహానే (13), రైనా (0)లు విఫలమయ్యారు. వికెట్ నుంచి సహకారం లేకపోవడంతో తొలి రెండు సెషన్లలో పెద్దగా ప్రభావం చూపని ఆసీస్ బౌలర్లు చివరి గంటలో చకచకా మూడు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రస్తుతం భారత్ ఇంకా 230 పరుగులు వెనుకబడి ఉంది. స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.
 
స్కోరు వివరాలు:-
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) అండ్ (బి) స్టార్క్ 110; రోహిత్ (బి) లయోన్ 53; కోహ్లి బ్యాటింగ్ 140; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) వాట్సన్ 13; రైనా (సి) హాడిన్ (బి) వాట్సన్ 0; సాహా బ్యాటింగ్ 14; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (115 ఓవర్లలో 5 వికెట్లకు) 342.
వికెట్ల పతనం: 1-0; 2-97; 3-238; 4-292; 5-292
బౌలింగ్: స్టార్క్ 21-4-77-2; హారిస్ 23-6-63-0; హాజెల్‌వుడ్ 20-5-45-0; లయోన్ 32-7-91-1; వాట్సన్ 15-4-42-2; స్మిత్ 4-0-17-0.
 
కోహ్లి రికార్డుల మోత

* ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (639). గతంలో ద్రవిడ్ (619) టాప్ స్కోరర్. అయితే ద్రవిడ్ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులను కోహ్లి ఏడో ఇన్నింగ్స్‌లలోనే అధిగమించాడు.
* జట్టు కెప్టెన్‌గా తన తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ విరాట్. గతంలో గ్రెగ్ చాపెల్ రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు చేశాడు.
* ఒక టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. గతంలో 1978-79లో వెస్టిండీస్‌పై గవాస్కర్ ఈ ఘనత సాధించారు.
* ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో విదేశీ క్రికెటర్ విరాట్. గతంలో ఇంగ్లండ్ క్రికెటర్ సట్‌క్లిఫ్ (1924-25), దక్షిణాఫ్రికా క్రికెటర్ హామండ్ (1928-29) మాత్రమే ఈ ఘనత సాధించారు.
* ఆస్ట్రేలియా గడ్డపై నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ కోహ్లి.
 
సెషన్-1: నత్త నడక
71/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన రోహిత్, రాహుల్ ఒక్కో పరుగు జోడించుకుంటూ వెళ్లారు. పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో ఆసీస్ బౌలర్లు ఎక్కడా లైన్ తప్పకుండా ఓపిగ్గా బౌలింగ్ చేశారు. ఈ జోడి తొలి గంటలో 15 ఓవర్లలో మూడు బౌండరీలతో 19 పరుగులు మాత్రమే చేసింది. అయితే రెండో గంటలో మాత్రం పరుగుల వేగం పెరిగింది. మరోవైపు బౌన్స్‌ను, టర్న్‌ను సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్ లయోన్ 44వ ఓవర్‌లో రాహుల్‌ను అవుట్ చేసినంత పని చేశాడు.షార్ట్‌లెగ్‌లో బంతి బర్న్స్‌ను తాకుతూ వెళ్లడంతో బ్యాట్స్‌మన్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే అదే ఓవర్  నాలుగో బంతిని స్వీప్ చేయబోయిన రోహిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన కోహ్లి ఎదుర్కొన్న తొలి బంతిని కాస్త తడబడుతూ ఆడాడు.

అయితే అప్పటికే సగం పిచ్ వరకు పరుగెత్తుకుంటూ వచ్చిన రాహుల్‌ను వెనక్కి పంపాడు. అయితే కమిన్స్ మరో ఎండ్ వైపు త్రో విసరడంతో రాహుల్ బతికిపోయాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్ క్యాచ్ మిస్ చేయడంతో బయటపడ్డ రాహుల్ 161 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని లంచ్‌కు వెళ్లాడు.
 
ఓవర్లు: 30; పరుగులు: 51; వికెట్లు: 1
 
సెషన్-2: రాహుల్ జోరు
బౌలర్లకు సహకారం లేకపోవడం, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో రాహుల్, కోహ్లి నింపాదిగా ఆడారు. లంచ్‌కు ముందు కేవలం 51 పరుగులు మాత్రమే చేసిన భారత్... ఆ తర్వాత వేగంగా ఆడింది. తొలి గంటలో 45, రెండో గంటలో 67 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న కోహ్లి దూకుడుగా ఆడాడు. 108 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు.ఈ జంటను విడదీసేందుకు బౌలర్లను పదేపదే మార్చినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఇద్దరు అలవోకగా పరుగులు చేయడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే రెండో కొత్త బంతిని తీసుకున్న తర్వాత 83వ ఓవర్‌లో విరాట్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్టార్క్ వేసిన బంతి కోహ్లి బ్యాట్‌ను తాకుతూ వెళ్లినా.. రెండో స్లిప్‌లో స్మిత్ దాన్ని అందుకోలేకపోయాడు. రెండు ఓవర్ల తర్వాత రాహుల్ 253 బంతుల్లో కెరీర్‌లో తొలి శతకాన్ని సాధించాడు.  

ఓవర్లు: 30; పరుగులు: 112; వికెట్లు: 0
 
సెషన్-3: ఆకట్టుకున్న కోహ్లి
దాదాపుగా తొలి రెండు సెషన్లలో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన భారత్‌ను టీ తర్వాత ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. చివరి గంటలో చకచకా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. టీ తర్వాత రెండో ఓవర్‌లోనే లోకేశ్‌ను అవుట్ చేసి బౌలర్లు పైచేయి సాధించారు. విరాట్, రాహుల్ మధ్య మూడో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. తర్వాత వచ్చిన రహానే (13)ను నిలబెట్టి కోహ్లి వేగంగా ఆడాడు.

దీంతో నాలుగో వికెట్‌కు 54 పరుగులు పూర్తయ్యాయి. ఇక్కడ భారత్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. వాట్సన్ వరుస బంతుల్లో రహానే, రైనా (0)లను పెవిలియన్‌కు పంపాడు. సహచరులు వెనుదిరిగినా జోరు తగ్గకుండా ఆడిన కోహ్లి కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేశాడు. చివరి వరకు జాగ్రత్తగా ఆడిన ఈ జోడి మరో వికెట్ పడకుండా రోజును ముగించింది.
 
ఓవర్లు: 30; పరుగులు: 108; వికెట్లు: 3
 
స్పైడర్‌కామ్‌తోనే ఇబ్బంది!
మూడో రోజు ఆట కంటే స్మిత్ క్యాచ్ మిస్ చేసిన తీరుపైనే ఎక్కువ చర్చ నడిచింది. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ వేసిన బంతి రాహుల్ బ్యాట్‌ను తాకి గాల్లో చాలా పైకి లేచింది. స్లిప్‌లో ఉన్న స్మిత్ వెనక్కి పరుగెత్తుతూ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి కోసం పైకి చూస్తున్న క్రమంలో కంటికి స్పైడర్‌కామ్ తీగ ఒకటి అడ్డుగా వచ్చింది. దీంతో కెప్టెన్ తడబడి క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఇదే విషయంపై అంపైర్ రిచర్డ్ కెటిల్‌బోర్గ్‌తో కెప్టెన్ చర్చించాడు. అయితే బంతి కెమెరాకుగానీ, వైర్లకు గానీ తాకలేదని సీఏ, నైన్ నెట్‌వర్క్ ఓ ప్రకటనను విడుదల చేశాయి. స్మిత్ కంటికి వైర్ అడ్డుగా వచ్చిందని స్పష్టం చేశాయి. ఫీల్డింగ్ చేసేటప్పుడు స్పైడర్‌కామ్ అడ్డుగా ఉందని ఏ ఆటగాడైనా భావిస్తే దాన్ని అక్కడి నుంచి పక్కకు జరపమని అంపైర్‌ను అడగొచ్చు.

ఒకే సిరీస్‌లో ఇద్దరు కెప్టెన్లు కలిసి ఆరు సెంచరీలు చేయడం సరికొత్త రికార్డు (కెప్టెన్‌గా కోహ్లి మూడు, స్మిత్ మూడు శతకాలు చేశారు)
 
ఒకే సిరీస్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ (కోహ్లి, స్మిత్) నాలుగు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
 
‘సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెల్‌బోర్న్‌లోనే ఇది రావాల్సి ఉంది. ఇదే నా తొలి మ్యాచ్ అన్న తరహాలో బ్యాటింగ్ చేశా. బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి రావడంతో కుదురుకోవడానికి మంచి సమయం లభించింది. వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. ఆసీస్ బౌలర్లు వికెట్ల కోసం చాలా ప్రయత్నించారు. సెషన్ల వారిగా బ్యాటింగ్ చేయాలని భావించా. ఈ టెస్టుకు జట్టులో చోటు అంత సులభంగా దక్కలేదు.కోహ్లితో పాటు నాకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. నెట్స్‌లో ఫ్లెచర్, శాస్త్రి అద్భుతమైన సలహాలు ఇచ్చారు. క్యాచ్ ఇచ్చినందుకు బాధగా లేదు. అయితే నిర్లక్ష్యపు షాట్ ఆడినందుకు నిరాశపడుతున్నా. ఇక నుంచి షాట్ల ఎంపికపై చాలా జాగ్రత్తగా ఉంటా. శుక్రవారం మేం మెరుగ్గా బ్యాటింగ్ చేసి బౌలర్లు కష్టపడితే మ్యాచ్ గెలిచే అవకాశాలున్నాయి.’    
-రాహుల్ (భారత్ బ్యాట్స్‌మన్)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement