Captain Virat Kohli
-
రవిశాస్త్రినే రైట్
ఓ ఎంపిక తంతు ముగిసింది...! టీమిండియా ప్రధాన కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రికే అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సాధించలేకపోయినా... జట్టు కూర్పులో విమర్శలెదుర్కొన్నా... కెప్టెన్ విరాట్ కోహ్లి అండదండలు సమృద్ధిగా ఉన్న అతడు... అందరినీ తోసిరాజంటూ మరో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు. హెడ్‌కోచ్ ఎంపిక కోసం శుక్రవారం ముంబైలో సమావేశమైన దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)... రవిశాస్త్రి నియామకానికి ఏకగీవ్రంగా అంగీకరించింది. కుదించిన జాబితాలో శాస్త్రి సహా మొత్తం ఆరుగురు ఉండగా, వీరిలో చివరి దశకు ముగ్గురే మిగిలారు. అందులోంచి అంతా అనుకుంటున్నట్లుగా... ముందే నిర్ణయించేసినట్లుగా... ‘రవి భాయ్’కే పట్టం కట్టారు. ముంబై: పెద్దగా మలుపులేం లేవు. అనూహ్యమేమీ జరగలేదు. అంచనాలకు తగ్గట్లే, కెప్టెన్ కోహ్లి మనోగతానికి అనువుగానే అంతా సాగిపోయింది. భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పదవి 2021 టి20 ప్రపంచకప్ వరకు పదిలమైంది. తాము ప్రామాణికంగా నిర్దేశించుకున్న శిక్షణా రీతులు, అనుభవం, సాధించిన ఘనతలు, సమాచారం వినియమం, ఆధునిక శిక్షణా పరిజ్ఞానం అనే ఐదు అంశాలకు శాస్త్రినే తగినవాడంటూ కపిల్, మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామితో కూడిన సీఏసీ సభ్యులు నిర్ణయం వెలువరించారు. ఈ పదవికి దరఖాస్తు చేసిన న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, శ్రీలంకకు కోచ్‌గా పనిచేసిన టామ్ మూడీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం రోజంతా సమావేశమైన కపిల్ బృందం... వీరితోపాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రాబిన్‌సింగ్, జట్టు మాజీ మేనేజర్ లాల్‌సింగ్ రాజ్‌పుత్‌లను ఇంటర్వ్యూ చేసింది. మరో దరఖాస్తుదారు ఫిల్ సిమన్స్ (వెస్టిండీస్) మాత్రం అంతకుముందే తప్పుకొన్నాడు. హెసన్, రాబిన్‌సింగ్, రాజ్‌పుత్ నేరుగా హాజరై తమ ప్రణాళికలు వివరించారు. మూడీ, ప్రస్తుతం భారత జట్టుతో కరీబియన్ దీవుల పర్యటనలో ఉన్న రవిశాస్త్రి టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రక్రియలో పాల్గొన్నారు. 2017 జులైలో శాస్త్రిని హెడ్ కోచ్‌గా అప్పటి సీఏసీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఎంపిక చేశారు. అప్పట్లో అతడి నియామకంపై వీరంతా కెప్టెన్‌గా కోహ్లి అభిప్రాయాన్ని తీసుకు న్నారు. ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నామని కపిల్ తెలిపాడు. డైరెక్టర్‌గా వచ్చి... కోచ్‌గా పాతుకుపోయాడు 2014 వరకు పూర్తిస్థాయి వ్యాఖ్యాతగా ఉన్న రవి ఆ ఏడాది ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడటంతో వన్డే సిరీస్‌కు టీమ్ డైరెక్టర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో నియమితుడయ్యాడు. నాటి కోచ్ డంకన్ ఫ్లెచర్ ఉండగానే డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు చూశాడు. ఫ్లెచర్ 2015 ప్రపంచ కప్ అనంతరం వైదొలిగాక, 2016 జూన్‌లో మేటి స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోచ్‌గా వచ్చేవరకు డైరెక్టర్ కమ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2017 జూలైలో కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే తప్పుకోవడంతో ప్రధాన కోచ్ అయ్యాడు. తాజా ఎంపికకు అతడి ఆధ్వర్యంలో జట్టు సాధించిన విజయాలు ఓ కారణంగా చెబుతున్నారు. శాస్త్రి హయాంలో భారత్ 2017–18 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గింది. ఇటీవలి వన్డే ప్రపంచ కప్‌లో లీగ్ దశలో టాప్‌లో నిలిచి సెమీస్ చేరింది. మధ్యలో ఆసియా కప్ వంటి చిన్నాచితక టోర్నీలు, స్వదేశంలో సిరీస్‌లు గెలుచుకుంది. ఇప్పుడు 2021 వరకు ఎంపిక చేసినందున బహుశా భారత క్రికెట్ చరిత్రలో ఎక్కువ కాలం కోచ్‌గా పనిచేసినవాడిగా రికార్డులకెక్కుతాడు. కోహ్లి వ్యాఖ్యల ప్రభావం లేదు ‘కోచ్ ఎంపికలో మేం కోహ్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ అలానే చేసి ఉంటే... మిగతా జట్టు సభ్యులందరి అభిప్రాయాలు తీసుకునేవారం. ఈ విషయంలో మేమెవరినీ సంప్రదించలేదు. అసలు అందుకు అవకాశమే లేదు. ప్రపంచ కప్ సాధించనంత మాత్రాన వేటు వేయాలని ఏమైనా ఉందా? మీరు మొత్తం విజయాలను చూడండి. వారి ప్రజంటేషన్‌నే మేం చూశాం. దాని ప్రకారమే వెళ్లాం. అందరూ నిపుణులే అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ రవిశాస్త్రిని ముందంజలో నిలిపాయి’ – రవిశాస్త్రి ఎంపికపై కపిల్ స్పందన -
రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన
అవకాశం వచ్చినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తాను. నాలో అభద్రతాభావం ఉంటే ఇలా చేసేవాడినా? భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందన ఇది. ఇటీవల తనకు, రోహిత్‌కు పడటం లేదంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అతను తెర దించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా దాటవేత ధోరణి లేకుండా ఈ అంశంపై కోహ్లి పూర్తి స్పష్టతనిచ్చాడు. పేరుకు వెస్టిండీస్‌తో సిరీస్‌కు బయల్దేరడానికి ముందు జరుగుతున్న అధికారిక మీడియా సమావేశమే అయినా రోహిత్‌తో సంబంధాల గురించే కోహ్లి వివరణ సుదీర్ఘంగా సాగింది. కోచ్ రవిశాస్త్రి కూడా కెప్టెన్‌తో జత కలిసి జట్టు ప్రయోజనాల కోసమే ఎవరైనా ఆడతారని, జట్టుకంటే ఎవరూ ఎక్కువ కాదంటూ ‘గాలివార్తలను’ కొట్టిపారేశాడు. కోహ్లి తాజా సమాధానాలతోనైనా విభేదాల వార్తలకు ఫుల్స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. ముంబై: భారత కెప్టెన్ కోహ్లి తన డిప్యూటీ రోహిత్ శర్మతో విభేదాల వార్తలపై పెదవి విప్పాడు. జట్టులో అంతా బాగుందని, ఎవరో కావాలని ఇలాంటివి పుట్టిస్తున్నారని ఒకింత అసహనాన్ని ప్రదర్శించాడు. టి20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు సోమవారం రాత్రి టీమిండియా సభ్యులు విండీస్ బయల్దేరారు. దానికి ముందు కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మీడియాతో సంభాషించారు. విశేషాలు కోహ్లి మాటల్లోనే... రోహిత్‌తో విభేదాల గురించి వాస్తవాలేమిటి? నేను కూడా బయటి నుంచి కొన్ని రోజులుగా ఎన్నో విషయాలు వింటున్నాను. నిజంగా జట్టు సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం లేకపోతే నాకు తెలిసి ఇంతటి విజయాలు సాధ్యం కావు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో జట్టు ప్రదర్శనలో డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి సంబంధాలు, నమ్మకం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గత 2–3 ఏళ్లలో మేం ఎన్నో గొప్ప ఘనతలు సాధించాం. వన్డేల్లో ఏడో స్థానం నుంచి నంబర్‌వన్‌కు చేరుకున్నాం. ఒకరిపై మరొకరికి పరస్పర విశ్వాసం, సమన్వయం, తగిన గౌరవం లేకపోతే ఇదంతా జరగకపోయేది. నిజంగా సంబంధాలు బాగా లేకపోతే అది మైదానంలో ప్రతిఫలిస్తుంది. ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందన ఏమిటి? ఇవన్నీ చాలా చికాకు పరుస్తాయి. మేం జనంలోకి వెళితే మీరు వరల్డ్ కప్‌లో చాలా బాగా ఆడారంటూ ప్రశంసలు వినిపిస్తుంటే మరోవైపు ఇలాంటి హాస్యాస్పద మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మన మెదళ్లలోకి వాటిని నింపి నిజమని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. జట్టుకు సంబంధించిన విజయాలు, సానుకూలాంశాల గురించి అసలేమీ తెలియనట్లుగా నటిస్తున్నారు. వ్యక్తిగత అంశాలను ఆటలోకి తీసుకురావడం అందరినీ అగౌరవపర్చడమే. నేను చాలా కాలంగా ఇలాంటివి అనుభవిస్తూనే ఉన్నాను. మా జట్టు డ్రెస్సింగ్ రూమ్ ఎంత బాగుంటుందో వచ్చి చూడండి. కుల్దీప్తో ఎలా మాట్లాడతాం, ధోనిలాంటి సీనియర్‌ను ఎలా ఆటపట్టిస్తామో వీడియో తీసి చూపించలేను కదా? రోహిత్‌తో అంతా బాగున్నట్లేనా! నా గురించి ఒక్క మాట చెబుతాను. నిజంగా నాకు ఎవరిపైనైనా కోపం ఉంటే అది నా ముఖంలో కనిపిస్తుంది. నాకు ఎలాంటి అభద్రతాభావం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసించేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఎందుకంటే అతనిపై నాకు నమ్మకముంది. రోహిత్ దానికి అర్హుడు. నేను 10 ఏళ్లుగా, రోహిత్ 11 ఏళ్లుగా ఆడుతున్నాం. జట్టును ఈ స్థాయికి తెచ్చేందుకు నాలుగేళ్లుగా కలిసి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మేం బతికేది, శ్వాసించేది, ఏం చేసినా భారత క్రికెట్ బాగు కోసమే. మా మధ్య ఎలాంటి సమస్య లేదు. ఇలాంటివి పుట్టించి ఎవరు లాభపడుతున్నారో అర్థం కావడం లేదు. మిడిలార్డర్ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? దీనిపై కచ్చితంగా ఇలాగే చేయాలంటూ పరిష్కారం ఏమీ లేదు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే. టాపార్డర్ బాగుందంటూ ప్రశంసించిన వారే మిడిలార్డర్‌కు బ్యాటింగ్ అవకాశం రాలేదంటారు. రాక రాక ఒక మ్యాచ్‌లో అవకాశం వచ్చి వారు విఫలమైతే 1–2 మ్యాచ్‌లతోనే వారి ప్రదర్శనను ఎలా అంచనా వేస్తాం! నాలుగో స్థానం గురించి బెంగ ఏమీ లేదు. ప్రపంచ కప్‌లో ఓడినంత మాత్రాన ఏదో ప్రమాదం జరిగినపోయినట్లు కాదు. రవిశాస్త్రికే నా ఓటు... కోచ్ రవిశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని కోహ్లి మరోసారి ప్రదర్శించాడు. ఒకవైపు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) హెడ్ కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే తన ఓటు మాత్రం శాస్త్రికేనని బహిరంగంగా మద్దతిచ్చేశాడు. ‘కోచ్ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు, శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేసేశాడు. రాబోయే విండీస్ పర్యటన ఎలా ఉండబోతోంది? మంచి ఆటకు, వినోదానికి అనువైన దేశం వెస్టిండీస్. ఈ టూర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ముందుగా టి20ల్లో కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించి ప్రయత్నించాలని భావిస్తున్నాం. అయితే టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో ఈ సారి టెస్టు సిరీస్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లతో పోలిస్తే ఇకపై ప్రతీ టెస్టులో సవాళ్లు, తీవ్రత ఎక్కువ ఉంటాయి. టెస్టులు బతికేందుకు ఇది చాలా అవసరం. నా దృష్టిలో కూడా మొదటి ప్రాధాన్యత, నేను ఇష్టపడేది కూడా సుదీర్ఘ ఫార్మాట్‌నే. -
టుస్సాడ్స్‌లో కోహ్లి...
న్యూఢిల్లీ: తన ఆటతో దేశ విదేశాల్లో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. దేశ రాజధానిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు బొమ్మ ప్రతిష్టించనున్నట్లు మ్యూజియం నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ విగ్రహాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో విరాట్ దిగ్గజాల సరసన నిలవనున్నాడు. దీనిపై విరాట్ స్పందిస్తూ... ‘ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మేడమ్ టుస్సాడ్స్ బృందానికి కృతజ్ఞతలు. ఇది నాకు జీవితాంతం మరువలేని జ్ఞాపకం’ అని అన్నాడు. విరాట్ కోహ్లి ఇప్పటికే ఐసీసీ నుంచి ‘వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, బీసీసీఐ నుంచి ‘ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు. -
సిగ్గు పడాల్సిందేమీ లేదు
♦ ఫైనల్లో పరాజయంపై కోహ్లి వ్యాఖ్య ∙ ♦ జట్టుగా మేం గర్వపడుతున్నామన్న కెప్టెన్ లండన్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా టోర్నీలో తమ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ఒక జట్టుగా తమపై ఉండే అంచనాలు, ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటే ఫైనల్ చేరడం కూడా చెప్పుకోదగ్గ ఘనతగా అతను అభివర్ణించాడు. ‘జట్టుగా మేమంతా గర్వించే ప్రదర్శన కనబర్చాం. మేం ఠీవిగా తలెత్తుకొని నిలబడగలం. ఫైనల్ దాకా వచ్చేందుకు ప్రతీ ఒక్కరు శ్రమించారు. తుది పోరులో ప్రత్యర్థి అన్ని రంగాల్లో మమ్మల్ని వెనక్కి నెట్టింది. ఈ మ్యాచ్‌లో మా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించలేదని అంగీకరించేందుకు మేమేమీ సిగ్గు పడటం లేదు’ అని కోహ్లి అన్నాడు. ఛేదనలో తాము సమష్టిగా విఫలమయ్యామన్న విరాట్... హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. గత కొన్నాళ్లుగా పాండ్యా పదే పదే విఫలమైనా కెప్టెన్ అతనిపై నమ్మకాన్ని కోల్పోలేదు. ‘హార్దిక్ బ్యాటింగ్ కళ్లు తిప్పుకోలేని విధంగా సాగింది. ఆ సమయంలో మేం లక్ష్యానికి చేరువ కాగలమని కూడా అనిపించింది. అయితే అలాంటి సమయాల్లో రనౌట్లాంటి పొరపాట్లు సహజం. అవుటయ్యాక పాండ్యా తన భావోద్వేగాలు ప్రదర్శించడంలో తప్పు లేదు. అలాంటి ప్రత్యేకమైన ఇన్నింగ్స్ తర్వాత నిరాశ పడటం సహజమే. పట్టుదలగా ఆడుతున్న సమయంలో తన ప్రమేయం లేకుండా అవుట్ కావడంతో అసహనం చెందడం సహజమే’ అని కోహ్లి తన సహచరుడికి మద్దతు పలికాడు. అశ్విన్‌పై భరోసా... చాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్ల జాబితాలో స్పిన్నర్ అశ్విన్ కూడా ఉన్నాడు. 3 మ్యాచ్‌లలో కలిపి అతను 167 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఫైనల్లో అయితే ఫఖర్ జమాన్ చెలరేగిపోయాడు. అశ్విన్ బౌలింగ్‌లోనే అతను ఏకంగా 45 పరుగులు బాదాడు. మరో స్పిన్నర్ జడేజా కూడా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించిన తన నిర్ణయంలో తప్పు లేదని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌పై స్పిన్నర్లకు సహజంగానే పెద్ద సవాల్ ఎదురవుతుంది. ఇక బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయి అడ్డంగా షాట్లు ఆడుతున్న సమయంలో అయితే స్పిన్నర్లు ఏమీ చేయలేరు. బౌండరీలు ఇవ్వకుండా ఉండటం మానవమాత్రులకు సాధ్యం కాదు. శ్రీలంకతో పరాజయం తర్వాత జట్టులో మార్పులు చేశాం. అదే వ్యూహానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం’ అని కోహ్లి వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో కూడా దాదాపు ఇదే జట్టు ఉంటుంది కాబట్టి తప్పులను సరిదిద్దుకొని మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని విరాట్ స్పష్టం చేశాడు. కుంబ్లేతో సయోధ్య మిథ్యేనా! మరోవైపు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు సమసిపోయేలా కనిపించడం లేదు. సర్దుకుపొమ్మంటూ వీరిద్దరిని కలిపి ఉంచేందుకు బీసీసీఐ, మాజీ క్రికెటర్లు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతోపాటు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ ఫైనల్‌కు ముందు శనివారం కోహ్లితో గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఇక కోహ్లి, కుంబ్లే కలిసి పని చేయడం కష్టమనే నిర్ణయానికి వీరు వచ్చారు. ‘కుంబ్లే గురించి తన ఆలోచనలు ఏమిటో కోహ్లి స్పష్టంగా చెప్పేశాడు. అతని లెక్కలు అతనికున్నాయి. కోహ్లి వైపు నుంచి చూస్తే ఇరువురి మధ్య సంబంధం సరిదిద్దలేని విధంగా చేయి దాటిపోయింది. ఇక సీఏసీ సభ్యులు కుంబ్లేతో మాట్లాడి ఏదైనా సయోధ్యకు అవకాశం ఉంటుందేమో ప్రయత్నిస్తారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే తాజా పరిణామాలు భారత క్రికెట్‌కు చెడు చేస్తాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘కోచ్‌గా కుంబ్లే రికార్డు అద్భుతంగా ఉంది. అసలు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఆయనను తొలగిస్తాం? ఈ విషయంలో కెప్టెన్ మాటకు ఎంతవరకు విలువ ఇవ్వాలి? అతను ఎంత అద్భుతమైన ఆటగాడు అయినా మొత్తం అతనికే అప్పగించేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు. తర్వాత వచ్చే కోచ్‌తో కూడా కొద్ది రోజులకే కోహ్లికి విభేదాలు వస్తే అప్పుడు ఏం చేస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. భారత్ ఓటమితో బంగ్లా యువకుడి ఆత్మహత్య ఢాకా: భారత క్రికెట్‌కు వీరాభిమాని అయిన 25 ఏళ్ల బంగ్లాదేశ్ యువకుడు బిద్యుత్ ... చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడటాన్ని జీర్ణించుకోలేక నడుస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టీమిండియా ఓటమిని తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసు అధికారి ఇస్లామ్ తెలిపారు. -
కోహ్లి... మళ్లీ నంబర్‌వన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ∙టాప్–10లో ధావన్ లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో కోహ్లి ప్రదర్శన అతడికి ఈ ర్యాంక్‌ను కట్టబెట్టింది. 861 పాయింట్లతో కోహ్లి టాప్ ర్యాంక్‌కు చేరుకోగా... ఫిబ్రవరి నుంచి నంబర్‌వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (847 పాయింట్లు) మూడో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 861 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. చివరిసారి కోహ్లి గత జనవరిలో కేవలం నాలుగు రోజులు నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. భారత మరో క్రికెటర్ శిఖర్ ధావన్ ఐదు ర్యాంక్‌లు మెరుగు పరచుకుని 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రోహిత్ శర్మ, ధోనీ ఒక్కో స్థానం కోల్పోయి వరుసగా 13వ, 14వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ హాజల్‌వుడ్ తొలిసారి టాప్ ర్యాంక్ సాధించాడు. మరోవైపు ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంటే మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధిస్తుంది. ‘కోహ్లి’ పెయింటింగ్‌కు రికార్డు ధర బర్మింగ్‌హామ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానంపై గీసిన ఓ పెయింటింగ్ దిమ్మతిరిగే రేటు పలికింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు సాషా జాఫ్రి రూపొందించిన ఈ చిత్రాన్ని స్థానిక మహిళా పారిశ్రామికవేత్త పూనమ్ గుప్తా 2 లక్షల 90 వేల పౌండ్లు (రూ.2 కోట్ల 37 లక్షలు) వెచ్చించి కొనుగోలు చేశారు. ఇటీవల జరిగిన విరాట్ కోహ్లి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చారిటీ డిన్నర్లో పూనమ్ గుప్తా ఈ పెయింటింగ్‌ను కొన్నారు. ప్రస్తుత భారత యువ ఆటగాళ్లు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోహ్లి ఫౌండేషన్ చేస్తున్న కృషిని అందరూ అభినందించాల్సిందేనని పూనమ్ చెప్పారు. -
భారత్, ఇంగ్లండ్ ఫైనల్ ఆడాలి!
లండన్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడాలని అభిమానులు ఆశిస్తున్నారట! భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇదే మాట చెబుతున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే వారి కోరిక నెరవేరుతుందని కూడా అతను అన్నాడు. భారత్–ఇంగ్లండ్ సాంస్కృతిక సంవత్సరపు వేడుకల్లో భాగంగా సోమవారం భారత హైకమిషన్ క్రికెటర్లకు ప్రత్యేక విందు ఇచ్చింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పాటు పలువురు మాజీలు ఫరూఖ్ ఇంజినీర్, దిలీప్ దోషి, స్ట్రాస్, పనెసర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. కఠినమైన లీగ్ దశను అధిగమించాం కాబట్టి సెమీస్‌లో ప్రత్యర్థి ఎవరనే విషయం అనవసరమన్నాడు. ‘సెమీఫైనల్లో ప్రత్యర్థి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టే అవకాశం మాకుంది. ప్రతీ ఒక్కరు భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ జరగాలని కోరుకుంటున్నారు. ఇరు జట్లు బాగా ఆడితే అది సాధ్యమే’ అని విరాట్ అభిప్రాయపడ్డాడు. -
సమష్టి మంత్రం...విజయ సూత్రం
♦ అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత్ ♦ విదేశీ పిచ్‌లపై కూడా రాణించాలి ధర్మశాల టెస్టులో విజయానికి కావాల్సిన రెండు పరుగులను పూర్తి చేసిన అనంతరం లోకేశ్ రాహుల్ విజయ గర్వంతో గాల్లోకి ఎగిరి ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ సింహనాదం చేశాడు. ఈ సిరీస్ ఎలాంటి స్థితిలో ముగిసిందో అర్ధం చేసుకోవడానికి ఇది చాలేమో? 2005 యాషెస్ సిరీస్ అనంతరం అంత ఉద్విగ్నంగా జరిగిన సిరీస్ ఇదే అని విశ్లేషకులు చెబుతున్న మాట. వివాదాలు.. కవ్వింపు చర్యలు.. ఫిర్యాదులు.. ఆసీస్ మీడియా ఎదురుదాడి.. టీమిండియా కెప్టెన్ ఘాటైన సమాధానాలు.. అంతకుమించి అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుంచుకునే రీతిలో ఇరు జట్ల ఆటగాళ్ల వీరోచిత ప్రదర్శన.. వెరసి భారత, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను రెండు కొదమ సింహాల సమరంగా వర్ణించవచ్చు. సాక్షి క్రీడా విభాగం : గతేడాది సెప్టెంబర్ 22న భారత జట్టు స్వదేశంలో తమ టెస్టు సీజన్‌కు తెర లేపింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు కోహ్లి సేన న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లతో ఆడింది. అన్నింటిని క్లీన్‌స్వీప్ చేసి ఆస్ట్రేలియాకు గట్టి సవాల్ విసిరింది. దీనికి తగ్గట్టుగానే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు అంతా భారత్‌నే ఫేవరెట్‌గా చెప్పుకున్నారు. క్లీన్‌స్వీప్ ఖాయం.. అది 4–0తోనా లేక 3–0తోనా తేలాల్సి ఉంది అని లెక్కలేశారు. కానీ సిరీస్ ప్రారంభమయ్యాక భారత్ విజయం అంత సులువు కాదని తేలిపోయింది. పుణేలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ స్పిన్ దెబ్బకు భారత్ అనూహ్యంగా కుదేలైపోయింది. స్పిన్నర్ ఒకీఫ్ ఏకంగా 12 వికెట్లతో రెచ్చిపోవడంతో భారత్ అత్యంత అవమానకర రీతిలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో 105, 107 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 333 పరుగులతో దారుణ ఓటమి. సర్వత్రా ఎదురైన విమర్శలను తట్టుకున్న కోహ్లి బృందం ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా జట్టు కోలుకున్న తీరు ప్రశంసనీయం. సమష్టి మంత్రాన్ని జపిస్తూ ఏకంగా సిరీస్‌నే దక్కించుకుంది. మొత్తం 25 వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా ఏకంగా ప్రపంచ టెస్టు క్రికెట్లో నంబర్‌వన్ బౌలర్‌గా మారాడు. ఉమేశ్ యాదవ్ 17 వికెట్లతో భారత పిచ్‌లపై పేసర్ కూడా ఎక్కువ వికెట్లు తీయగలడని చాటి చెప్పాడు. ఈ సిరీస్‌లో భారత్ ఆందోళన పడిన విషయం ఒక్క కోహ్లి ఫామ్ గురించే. విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా బ్యాటింగ్‌లో అదరగొట్టారు. కరుణ్ నాయర్ మాత్రం తనకు లభించిన అవకాశాన్ని సొమ్ము చేసుకోలేకపోయాడు. బెంగళూరులో భళా.. నాలుగు టెస్టుల సిరీస్‌లో బెంగళూరు మ్యాచ్ భారత్‌కు కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ రెండో టెస్టులో భారత్ పోరాడిన తీరు అపూర్వం. స్పిన్నర్ నాథన్ లయన్ ఎనిమిది వికెట్లతో దాడి చేయడంతో తొలి రోజే భారత్ 189 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 92 పరుగులతో అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 188 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన ఆసీస్ కచ్చితంగా 2–0తో సిరీస్‌లో పైచేయి సాధిస్తుందనే అనుకున్నారు. అయితే ఆ జట్టును భారత్ అద్భుత రీతిలో అడ్డుకుని 112 పరుగులకు కుప్పకూల్చగలిగింది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో.. అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరేసి వికెట్లతో చెలరేగి సిరీస్ సమం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వివాదాలూ ఇక్కడి నుంచే.. సిరీస్‌లో అసలైన వేడి కూడా ఈ టెస్టు నుంచే ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో తన అవుట్‌పై స్టీవ్ స్మిత్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఆసీస్ జట్టు మోసంతో ఆడుతోందని భారత జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. అయితే ఇరు జట్ల మధ్య ఈ వివాదం సమసిపోయినా అటు ఆసీస్ మీడియా మాత్రం కోహ్లిపై దుమ్మెత్తి పోసింది. కోహ్లిని ఏకంగా ట్రంప్‌తో పోలుస్తూ రోజుకో కథనాలు వండివార్చింది. దీనికి అతను కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇక రాంచీలో పుజారా డబుల్ సెంచరీ, సాహా సెంచరీతో విజయం ముంగిట నిలిచినా హ్యాండ్స్కోంబ్, షాన్ మార్‡్ష ఓపిగ్గా క్రీజులో నిలిచి మ్యాచ్ ‘డ్రా’గా ముగించారు. కోహ్లి లేకున్నా... చివరి టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి గాయంతో బరిలోకి దిగకున్నా అజింక్యా రహానే జట్టును నడిపించిన తీరు ప్రశంసలందుకుంది. స్వయంగా కోహ్లి సైతం అతడి కెప్టెన్సీని పెవిలియన్‌లో కూర్చుని ఆస్వాదించినట్టు చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలర్లను మారుస్తూ ఆసీస్‌ను దెబ్బతీయగలిగాడు. తనలోని భావోద్వేగాలను బయటపెట్టకుండా మరో ‘మిస్టర్ కూల్’గా జట్టును విజయం వైపు నడిపించగలిగాడు. జడేజా ఆల్‌రౌండ్ షోతో పాటు లోకేశ్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ షార్ట్ పిచ్ బంతులతోనూ భయపెట్టగలనని నిరూపించాడు. ఇక కోహ్లి స్థానంలో బరిలోకి దిగిన ‘చైనామన్ స్పిన్నర్’ కుల్దీప్ యాదవ్ సంచలన అరంగేట్ర ప్రదర్శన చేశాడు. నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పరాజయానికి బాటలు వేశాడు. ఇక విదేశాల్లోనూ వణికించాలి! స్వదేశంలో జరిగిన 13 టెస్టుల్లో 10 మ్యాచ్‌లు గెలవడంతో పాటు నాలుగు సిరీస్‌లనూ దక్కించుకున్న భారత్... ఇక విదేశీ పిచ్‌లపై అదరగొట్టాల్సి ఉంది. అప్పుడే ఈ విజయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది. నిజానికి సొంతగడ్డపై మనకు లభించే అనుకూల పరిస్థితులను సొమ్ము చేసుకుని గెలవడం బాగానే కనిపిస్తుంది. కానీ విదేశాలకు వెళ్లి అక్కడ సిరీస్‌లు నెగ్గితే లభించే గౌరవమే వేరు. అందునా టెస్టు క్రికెట్లో నంబర్‌వన్‌గా ఉన్న జట్టుపై ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇప్పటికీ ఆసీస్, దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. మున్ముందు ఇదే జోరుతో టీమిండియా ఆ లోటు తీరుస్తుందని ఆశిద్దాం. -
కోహ్లి ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తోంది
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆస్ట్రేలియా మీడియాపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ధ్వజమెత్తారు. కోహ్లి గురించి చెత్త రాతలు రాస్తోందని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోహ్లికి సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కోహ్లిని పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఆసీస్ జర్నలిస్టులు అతడి ఇమేజ్‌ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, దీన్ని కోహ్లి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చారు. ‘ట్రంప్‌తో కోహ్లిని పోల్చడం చాలా చెత్తగా ఉంది. కోహ్లి అంటే నాకే కాదు ఆసీస్ దేశస్తులకు కూడా చాలా ఇష్టం. సవాళ్లను స్వీకరించే అతడి తత్వం ఆదర్శనీయం. ఇద్దరు ముగ్గురు ఆసీస్ జర్నలిస్టులు అతడి గౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. వారి గురించి తను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఆసీస్ మీడియా చెబుతున్న విషయాలను స్మిత్ కూడా పట్టించుకోవడం లేదు. ధర్మశాలలో జరిగే చివరి టెస్టుపై దృష్టి సారించి సిరీస్ దక్కించుకోవాలనే ఇరు జట్ల కెప్టెన్లు తమ ఆటగాళ్లకు చెబుతున్నారు’ అని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో క్లార్క్ వివరించారు. విరాట్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని, క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ అతడి నుంచి అభిమానులు సెంచరీలు ఆశిస్తారని తెలిపారు. అయితే అతడి తాజా ఫామ్ లేమి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధర్మశాలలో భారీ స్కోరు చేసి సిరీస్ గెలిపించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఇరు జట్ల బౌలర్లు తీవ్రంగా అలసిపోయారని, దీంతో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుని వారికి తగిన విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, పరిపాలన కమిటీ చీఫ్ వినోద్ రాయ్‌లకు క్లార్క్ అందజేశారు. -
కలలు కనండి... సాకారం చేసుకోండి
కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబై: తాము అనుకున్న లక్ష్యాల వైపు అకుంఠిత దీక్షతో ముందుకెళితే తప్పకుండా విజయం అందుతుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 49వ ఆలిండియా సెంట్రల్ రెవిన్యూ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. ‘మీ మీద మీకు నమ్మకముంటే ఏమైనా సాధించగలరు. ఇదే సూత్రంపై నేను ముందుకు సాగుతుంటాను. ఎంత పెద్ద కలలైనా కనండి.. వాటిని అందుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి. ఇటీవలే ఇద్దరు సిస్టర్స్ (రెజ్లర్లు బబిత, గీతా ఫోగట్)ల జీవిత చరిత్ర చూశాను. నా హృదయాన్ని కదిలించింది. దేశం గర్వించే స్థాయిలో వారు ఎదిగారు. జీవితంలో అయినా క్రీడల్లో అయినా దేశానికి పేరు తెచ్చే విధంగా మెలగాలి’ అని క్రీడాకారులకు కోహ్లి సూచించాడు. రెజ్లర్ బబితా, మహారాష్ట్ర మంత్రి వినోద్, గాయకుడు శంకర్ మహదేవన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
‘విరాట్ సేన’ వచ్చేసింది...
బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టులో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. నగరంలో అడుగు పెట్టిన వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని సహచరులు సన్నాహాలు మొదలుపెట్టారు. మ్యాచ్ వేదికైన ఉప్పల్ స్టేడియానికి చేరుకొని మూడు గంటలపాటు జోరుగా హుషారుగా ప్రాక్టీస్ చేశారు. – సాక్షి, హైదరాబాద్ -
కోహ్లి... వేరే లీగ్‌లతో సంబంధమేల!
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి... ప్రీమియర్ ఫుట్సాల్ (ఫైవ్-ఎ-సైడ్) లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తప్పుబట్టారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)తో ప్రమేయం ఉన్న వ్యక్తి వేరే లీగ్‌లతో ఎలా సంబంధం పెట్టుకుంటాడని విమర్శించారు. కోహ్లిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఐఎస్ఎల్ మాదిరిగానే రూపుదిద్దుకుంటున్న ప్రీమియర్ ఫుట్సాల్కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తున్నారు. -
విరాట్ టెక్నిక్‌పై రాజీపడడు: సచిన్
ఐపీఎల్లో పోటీతత్వం పెరిగింది దుబాయ్: టెక్నిక్‌పై రాజీపడకపోవడం, స్ట్రయిట్ బ్యాట్‌తో ఆడటం వల్లే భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి విజయవంతమవుతున్నాడని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లి స్ట్రయిట్ బ్యాట్‌తో మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు. అతనిలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. ఆట కోసం చాలా కష్టపడతాడు. అతని క్రమశిక్షణ, అంకితభావం అమోఘం. టెక్నిక్‌పై రాజీపడకుండా మూడు ఫార్మాట్ల గురించి ఆలోచిస్తాడు. దీనికి అదనంగా మానసికంగా చాలా ధృడంగా ఉన్నాడు. కఠిన పరిస్థితులను చాలా బాగా అధిగమిస్తాడు’ అని సచిన్ పేర్కొన్నాడు. -
త్రిమూర్తుల తడాఖా
► చెలరేగిన కోహ్లి, డివిలియర్స్, గేల్ ► కోల్‌కతాపై బెంగళూరు ఘన విజయం ప్లే ఆఫ్ ఆశలు సజీవం విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. అలాగే తనకు అచ్చొచ్చిన మైదానంలో లీగ్‌లో తొలిసారిగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మెరుపులు మెరిపించాడు. అటు డివిలియర్స్ కూడా తనదైన శైలిలో చెలరేగాడు. ఫలితంగా ఈ త్రిమూర్తుల తడాఖాతో బెంగళూరు ఖాతాలో మరో కీలక విజయం చేరింది. అటు ఈ మ్యాచ్‌ను నెగ్గి ప్లేఆఫ్‌లో అడుగుపెడదామనుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎదురుచూపులు తప్పలేదు. కోల్‌కతా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ భీకర ఫామ్‌ను కొనసాగిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (51 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు; 3 సిక్సర్లు), డివిలియర్స్ (31 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) మెరుపులకు తోడు... తాజా లీగ్‌లో తొలిసారిగా క్రిస్ గేల్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు; 4 సిక్సర్లు) దుమ్మురేపడంతో ప్లే ఆఫ్‌లో చోటు కోసం ఈ జట్టు మరో అడుగు ముందుకేసింది. ఈ త్రయం జోరుతో సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు), మనీష్ పాండే (35 బంతుల్లో 50; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 186 పరుగులు చేసి నెగ్గింది. నరైన్‌కు వికెట్ దక్కింది. కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆదుకున్న గంభీర్, పాండే వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కోల్‌కతాకు శుభారంభం అందలేదు. మూడో ఓవర్లో స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో తీసుకున్న అద్భుత రిటర్న్ క్యాచ్‌కు ఉతప్ప (2) వెనుదిరిగాడు. అయితే బెంగళూరుకు ఈ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. మనీష్ పాండేతో కలిసి కెప్టెన్ గంభీర్ స్కోరును పరిగెత్తించాడు. నాలుగో ఓవర్లో గంభీర్ ఓ ఫోర్, పాండే రెండు ఫోర్లతో 15 పరుగులు పిండుకున్నారు. ఈ జోరుకు పవర్‌ప్లేలో 51/1 పరుగులు వచ్చాయి. ఏడో ఓవర్లో పాండే ఓ సిక్స్, గంభీర్ రెండు ఫోర్లు బాదాడు. అయితే ఆ తర్వాత నాలుగు ఓవర్లు బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. దీంతో 10 ఓవర్లో 87 పరుగులు చేసింది. అటు 32 బంతుల్లో గంభీర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి రెండో వికెట్‌కు 76 పరుగులు జత చేరాయి. కొద్దిసేపటికే 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన పాండే, పఠాన్ (6), సూర్యకుమార్(5)లు వరుస ఓవర్లలో అవుట్ కావడంతో కోల్‌కతా తడబడింది. కానీ రసెల్, షకీబ్ అల్ హసన్ చివరి ఓవర్లలో బ్యాట్లను ఝళిపించి అండగా నిలబడ్డారు. వాట్సన్ వేసిన 18వ ఓవర్లో చెరో సిక్స్ బాదడంతో 16 పరుగులు వచ్చాయి. చిట్ట చివరి బంతిని వాట్సన్ లైన్‌కు ఇన్సైడ్లోనే వేసినా అంపైర్ వైడ్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ జోడి మధ్య ఆరో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు వచ్చాయి. గేల్ దూకుడు అనంతర లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ ధాటిగా కొనసాగింది. పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న గేల్ తన పవర్ చూపించాడు. రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన గేల్ ఆ మరుసటి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ఈడెన్‌ను హోరెత్తించాడు. వర్ష సూచనను అంచనా వేసుకుంటూ రన్‌రేట్ మెరుగ్గా ఉండేందుకు వేగంగా ఆడింది. గేల్ దూకుడును గమనించిన కోహ్లి ఎక్కువగా స్ట్రయిక్‌ను తనకే ఇచ్చాడు. పవర్‌ప్లేలో బెంగళూరు 63 పరుగులు సాధించింది. అయితే నరైన్ వేసిన ఎనిమిదో ఓవర్లో కవర్స్‌లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత గేల్ ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్‌కు 71 పరుగులు వచ్చాయి. కోహ్లికి జతగా డివిలియర్స్ కలవడంతో 10 ఓవర్లలో 91/1 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను గంభీర్ వదిలేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లి మరింత రెచ్చిపోయాడు. మరోవైపు డివిలియర్స్ కూడా చెలరేగడంతో మరో ఎనిమిది బంతులుండగానే బెంగళూరు విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి అండ్ బి) ఇక్బాల్ అబ్దుల్లా 2; గంభీర్ (రనౌట్) 51; మనీష్ పాండే (సి) డివిలియర్స్ (బి) అరవింద్ 50; యూసుఫ్ పఠాన్ (స్టంప్డ్) రాహుల్ (బి) చాహల్ 6; రసెల్ నాటౌట్ 39; సూర్యకుమార్ యాదవ్ (సి) ఇక్బాల్ (బి) అరవింద్ 5; షకీబ్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1-14, 2-90, 3-113, 4-118, 5-125. బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 1-0-8-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-41-2; ఇక్బాల్ అబ్దుల్లా 4-0-22-1; వాట్సన్ 4-0-46-0; చాహల్ 4-0-38-1; జోర్డాన్ 3-0-22-0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ ఎల్బీడబ్ల్యు (బి) నరైన్ 49; కోహ్లి నాటౌట్ 75; డివిలియర్స్ నాటౌట్ 59; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 186. వికెట్ల పతనం: 1-71. బౌలింగ్: రసెల్ 2.3-0-32-0; మోర్కెల్ 2-0-20-0; నరైన్ 4-0-34-1; చావ్లా 3.1-0-32-0; రాజ్‌పుత్ 3-0-28-0; షకీబ్ 4-0-39-0. -
‘ఫిక్సింగ్‌ను ఎవరూ ఆపలేరు’
న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వ్యక్తిగతంగా ఆయా ఆటగాడి నైతికత కీలకమవుతుందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘అధికారులు ఈ జాడ్యాన్ని నిరోధించేందుకు వీలైనంత మేరకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి గదికి వెళ్లి నీవు ఫలానా వ్యక్తితో మాట్లాడకు అని చెప్పే వీలుండదు. ఇదంతా వారి వ్యక్తిగత కట్టుబాటుపై ఆధారపడి ఉంటుంది. తప్పు చేయాలని అతడు అనుకుంటే ఎవరూ ఆపలేరు. నన్నెవరూ ఫిక్సింగ్ కోసం సంప్రదించలేదు. భవిష్యత్‌లోనూ అది జరగదు’ అని కోహ్లి స్పష్టం చేశాడు. -
విరాట్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వాహకులు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరు బౌలర్లు నిర్ణీత సమయంలో పూర్తి కోటా ఓవర్లు పూర్తి చేయనందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి ఇలా జరిగితే కోహ్లిపై రూ. 24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేస్తే అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశముంది. -
కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
భారత పేసర్ ఆరోన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లికి తనపై ఎంతో నమ్మకముందని, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ద్వారా దానిని నిలబెట్టుకుంటానని భారత పేసర్ వరుణ్ ఆరోన్ వ్యాఖ్యానించాడు. శ్రీలంకలో ఒక్క టెస్టు మాత్రమే ఆడిన ఆరోన్... ప్రస్తుతం ఇషాంత్ అందుబాటులో లేనందున మొహాలీలో తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ‘కోహ్లికి నాపైనే కాదు. జట్టులో అందరిపై నమ్మకం ఉంది. ఇది జట్టులోని ఆటగాళ్ల స్థైర్యాన్ని పెంచుతుంది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే అవకాశం ఈ సిరీస్‌లో లభిస్తుందని భావిస్తున్నా’ అని ఆరోన్ అన్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడమనే గొప్ప సవాల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. గతంతో పోలిస్తే ఇప్పడు తన ఫిట్నెస్ బాగా మెరుగుపడిందని, గాయాల బారిన పడకుండా ఎలా బౌలింగ్ చేయాలో తెలుసుకున్నానని ఆరోన్ తెలిపాడు. -
ధోని ముద్ర ఉంటుందా..?
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు వన్డే, టి20 జట్ల ఎంపిక నేడు బెంగళూరు : దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్, టి20 సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక నేడు (ఆదివా రం) జరుగనుంది. వచ్చే నెల 2 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ముందుగా మూడు టి20ల సిరీస్‌తో పాటు, ఐదు వన్డేల్లో మూడింటికి జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఇటీవల శ్రీలంకకు వెళ్లిన భారత టెస్టు జట్టు... కెప్టెన్ విరాట్ కోహ్లి ఆలోచనలకు తగ్గట్టుగా ఐదుగురు బౌలర్లతో వెళ్లి దూకుడును ప్రదర్శించింది. ఇప్పుడు వన్డే, టి20ల్లోనూ జట్టు ఎంపికలో మునుపటిలాగా కెప్టెన్ ఎంఎస్ ధోని తనదైన ముద్రను వేస్తాడా.. లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది. లేకపోతే సెలక్టర్లు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుంటే మాత్రం తమదైన శైలిలోనే జట్టును ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కోహ్లికి అనుకూల ఆటగాళ్లు చోటు దక్కిం చుకున్నా ఆశ్చర్యం లేదు. ఇదే జరిగితే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తిరిగి జట్టులోకి రావచ్చు. మరోవైపు ఐదు నెలల్లో టి20 ప్రపంచకప్ భారత్‌లోనే జరుగనుండడంతో కెప్టెన్ ధోని, సెలక్టర్లు ఈ విషయంపై మరింత దృష్టి సారించనున్నారు. ప్రొటీస్‌తో జరుగబోయే ఈ మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను సన్నాహక సిరీస్‌గా ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే కొన్ని కొత్త ముఖాలను పరీక్షించే అవకాశాలు లేకపోలేదు. వన్డేల్లోకి సీనియర్ల రాక.. భారత్ చివరిసారిగా జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడింది. అయితే సీనియర్ ఆటగాళ్ల విశ్రాంతి కారణంగా రహానే నేతృత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు అక్కడకు వెళ్లింది. కెప్టెన్ ధోని, కోహ్లి, రైనా, రోహిత్, అశ్విన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండడంతో వీరి స్థానాలు ఖాయం. ఓపెనర్ శిఖర్ ధావన్, రహానే, రాయుడు ఓకే అయినా వీరిలో ధావన్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జింబాబ్వే సిరీస్‌లో మురళీ విజయ్ ఆకట్టుకోవడంతో అతడి పేరును పరిశీలించనున్నారు. ఇక జట్టులో చోటు కోల్పోయిన రవీంద్ర జడేజా పరిస్థితి ఏమిటో తెలియాలి. పేసర్లుగా ధోని నమ్మకస్తులు మోహిత్ శర్మ, భువనేశ్వర్‌లతో పాటు బ్యాకప్‌గా ధవళ్ కులకర్ణి ఉండనున్నారు. ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌కు కూడా చాన్స్ ఇవ్వచ్చు. టి20 ఫార్మాట్లో కేదార్ జాదవ్, మనీష్ పాండే ఎంపికయ్యే అవకాశాలున్నాయి. దీంట్లో అశ్విన్‌కు తోడుగా రెండో స్పిన్నర్‌గా హర్భజన్ తీసుకోవడంలో ధోని నిర్ణయమే కీలకం. ఇక భారత్ ‘ఎ’ జట్టులో ఆకట్టుకుంటున్న గురుకీరత్ సింగ్, మయాంక్ అగర్వాల్‌లను పొట్టి ఫార్మాట్‌కు పరిశీలించవచ్చు. -
పూర్తి స్థాయి సిరీస్ ఓ పరీక్ష!
- శ్రీలంక పర్యటనపై కోహ్లి - కొత్త వ్యూహాలు ఉన్నాయన్న టెస్టు కెప్టెన్ చెన్నై: ధోని గైర్హాజరులో తొలి రెండు టెస్టులు, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే తొలిసారి ఒక పూర్తి స్థాయి సిరీస్ (3 టెస్టులు)కు అతను నాయకత్వం వహించబోతున్నాడు. అందుకే శ్రీలంకతో జరిగే సిరీస్ తనకో సవాల్‌లాంటిదని, తన సామర్థ్యానికి పరీక్షగా అతను భావిస్తున్నాడు. ఆదివారం భారత టెస్టు జట్టు లంకకు బయల్దేరడానికి ముందు అతను మీడియాతో మాట్లాడాడు. ‘వ్యక్తిగతంగా ఈ సిరీస్ పట్ల చాలా ఉత్కంఠగా ఉన్నాను. గతంలో అనుకున్న అనేక ప్రణాళికలకు పూర్తి సిరీస్‌లో అమలు చేసే అవకాశం ఉంటుంది. ఒక టెస్టులో ఐదు రోజుల్లో మన వ్యూహాలన్నీ వాడలేం. కాబట్టి గత మూడు టెస్టులను బట్టి నా కెప్టెన్సీని అంచనా వేయవద్దు. నన్ను నేను నిరూపించుకునేందుకు ఇది నాకు మంచి అవకాశం’ అని కోహ్లి అన్నాడు. ఈ సిరీస్‌కు సంబంధించి తన మదిలో అనేక ఆలోచనలు ఉన్నాయని, ఏదైనా ఒక వ్యూహం విఫలమైతే ప్రత్యామ్నాయంగా ప్లాన్ ‘బి’ సిద్ధంగా ఉంటుందన్నాడు. ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్ల వ్యూహమే సరైనదని, దానికే కట్టుబడి ఉంటానని అతను పునరుద్ఘాటించాడు. ఈ విషయంలో తన బౌలర్ల ఆలోచనలకు అనుగుణంగా ఫీల్డింగ్ ఏర్పాటు చేసి వారికి మద్దతుగా నిలుస్తానన్నాడు. బ్యాటింగ్‌లో 40కు పైగా సగటు ఉన్న అశ్విన్‌ను టెస్టు ఆల్‌రౌండర్‌గా తాను పరిగణిస్తానన్న కోహ్లి...హర్భజన్, భువనేశ్వర్‌లను కూడా ఇదే జాబితాలో చేర్చాడు. మురళీ విజయ్ ఫిట్‌నెస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదని, తొలి టెస్టులోగా అతను సిద్ధమవుతాడని కెప్టెన్ స్పష్టం చేశాడు. రెండో ఓపెనర్‌గా రాహుల్, ధావన్ మధ్య పోటీ నెలకొనడంతో ఎలాంటి ఇబ్బందీ లేదని విరాట్ చెప్పాడు. ‘అందరూ ఫామ్‌లో ఉండటం అనేది సమస్యే కాదు. వీరిద్దరు బాగా ఆడుతున్నారు. ఇది మంచి పరిణామమే. తుది జట్టులో ఎవరనేది తర్వాత తేలుతుంది’ అని విశ్లేషించాడు. రోహిత్ శర్మ టెస్టు ప్రదర్శన ఇటీవల గొప్పగా లేకపోయినా...అతను ప్రతిభావంతుడని, మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. దానర్థం అది కాదు! మరోవైపు బీసీసీఐ నైతిక విలువల నియమావళిలాంటి ఏ నిర్ణయం తీసుకున్నా ఆటగాళ్లకు మేలు చేస్తుందన్న విరాట్ కోహ్లి... దానిపై వివరంగా వ్యాఖ్యానించేందుకు నిరాకరించాడు. బంగ్లాతో వన్డే సిరీస్ పరాజయంపై అనంతరం ‘మేం ప్రణాళికలను సమర్థంగా అమలు చేయలేకపోయామని’ చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయించారని కోహ్లి వివరణ ఇచ్చాడు. ఇది ధోనికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యగా అప్పుడు వార్తల్లో నిలిచింది. ‘మేం అంటే అందులో నేను కూడా భాగమేనని అర్థం. అంటే నా తప్పు కూడా ఉందనే కదా. దానిని వక్రీకరించారు. జట్టులో ఎలాంటి విభేదాలూ లేవు’ అని విరాట్ స్పష్టం చేశాడు. -
రాహుల్ జిగేల్.. కోహ్లి కమాల్
కళ్లెదురుగా కొండంత స్కోరు కనిపిస్తోంది... అనుభవం చూస్తే ఒక్కటే టెస్టు... కొత్త కుర్రాడు... అయినా లోకేశ్ రాహుల్ బెదరలేదు, తడబడలేదు. ఆసీస్ పేసర్ల యుక్తులకు తన టెక్నిక్‌తో జవాబు చెప్పాడు. ఆడుతున్న రెండో టెస్టులోనే ఆసీస్ గడ్డపై సెంచరీతో రాహుల్ ద్రవిడ్ వారసుడిలా కనిపించాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రస్తుతం ఆపేవాళ్లే కనిపించడం లేదు. సిరీస్‌లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా నాలుగో సెంచరీ బాదాడు. కళ్లు చెదిరే షాట్లతో అజేయ సెంచరీ చేసి ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. రాహుల్, కోహ్లిల శతకాలతో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా బదులిచ్చింది. అయితే ఇక్కడితో కథ ముగియలేదు. మరో రెండు రోజుల ఆట మిగిలింది. భారత్ ఇంకా ఫాలోఆన్ మార్కునూ దాటలేదు. కోహ్లితో పాటు క్రీజులో ఉన్న సాహాను మినహాయిస్తే... ఇక మిగిలిన వాళ్లంతా బౌలర్లే. కాబట్టి కోహ్లి మరింత బాధ్యతగా ఆడాలి. నాలుగో రోజు కనీసం రెండు సెషన్లు క్రీజులో నిలబడితే ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకోవచ్చు. శతకంతో చెలరేగిన కెప్టెన్ * సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ * తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 342/5 * ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ దీటుగా జవాబిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (214 బంతుల్లో 140 బ్యాటింగ్; 20 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (262 బంతుల్లో 110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీల మోత మోగించడంతో గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 115 ఓవర్లలో 5 వికెట్లకు 342 పరుగులు చేసింది. కోహ్లితో పాటు సాహా (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.రోహిత్ (53) ఫర్వాలేదనిపించినా... రహానే (13), రైనా (0)లు విఫలమయ్యారు. వికెట్ నుంచి సహకారం లేకపోవడంతో తొలి రెండు సెషన్లలో పెద్దగా ప్రభావం చూపని ఆసీస్ బౌలర్లు చివరి గంటలో చకచకా మూడు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రస్తుతం భారత్ ఇంకా 230 పరుగులు వెనుకబడి ఉంది. స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు:- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 572/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) అండ్ (బి) స్టార్క్ 110; రోహిత్ (బి) లయోన్ 53; కోహ్లి బ్యాటింగ్ 140; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) వాట్సన్ 13; రైనా (సి) హాడిన్ (బి) వాట్సన్ 0; సాహా బ్యాటింగ్ 14; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (115 ఓవర్లలో 5 వికెట్లకు) 342. వికెట్ల పతనం: 1-0; 2-97; 3-238; 4-292; 5-292 బౌలింగ్: స్టార్క్ 21-4-77-2; హారిస్ 23-6-63-0; హాజెల్‌వుడ్ 20-5-45-0; లయోన్ 32-7-91-1; వాట్సన్ 15-4-42-2; స్మిత్ 4-0-17-0. కోహ్లి రికార్డుల మోత * ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (639). గతంలో ద్రవిడ్ (619) టాప్ స్కోరర్. అయితే ద్రవిడ్ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులను కోహ్లి ఏడో ఇన్నింగ్స్‌లలోనే అధిగమించాడు. * జట్టు కెప్టెన్‌గా తన తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ విరాట్. గతంలో గ్రెగ్ చాపెల్ రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు చేశాడు. * ఒక టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. గతంలో 1978-79లో వెస్టిండీస్‌పై గవాస్కర్ ఈ ఘనత సాధించారు. * ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో విదేశీ క్రికెటర్ విరాట్. గతంలో ఇంగ్లండ్ క్రికెటర్ సట్‌క్లిఫ్ (1924-25), దక్షిణాఫ్రికా క్రికెటర్ హామండ్ (1928-29) మాత్రమే ఈ ఘనత సాధించారు. * ఆస్ట్రేలియా గడ్డపై నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ కోహ్లి. సెషన్-1: నత్త నడక 71/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన రోహిత్, రాహుల్ ఒక్కో పరుగు జోడించుకుంటూ వెళ్లారు. పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో ఆసీస్ బౌలర్లు ఎక్కడా లైన్ తప్పకుండా ఓపిగ్గా బౌలింగ్ చేశారు. ఈ జోడి తొలి గంటలో 15 ఓవర్లలో మూడు బౌండరీలతో 19 పరుగులు మాత్రమే చేసింది. అయితే రెండో గంటలో మాత్రం పరుగుల వేగం పెరిగింది. మరోవైపు బౌన్స్‌ను, టర్న్‌ను సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్ లయోన్ 44వ ఓవర్లో రాహుల్‌ను అవుట్ చేసినంత పని చేశాడు.షార్ట్‌లెగ్‌లో బంతి బర్న్స్‌ను తాకుతూ వెళ్లడంతో బ్యాట్స్‌మన్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే అదే ఓవర్ నాలుగో బంతిని స్వీప్ చేయబోయిన రోహిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన కోహ్లి ఎదుర్కొన్న తొలి బంతిని కాస్త తడబడుతూ ఆడాడు. అయితే అప్పటికే సగం పిచ్ వరకు పరుగెత్తుకుంటూ వచ్చిన రాహుల్‌ను వెనక్కి పంపాడు. అయితే కమిన్స్ మరో ఎండ్ వైపు త్రో విసరడంతో రాహుల్ బతికిపోయాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్ క్యాచ్ మిస్ చేయడంతో బయటపడ్డ రాహుల్ 161 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని లంచ్‌కు వెళ్లాడు. ఓవర్లు: 30; పరుగులు: 51; వికెట్లు: 1 సెషన్-2: రాహుల్ జోరు బౌలర్లకు సహకారం లేకపోవడం, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో రాహుల్, కోహ్లి నింపాదిగా ఆడారు. లంచ్‌కు ముందు కేవలం 51 పరుగులు మాత్రమే చేసిన భారత్... ఆ తర్వాత వేగంగా ఆడింది. తొలి గంటలో 45, రెండో గంటలో 67 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న కోహ్లి దూకుడుగా ఆడాడు. 108 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు.ఈ జంటను విడదీసేందుకు బౌలర్లను పదేపదే మార్చినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఇద్దరు అలవోకగా పరుగులు చేయడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే రెండో కొత్త బంతిని తీసుకున్న తర్వాత 83వ ఓవర్లో విరాట్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్టార్క్ వేసిన బంతి కోహ్లి బ్యాట్‌ను తాకుతూ వెళ్లినా.. రెండో స్లిప్‌లో స్మిత్ దాన్ని అందుకోలేకపోయాడు. రెండు ఓవర్ల తర్వాత రాహుల్ 253 బంతుల్లో కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. ఓవర్లు: 30; పరుగులు: 112; వికెట్లు: 0 సెషన్-3: ఆకట్టుకున్న కోహ్లి దాదాపుగా తొలి రెండు సెషన్లలో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన భారత్‌ను టీ తర్వాత ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. చివరి గంటలో చకచకా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. టీ తర్వాత రెండో ఓవర్లోనే లోకేశ్‌ను అవుట్ చేసి బౌలర్లు పైచేయి సాధించారు. విరాట్, రాహుల్ మధ్య మూడో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. తర్వాత వచ్చిన రహానే (13)ను నిలబెట్టి కోహ్లి వేగంగా ఆడాడు. దీంతో నాలుగో వికెట్‌కు 54 పరుగులు పూర్తయ్యాయి. ఇక్కడ భారత్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. వాట్సన్ వరుస బంతుల్లో రహానే, రైనా (0)లను పెవిలియన్‌కు పంపాడు. సహచరులు వెనుదిరిగినా జోరు తగ్గకుండా ఆడిన కోహ్లి కెరీర్లో 10వ సెంచరీ పూర్తి చేశాడు. చివరి వరకు జాగ్రత్తగా ఆడిన ఈ జోడి మరో వికెట్ పడకుండా రోజును ముగించింది. ఓవర్లు: 30; పరుగులు: 108; వికెట్లు: 3 స్పైడర్కామ్తోనే ఇబ్బంది! మూడో రోజు ఆట కంటే స్మిత్ క్యాచ్ మిస్ చేసిన తీరుపైనే ఎక్కువ చర్చ నడిచింది. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ వేసిన బంతి రాహుల్ బ్యాట్‌ను తాకి గాల్లో చాలా పైకి లేచింది. స్లిప్‌లో ఉన్న స్మిత్ వెనక్కి పరుగెత్తుతూ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి కోసం పైకి చూస్తున్న క్రమంలో కంటికి స్పైడర్‌కామ్ తీగ ఒకటి అడ్డుగా వచ్చింది. దీంతో కెప్టెన్ తడబడి క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఇదే విషయంపై అంపైర్ రిచర్డ్ కెటిల్బోర్గ్తో కెప్టెన్ చర్చించాడు. అయితే బంతి కెమెరాకుగానీ, వైర్లకు గానీ తాకలేదని సీఏ, నైన్ నెట్వర్క్ ఓ ప్రకటనను విడుదల చేశాయి. స్మిత్ కంటికి వైర్ అడ్డుగా వచ్చిందని స్పష్టం చేశాయి. ఫీల్డింగ్ చేసేటప్పుడు స్పైడర్‌కామ్ అడ్డుగా ఉందని ఏ ఆటగాడైనా భావిస్తే దాన్ని అక్కడి నుంచి పక్కకు జరపమని అంపైర్‌ను అడగొచ్చు. ఒకే సిరీస్‌లో ఇద్దరు కెప్టెన్లు కలిసి ఆరు సెంచరీలు చేయడం సరికొత్త రికార్డు (కెప్టెన్‌గా కోహ్లి మూడు, స్మిత్ మూడు శతకాలు చేశారు) ఒకే సిరీస్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ (కోహ్లి, స్మిత్) నాలుగు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ‘సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెల్‌బోర్న్‌లోనే ఇది రావాల్సి ఉంది. ఇదే నా తొలి మ్యాచ్ అన్న తరహాలో బ్యాటింగ్ చేశా. బ్యాటింగ్ ఆర్డర్లో పైకి రావడంతో కుదురుకోవడానికి మంచి సమయం లభించింది. వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. ఆసీస్ బౌలర్లు వికెట్ల కోసం చాలా ప్రయత్నించారు. సెషన్ల వారిగా బ్యాటింగ్ చేయాలని భావించా. ఈ టెస్టుకు జట్టులో చోటు అంత సులభంగా దక్కలేదు.కోహ్లితో పాటు నాకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. నెట్స్‌లో ఫ్లెచర్, శాస్త్రి అద్భుతమైన సలహాలు ఇచ్చారు. క్యాచ్ ఇచ్చినందుకు బాధగా లేదు. అయితే నిర్లక్ష్యపు షాట్ ఆడినందుకు నిరాశపడుతున్నా. ఇక నుంచి షాట్ల ఎంపికపై చాలా జాగ్రత్తగా ఉంటా. శుక్రవారం మేం మెరుగ్గా బ్యాటింగ్ చేసి బౌలర్లు కష్టపడితే మ్యాచ్ గెలిచే అవకాశాలున్నాయి.’ -రాహుల్ (భారత్ బ్యాట్స్‌మన్) -
విరాట్ కోహ్లి ర్యాంక్ 15
దుబాయ్: మెల్బోర్న్ టెస్టులో అద్భుతంగా రాణించిన భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను 15వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. రహానే 15 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు. చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌లు వరుసగా 19, 20వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తొలిసారి 5వ స్థానంలో నిలిచి కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌ను నమోదు చేశాడు. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు చెరో 8 స్థానాలు మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు వరుసగా 36, 38వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో అశ్విన్ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. -
ఆసీస్ గడ్డపై వాళ్లను ఓడిస్తాం
ముంబై: ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో దూకుడుగా, సానుకూల దృక్పథంతో ఆడతామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. కంగారూల జట్టును వారి సొంత గడ్డపై ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ‘మా టెస్టు ఆటగాళ్ల సామర్థ్యంపై నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు ఈ సిరీస్‌పై దృష్టిపెట్టారు. వాళ్ల అనుభవాలను ఉపయోగించి ఆసీస్‌లో సవాళ్లను ఎదుర్కొంటారు. సానుకూల క్రికెట్ ఆడటం మా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాత దూకుడుతో మా సత్తా ఏంటో చూపెడతాం. ఇలాంటి తరహా మైండ్‌సెట్‌ను కలిగి ఉండటమే మా ఉద్దేశం. వెనుకబడిపోయినప్పుడు పుంజుకోవడానికి ప్లాన్ బి, సిలు కూడా మా వద్ద ఉన్నాయి’ అని ఆస్ట్రేలియా బయలుదేరే ముందు కోహ్లి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. రెగ్యులర్ కెప్టెన్ ధోని వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో డిసెంబర్ 4 నుంచి 8 వరకు బ్రిస్బేన్‌లో జరిగే తొలి టెస్టుకు కోహ్లి భారత్‌కు సారథ్యం వహిస్తాడు. తుది జట్టుపై ఆలోచన లేదు టెస్టుల కోసం సరైన జట్టును ఎంపిక చేసుకోవడం చాలా ప్రధానమైందని చెప్పిన విరాట్ తుది జట్టు గురించి ఎక్కువగా ఆలోచించడం లేదన్నాడు. ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ టూర్ ఆడటం కలిసొస్తుందన్నాడు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది దోహదం చేస్తుందన్నాడు. 2012లో మాదిరిగానే ఈసారి కూడా వ్యక్తిగతంగా రాణించేందుకు తాను కృషి చేస్తానన్నాడు. టెస్టు జట్టుకు నాయకత్వం వహించాలన్న తన కల ఫలించనుందని కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలను ఆటగాళ్లు పట్టించుకోవడం లేదని, తమ దృష్టంతా కేవలం ఆటపైనేనని చెప్పాడు. ప్రతికూల మైండ్‌సెట్ కంటే సానుకూల ఆలోచనలతో టూర్ మొదలుపెడితే ఆటపై ఎక్కువగా దృష్టిపెట్టొచ్చన్నాడు. 18 మందితో పర్యటనకు వెళ్తే ఆటగాళ్లు ఎవరైనా గాయపడినా ఇబ్బంది ఉండదన్నాడు. మరోవైపు ప్రత్యర్థులను చూసి భయపడేకంటే ఆసీస్ పర్యటనను ఆస్వాదించాలని టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి సూచించారు. భార్యకు ఆరోగ్యం బాగాలేనందున ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న కోచ్ డంకన్ ఫ్లెచర్ నేరుగా ఆస్ట్రేలియాలో జట్టుతో కలుస్తారు.