ధోని ముద్ర ఉంటుందా..?
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు వన్డే, టి20 జట్ల ఎంపిక నేడు
బెంగళూరు : దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్, టి20 సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక నేడు (ఆదివా రం) జరుగనుంది. వచ్చే నెల 2 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ముందుగా మూడు టి20ల సిరీస్‌తో పాటు, ఐదు వన్డేల్లో మూడింటికి జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఇటీవల శ్రీలంకకు వెళ్లిన భారత టెస్టు జట్టు... కెప్టెన్ విరాట్ కోహ్లి ఆలోచనలకు తగ్గట్టుగా ఐదుగురు బౌలర్లతో వెళ్లి దూకుడును ప్రదర్శించింది. ఇప్పుడు వన్డే, టి20ల్లోనూ జట్టు ఎంపికలో మునుపటిలాగా కెప్టెన్ ఎంఎస్ ధోని తనదైన ముద్రను వేస్తాడా.. లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది.
లేకపోతే సెలక్టర్లు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుంటే మాత్రం తమదైన శైలిలోనే జట్టును ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కోహ్లికి అనుకూల ఆటగాళ్లు చోటు దక్కిం చుకున్నా ఆశ్చర్యం లేదు. ఇదే జరిగితే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తిరిగి జట్టులోకి రావచ్చు. మరోవైపు ఐదు నెలల్లో టి20 ప్రపంచకప్ భారత్‌లోనే జరుగనుండడంతో కెప్టెన్ ధోని, సెలక్టర్లు ఈ విషయంపై మరింత దృష్టి సారించనున్నారు. ప్రొటీస్‌తో జరుగబోయే ఈ మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను సన్నాహక సిరీస్‌గా ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే కొన్ని కొత్త ముఖాలను పరీక్షించే అవకాశాలు లేకపోలేదు.
వన్డేల్లోకి సీనియర్ల రాక..
భారత్ చివరిసారిగా జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడింది. అయితే సీనియర్ ఆటగాళ్ల విశ్రాంతి కారణంగా రహానే నేతృత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు అక్కడకు వెళ్లింది. కెప్టెన్ ధోని, కోహ్లి, రైనా, రోహిత్, అశ్విన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండడంతో వీరి స్థానాలు ఖాయం. ఓపెనర్ శిఖర్ ధావన్, రహానే, రాయుడు ఓకే అయినా వీరిలో ధావన్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జింబాబ్వే సిరీస్‌లో మురళీ విజయ్ ఆకట్టుకోవడంతో అతడి పేరును పరిశీలించనున్నారు. ఇక జట్టులో చోటు కోల్పోయిన రవీంద్ర జడేజా పరిస్థితి ఏమిటో తెలియాలి.
పేసర్లుగా ధోని నమ్మకస్తులు మోహిత్ శర్మ, భువనేశ్వర్‌లతో పాటు బ్యాకప్‌గా ధవళ్ కులకర్ణి ఉండనున్నారు. ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌కు కూడా చాన్స్ ఇవ్వచ్చు. టి20 ఫార్మాట్‌లో కేదార్ జాదవ్, మనీష్ పాండే ఎంపికయ్యే అవకాశాలున్నాయి. దీంట్లో అశ్విన్‌కు తోడుగా రెండో స్పిన్నర్‌గా హర్భజన్ తీసుకోవడంలో ధోని నిర్ణయమే కీలకం. ఇక భారత్ ‘ఎ’ జట్టులో ఆకట్టుకుంటున్న గురుకీరత్ సింగ్, మయాంక్ అగర్వాల్‌లను పొట్టి ఫార్మాట్‌కు పరిశీలించవచ్చు.