త్రిమూర్తుల తడాఖా | World's best batsmen strike again | Sakshi
Sakshi News home page

త్రిమూర్తుల తడాఖా

Published Tue, May 17 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

త్రిమూర్తుల తడాఖా

త్రిమూర్తుల తడాఖా

చెలరేగిన కోహ్లి, డివిలియర్స్, గేల్
కోల్‌కతాపై బెంగళూరు ఘన విజయం  ప్లే ఆఫ్ ఆశలు సజీవం

 
 
విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. అలాగే తనకు అచ్చొచ్చిన మైదానంలో లీగ్‌లో తొలిసారిగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మెరుపులు మెరిపించాడు. అటు డివిలియర్స్ కూడా తనదైన శైలిలో చెలరేగాడు. ఫలితంగా ఈ త్రిమూర్తుల తడాఖాతో బెంగళూరు ఖాతాలో మరో కీలక విజయం చేరింది. అటు ఈ మ్యాచ్‌ను నెగ్గి ప్లేఆఫ్‌లో అడుగుపెడదామనుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎదురుచూపులు తప్పలేదు.
 
 
 
కోల్‌కతా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ భీకర ఫామ్‌ను కొనసాగిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (51 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు; 3 సిక్సర్లు), డివిలియర్స్ (31 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) మెరుపులకు తోడు... తాజా లీగ్‌లో తొలిసారిగా క్రిస్ గేల్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు; 4 సిక్సర్లు) దుమ్మురేపడంతో ప్లే ఆఫ్‌లో చోటు కోసం ఈ జట్టు మరో అడుగు ముందుకేసింది. ఈ త్రయం జోరుతో సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు), మనీష్ పాండే (35 బంతుల్లో 50; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 186 పరుగులు చేసి నెగ్గింది. నరైన్‌కు వికెట్ దక్కింది. కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


 ఆదుకున్న గంభీర్, పాండే
 వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కోల్‌కతాకు శుభారంభం అందలేదు. మూడో ఓవర్‌లో స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో తీసుకున్న అద్భుత రిటర్న్ క్యాచ్‌కు ఉతప్ప (2) వెనుదిరిగాడు. అయితే బెంగళూరుకు ఈ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. మనీష్ పాండేతో కలిసి కెప్టెన్ గంభీర్ స్కోరును పరిగెత్తించాడు. నాలుగో ఓవర్‌లో గంభీర్ ఓ ఫోర్, పాండే రెండు ఫోర్లతో 15 పరుగులు పిండుకున్నారు. ఈ జోరుకు పవర్‌ప్లేలో 51/1 పరుగులు వచ్చాయి. ఏడో ఓవర్‌లో పాండే ఓ సిక్స్, గంభీర్ రెండు ఫోర్లు బాదాడు. అయితే ఆ తర్వాత నాలుగు ఓవర్లు బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. దీంతో 10 ఓవర్లో 87 పరుగులు చేసింది. అటు 32 బంతుల్లో గంభీర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి రెండో వికెట్‌కు 76 పరుగులు జత చేరాయి. కొద్దిసేపటికే 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన పాండే, పఠాన్ (6), సూర్యకుమార్(5)లు వరుస ఓవర్లలో అవుట్ కావడంతో కోల్‌కతా తడబడింది. కానీ రసెల్, షకీబ్ అల్ హసన్ చివరి ఓవర్లలో బ్యాట్‌లను ఝళిపించి అండగా నిలబడ్డారు. వాట్సన్ వేసిన 18వ ఓవర్‌లో చెరో సిక్స్ బాదడంతో 16 పరుగులు వచ్చాయి. చిట్ట చివరి బంతిని వాట్సన్ లైన్‌కు ఇన్‌సైడ్‌లోనే వేసినా అంపైర్ వైడ్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ జోడి మధ్య ఆరో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు వచ్చాయి.


 గేల్ దూకుడు
 అనంతర లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ ధాటిగా కొనసాగింది. పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న గేల్ తన పవర్ చూపించాడు. రెండో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన గేల్ ఆ మరుసటి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లతో ఈడెన్‌ను హోరెత్తించాడు. వర్ష సూచనను అంచనా వేసుకుంటూ రన్‌రేట్ మెరుగ్గా ఉండేందుకు వేగంగా ఆడింది. గేల్ దూకుడును గమనించిన కోహ్లి ఎక్కువగా స్ట్రయిక్‌ను తనకే ఇచ్చాడు. పవర్‌ప్లేలో బెంగళూరు 63 పరుగులు సాధించింది. అయితే నరైన్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో కవర్స్‌లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత గేల్ ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్‌కు 71 పరుగులు వచ్చాయి. కోహ్లికి జతగా డివిలియర్స్ కలవడంతో 10 ఓవర్లలో 91/1 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను గంభీర్ వదిలేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లి మరింత రెచ్చిపోయాడు. మరోవైపు డివిలియర్స్ కూడా చెలరేగడంతో మరో ఎనిమిది బంతులుండగానే బెంగళూరు విజయాన్ని అందుకుంది.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి అండ్ బి) ఇక్బాల్ అబ్దుల్లా 2; గంభీర్ (రనౌట్) 51; మనీష్ పాండే (సి) డివిలియర్స్ (బి) అరవింద్ 50; యూసుఫ్ పఠాన్ (స్టంప్డ్) రాహుల్ (బి) చాహల్ 6; రసెల్ నాటౌట్ 39; సూర్యకుమార్ యాదవ్ (సి) ఇక్బాల్ (బి) అరవింద్ 5; షకీబ్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 183.

 వికెట్ల పతనం: 1-14, 2-90, 3-113, 4-118, 5-125.

బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 1-0-8-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-41-2; ఇక్బాల్ అబ్దుల్లా 4-0-22-1; వాట్సన్ 4-0-46-0; చాహల్ 4-0-38-1; జోర్డాన్ 3-0-22-0.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ ఎల్బీడబ్ల్యు (బి) నరైన్ 49; కోహ్లి నాటౌట్ 75; డివిలియర్స్ నాటౌట్ 59; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 186.

 వికెట్ల పతనం: 1-71.
 బౌలింగ్: రసెల్ 2.3-0-32-0; మోర్కెల్ 2-0-20-0; నరైన్ 4-0-34-1; చావ్లా 3.1-0-32-0; రాజ్‌పుత్ 3-0-28-0; షకీబ్ 4-0-39-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement