KKR Vs RCB: కోల్‌కతా లెక్క మార్చేసింది | IPL 2024 RCB Vs KKR: Kolkata Knight Riders Beat Royal Challengers Bengaluru By 7 Wickets, Score Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 KKR Vs RCB: కోల్‌కతా లెక్క మార్చేసింది

Published Sat, Mar 30 2024 1:29 AM

Knightriders won by 7 wickets - Sakshi

సొంతగడ్డపై బెంగళూరుకు చెక్‌ 

7 వికెట్లతో నైట్‌రైడర్స్‌ విజయం  

చెలరేగిన నరైన్, సాల్ట్, వెంకటేశ్‌ 

కోహ్లి వీరోచిత ప్రదర్శన వృథా 

బెంగళూరు: కోల్‌కతా ఓపెనర్లు నరైన్‌ (22 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), సాల్ట్‌ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌ ముందు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి (59 బంతుల్లో 83; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ చిన్నదిగా మారిపోయింది. దీంతో ఈ సీజన్‌లో తొలి సారి సొంతగడ్డపై ఆతిథ్య జట్టుకు చుక్కెదురైంది. కోల్‌కతా గత తొమ్మిది మ్యాచ్‌ల సంప్రదాయాన్ని ఈ మ్యాచ్‌తో మార్చేసింది.

చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆరంభం నుంచి కోహ్లి, ఆఖర్లో దినేశ్‌ కార్తీక్‌ (8 బంతుల్లో 20; 3 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (30 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు.  

కోహ్లి ఒక్కడే... 
తొలి బంతికే బౌండరీతో కోహ్లి బెంగళూరు ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే అవుటవుతున్నా... తన వీరోచిత ప్రదర్శనతో పరుగుల్ని వేగంగా పేర్చిన కోహ్లి పెద్ద భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కెపె్టన్‌ డుప్లెసిస్‌ (8) రెండో ఓవర్లోనే అవుట్‌ కాగా,  గ్రీన్‌ (21 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్‌ ( 19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎంతోసేపు నిలువలేదు. కోహ్లి ఒక్కడే నిలిచి ఇన్నింగ్స్‌ను ఆఖరి దాకా నడిపించాడు.

తన మార్కు క్లాసిక్‌ షాట్లతో, తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో బెంగళూరు ప్రేక్షకుల్ని ఆద్యంతం కేరింతల్లో ముంచేశాడు. 36 బంతుల్లో విరాట్‌ అర్ధ సెంచరీ పూర్తయ్యింది. గత మ్యాచ్‌లో పేలవ బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ తీయకుండా 53 పరుగులిచ్చిన మిచెల్‌ స్టార్క్‌ ఈ సారి కూడా వికెట్‌ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు.  

‘పవర్‌ ప్లే’లో 85/0 
కోల్‌కతా ముందున్న లక్ష్యం కష్టమైంది. కానీ సులువుగా ఛేదించింది. ఓపెనర్లు సాల్ట్, నరైన్‌ల బ్యాటింగ్‌ సునామీ ‘పవర్‌ ప్లే’లోనే మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకుంది. ఓపెనర్లు ఇద్దరూ దంచేసే పనిలో పడటంతో సిక్స్‌లైతే మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి.

సిరాజ్‌ తొలి ఓవర్‌లో సాల్ట్‌ రెండు  సిక్స్‌లు, ఒక బౌండరీలతో ఉతికేశాడు. సునీల్‌ నరైన్‌... తానేం తక్కువ కాదని జోసెఫ్‌ మూడో ఓవర్లో 2 భారీ సిక్సర్లతో చాటుకున్నాడు. ఈ మెరుపుల మేనియాలో నైట్‌రైడర్స్‌ జట్టు కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను దాటేసింది. 6 ఓవర్లలో వికెటే కోల్పోకుండా 85 పరుగులు చేసింది. అంతలోనే చేయాల్సిన పరుగులు వందలోపే దిగొచ్చింది.ఏడో ఓవర్లో నరైన్‌ను డాగర్, ఎనిమిదో ఓవర్లో సాల్ట్‌ను వైశాక్‌ అవుట్‌ చేశారు. కానీ అప్పటికే స్కోరు 92/2. లక్ష్యంలో సగం పనైపోయింది. మిగతా సగాన్ని వెంకటేశ్‌ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (24 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తి చేశారు. దీంతో 19 బంతులు మిగిలుండగానే నైట్‌రైడర్స్‌ లక్ష్యాన్ని చేరుకుంది. 

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి నాటౌట్‌ 83; డుప్లెసిస్‌ (సి) స్టార్క్‌ (బి) హర్షిత్‌ 8; గ్రీన్‌ (బి) రసెల్‌ 33; మ్యాక్స్‌వెల్‌ (సి) రింకూసింగ్‌ (బి) నరైన్‌ 28; పటిదార్‌ (సి) రింకూసింగ్‌ (బి) రసెల్‌ 3; రావత్‌ (సి) సాల్ట్‌ (బి) హర్షిత్‌ 3; దినేశ్‌ కార్తీక్‌ రనౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–17, 2–82, 3–124, 4–144, 5–151, 6–182. 
బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–47–0, హర్షిత్‌ 4–0–39–2, అనుకూల్‌ 2–0–6–0, నరైన్‌ 4–0–40–1, రసెల్‌ 4–0–29–2, వరుణ్‌ 2–0–20–0. 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) గ్రీన్‌ (బి) వైశాక్‌ 30; నరైన్‌ (బి) డాగర్‌ 47; వెంకటేశ్‌ (సి) కోహ్లి (బి) యశ్‌ దయాళ్‌ 50; శ్రేయస్‌ నాటౌట్‌ 39; రింకూ సింగ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.5 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–86, 2–92, 3–167. బౌలింగ్‌: సిరాజ్‌ 3–0–46–0, యశ్‌ దయాళ్‌ 4–0–46–1, జోసెఫ్‌ 2–0–34–0, మయాంక్‌ డాగర్‌ 2.5–0–23–1, వైశాక్‌ 4–0–23–1, వైశాక్‌ 1–0–7–0. 

ఐపీఎల్‌లో నేడు
లక్నో X  పంజాబ్‌ 
వేదిక: లక్నో 

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement