వరుసగా నాలుగో గెలుపు
60 పరుగులతో ఘనవిజయం
చెలరేగిన కోహ్లి, పటిదార్
వరుసగా పదో ఏడాది ప్లే ఆఫ్స్ చేరలేకపోయిన పంజాబ్ కింగ్స్
ధర్మశాల: ఐపీఎల్‌లో ఆరు వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఎనిమిదో ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా పదో ఏడాది ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయింది. గురువారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసి ఆర్‌సీబీ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రిలీ రోసో (27 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
భారీ భాగస్వామ్యాలు...
కొత్త బౌలర్ కావేరప్ప తక్కువ వ్యవధిలో డుప్లెసిస్ (9), జాక్స్ (12)లను అవుట్ చేసి పంజాబ్‌కు తగిన ఆరంభం అందించాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి చెలరేగిపోగా, అతనికి పటిదార్ జత కలిశాక మరింత వేగంగా పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లో పటిదార్ 3 సిక్స్‌లు కొట్టాక జోరు పెరిగింది.
21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పటిదార్ వెనుదిరిగాడు. ఈ దశలో వర్షంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న కోహ్లి దూకుడు పెంచాడు. స్యామ్ కరన్ బౌలింగ్‌లో అతను కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి సెంచరీ చేజార్చుకున్నాడు.
కోహ్లి, గ్రీన్ ఐదో వికెట్‌కు 46 బంతుల్లోనే 96 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. పంజాబ్ భారీ ఛేదనలో బెయిర్‌స్టో (27) కొంత ధాటిగా ఆడగా... రోసో ఇన్నింగ్స్ మాత్రమే కొద్దిసేపు ఆశలు రేపింది. అతను వెనుదిరిగిన తర్వాత శశాంక్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది.
క్యాచ్‌లు వదిలేసి...
పంజాబ్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వచ్చిన మంచి అవకాశాలను పంజాబ్ ఫీల్డర్లు వృథా చేశారు. కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన కావేరప్ప మాత్రం తీవ్రంగా నిరాశ చెందాల్సి వచ్చింది.
అతని బౌలింగ్‌లోనే కోహ్లి (0, 10 వద్ద) ఇచ్చిన క్యాచ్‌లను అశుతోష్, రోసో వదిలేయగా... పటిదార్ (0 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను హర్షల్ నేలపాలు చేశాడు. పటిదార్ 33 వద్ద ఉన్నప్పుడు చహర్ బౌలింగ్‌లో కొంత కష్టమైన క్యాచ్‌ను బెయిర్‌స్టో అందుకోలేకపోయాడు. ‘సున్నా’ వద్ద బతికిపోయిన కోహ్లి 92 వరకు చేరడం పంజాబ్‌ను అన్నింటికంటే బాగా దెబ్బ తీసింది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రోసో (బి) అర్‡్షదీప్ 92; డుప్లెసిస్ (సి) శశాంక్ (బి) కావేరప్ప 9; జాక్స్ (సి) హర్షల్ (బి) కావేరప్ప 12; పటిదార్ (సి) బెయిర్‌స్టో (బి) స్యామ్ కరన్ 55; గ్రీన్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 46; దినేశ్ కార్తీక్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 18; లోమ్రోర్ (బి) హర్షల్ 0; స్వప్నిల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–19, 2–43, 3–119, 4–211, 5–238, 6–240, 7–241. బౌలింగ్: కావేరప్ప 4–0–36–2, అర్‡్షదీప్ 3–0–41–1, స్యామ్ కరన్ 3–0–50–1, హర్షల్ 4–0–38–3, రాహుల్ చహర్ 3–0–47–0, లివింగ్‌స్టోన్ 3–0–28–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 6; బెయిర్‌స్టో (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 27; రోసో (సి) జాక్స్ (బి) కరణ్ 61; శశాంక్ సింగ్ (రనౌట్) 37; జితేశ్ శర్మ (బి) కరణ్ 5; లివింగ్‌స్టోన్ (సి) కరణ్ (బి) స్వప్నిల్ 0; స్యామ్ కరన్ (బి) ఫెర్గూసన్ 22; అశుతోష్ శర్మ (ఎల్బీ) (బి) సిరాజ్ 8; హర్షల్ (సి) ఫెర్గూసన్ (బి) సిరాజ్ 0; చహర్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (సి) కరణ్ (బి) సిరాజ్ 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–6, 2–71, 3–107, 4–125, 5–126, 6–151, 7–164, 8–170, 9–174, 10–181. బౌలింగ్: స్వప్నిల్ 3–0–28–2, సిరాజ్ 4–0–43–3, యశ్ దయాళ్ 2–0–22–0, ఫెర్గూసన్ 3–0–29–2, జాక్స్ 1–0–5–0, గ్రీన్ 1–0–16–0, కరణ్ శర్మ 3–0–36–2.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ X చెన్నై
వేదిక: అహ్మదాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment