రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన | Virat Kohli Dismisses Rumours Of Rift With Rohit Sharma | Sakshi
Sakshi News home page

వట్టి మాటలు కట్టిపెట్టండి

Published Tue, Jul 30 2019 4:19 AM | Last Updated on Tue, Jul 30 2019 8:23 AM

Virat Kohli Dismisses Rumours Of Rift With Rohit Sharma - Sakshi

అవకాశం వచ్చినప్పుడల్లా రోహిత్‌ శర్మను ప్రశంసలతో ముంచెత్తాను. నాలో అభద్రతాభావం ఉంటే ఇలా చేసేవాడినా? భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందన ఇది. ఇటీవల తనకు, రోహిత్‌కు పడటం లేదంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అతను తెర దించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా దాటవేత ధోరణి లేకుండా ఈ అంశంపై కోహ్లి పూర్తి స్పష్టతనిచ్చాడు. పేరుకు వెస్టిండీస్‌తో సిరీస్‌కు బయల్దేరడానికి ముందు జరుగుతున్న అధికారిక మీడియా సమావేశమే అయినా రోహిత్‌తో సంబంధాల గురించే కోహ్లి వివరణ సుదీర్ఘంగా సాగింది. కోచ్‌ రవిశాస్త్రి కూడా కెప్టెన్‌తో జత కలిసి జట్టు ప్రయోజనాల కోసమే ఎవరైనా ఆడతారని, జట్టుకంటే ఎవరూ ఎక్కువ కాదంటూ ‘గాలివార్తలను’ కొట్టిపారేశాడు. కోహ్లి తాజా సమాధానాలతోనైనా విభేదాల వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందో లేదో వేచి చూడాలి.   

ముంబై: భారత కెప్టెన్‌ కోహ్లి తన డిప్యూటీ రోహిత్‌ శర్మతో విభేదాల వార్తలపై పెదవి విప్పాడు. జట్టులో అంతా బాగుందని, ఎవరో కావాలని ఇలాంటివి పుట్టిస్తున్నారని ఒకింత అసహనాన్ని ప్రదర్శించాడు. టి20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు సోమవారం రాత్రి టీమిండియా సభ్యులు విండీస్‌ బయల్దేరారు. దానికి ముందు కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి మీడియాతో సంభాషించారు. విశేషాలు కోహ్లి మాటల్లోనే...

రోహిత్‌తో విభేదాల గురించి వాస్తవాలేమిటి?  
నేను కూడా బయటి నుంచి కొన్ని రోజులుగా ఎన్నో విషయాలు వింటున్నాను. నిజంగా జట్టు సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం లేకపోతే నాకు తెలిసి ఇంతటి విజయాలు సాధ్యం కావు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో జట్టు ప్రదర్శనలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి సంబంధాలు, నమ్మకం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గత 2–3 ఏళ్లలో మేం ఎన్నో గొప్ప ఘనతలు సాధించాం. వన్డేల్లో ఏడో స్థానం నుంచి నంబర్‌వన్‌కు చేరుకున్నాం. ఒకరిపై మరొకరికి పరస్పర విశ్వాసం, సమన్వయం, తగిన గౌరవం లేకపోతే ఇదంతా జరగకపోయేది. నిజంగా సంబంధాలు బాగా లేకపోతే అది మైదానంలో ప్రతిఫలిస్తుంది.  

ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందన ఏమిటి?  
ఇవన్నీ చాలా చికాకు పరుస్తాయి. మేం జనంలోకి వెళితే మీరు వరల్డ్‌ కప్‌లో చాలా బాగా ఆడారంటూ ప్రశంసలు వినిపిస్తుంటే మరోవైపు ఇలాంటి హాస్యాస్పద మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మన మెదళ్లలోకి వాటిని నింపి నిజమని నమ్మించేందుకు  ప్రయత్నిస్తున్నారు. జట్టుకు సంబంధించిన విజయాలు, సానుకూలాంశాల గురించి అసలేమీ తెలియనట్లుగా నటిస్తున్నారు. వ్యక్తిగత అంశాలను ఆటలోకి తీసుకురావడం అందరినీ అగౌరవపర్చడమే. నేను చాలా కాలంగా ఇలాంటివి అనుభవిస్తూనే ఉన్నాను. మా జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌ ఎంత బాగుంటుందో వచ్చి చూడండి. కుల్దీప్‌తో ఎలా మాట్లాడతాం, ధోనిలాంటి సీనియర్‌ను ఎలా ఆటపట్టిస్తామో వీడియో తీసి చూపించలేను కదా?  

రోహిత్‌తో అంతా బాగున్నట్లేనా!  
నా గురించి ఒక్క మాట చెబుతాను. నిజంగా నాకు ఎవరిపైనైనా కోపం ఉంటే అది నా ముఖంలో కనిపిస్తుంది. నాకు ఎలాంటి అభద్రతాభావం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్‌ శర్మను ప్రశంసించేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఎందుకంటే అతనిపై నాకు నమ్మకముంది. రోహిత్‌ దానికి అర్హుడు. నేను 10 ఏళ్లుగా, రోహిత్‌ 11 ఏళ్లుగా ఆడుతున్నాం. జట్టును ఈ స్థాయికి తెచ్చేందుకు నాలుగేళ్లుగా కలిసి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మేం బతికేది, శ్వాసించేది, ఏం చేసినా భారత క్రికెట్‌ బాగు కోసమే. మా మధ్య ఎలాంటి సమస్య లేదు. ఇలాంటివి పుట్టించి ఎవరు లాభపడుతున్నారో అర్థం కావడం లేదు.  

మిడిలార్డర్‌ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?
దీనిపై కచ్చితంగా ఇలాగే చేయాలంటూ పరిష్కారం ఏమీ లేదు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే. టాపార్డర్‌ బాగుందంటూ ప్రశంసించిన వారే మిడిలార్డర్‌కు బ్యాటింగ్‌ అవకాశం రాలేదంటారు. రాక రాక ఒక మ్యాచ్‌లో అవకాశం వచ్చి వారు విఫలమైతే 1–2 మ్యాచ్‌లతోనే వారి ప్రదర్శనను ఎలా అంచనా వేస్తాం! నాలుగో స్థానం గురించి బెంగ ఏమీ లేదు. ప్రపంచ కప్‌లో ఓడినంత మాత్రాన ఏదో ప్రమాదం జరిగినపోయినట్లు కాదు.

రవిశాస్త్రికే నా ఓటు...
కోచ్‌ రవిశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని కోహ్లి మరోసారి ప్రదర్శించాడు. ఒకవైపు క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) హెడ్‌ కోచ్‌ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే తన ఓటు మాత్రం శాస్త్రికేనని బహిరంగంగా మద్దతిచ్చేశాడు. ‘కోచ్‌ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు,            శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేసేశాడు.   

రాబోయే విండీస్‌ పర్యటన ఎలా ఉండబోతోంది?  
మంచి ఆటకు, వినోదానికి అనువైన దేశం వెస్టిండీస్‌. ఈ టూర్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ముందుగా టి20ల్లో కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించి ప్రయత్నించాలని భావిస్తున్నాం. అయితే టెస్టు చాంపియన్‌షిప్‌ నేపథ్యంలో ఈ సారి టెస్టు సిరీస్‌ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లతో పోలిస్తే ఇకపై ప్రతీ టెస్టులో సవాళ్లు, తీవ్రత ఎక్కువ ఉంటాయి. టెస్టులు బతికేందుకు ఇది చాలా అవసరం. నా దృష్టిలో కూడా మొదటి ప్రాధాన్యత, నేను ఇష్టపడేది కూడా సుదీర్ఘ ఫార్మాట్‌నే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement