కోహ్లి ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తోంది
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆస్ట్రేలియా మీడియాపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ధ్వజమెత్తారు. కోహ్లి గురించి చెత్త రాతలు రాస్తోందని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోహ్లికి సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కోహ్లిని పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఆసీస్ జర్నలిస్టులు అతడి ఇమేజ్‌ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, దీన్ని కోహ్లి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చారు.
‘ట్రంప్‌తో కోహ్లిని పోల్చడం చాలా చెత్తగా ఉంది. కోహ్లి అంటే నాకే కాదు ఆసీస్ దేశస్తులకు కూడా చాలా ఇష్టం. సవాళ్లను స్వీకరించే అతడి తత్వం ఆదర్శనీయం. ఇద్దరు ముగ్గురు ఆసీస్ జర్నలిస్టులు అతడి గౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. వారి గురించి తను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఆసీస్ మీడియా చెబుతున్న విషయాలను స్మిత్ కూడా పట్టించుకోవడం లేదు. ధర్మశాలలో జరిగే చివరి టెస్టుపై దృష్టి సారించి సిరీస్ దక్కించుకోవాలనే ఇరు జట్ల కెప్టెన్లు తమ ఆటగాళ్లకు చెబుతున్నారు’ అని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో క్లార్క్ వివరించారు.
విరాట్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని, క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ అతడి నుంచి అభిమానులు సెంచరీలు ఆశిస్తారని తెలిపారు. అయితే అతడి తాజా ఫామ్ లేమి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధర్మశాలలో భారీ స్కోరు చేసి సిరీస్ గెలిపించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఇరు జట్ల బౌలర్లు తీవ్రంగా అలసిపోయారని, దీంతో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుని వారికి తగిన విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, పరిపాలన కమిటీ చీఫ్ వినోద్ రాయ్‌లకు క్లార్క్ అందజేశారు.