తొండి ఆటతో.. హిట్‌ వికెట్‌ | PAKISTAN PM: Imran Khan cricketing career overshadowed his political journey | Sakshi

తొండి ఆటతో.. హిట్‌ వికెట్‌

Apr 10 2022 5:42 AM | Updated on Apr 10 2022 5:42 AM

PAKISTAN PM: Imran Khan cricketing career overshadowed his political journey - Sakshi

నాయకుడంటే ఎలా ఉండాలి? మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకూడదు ప్రధాని పీఠం ఎక్కేవరకు   తూటాల్లా పేలే మాటలతో, భావోద్వేగ ప్రసంగాలతో అవినీతి నాయకులపై సమరోత్సాహంతో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పదవి చేపట్టాక ఎందుకు ప్రజల ఆశలకి తగ్గట్టుగా ఉండలేకపోయారు? సమర్థుడైన క్రికెట్‌ కెప్టెన్‌గా పాక్‌కు ప్రపంచ కప్‌ను అందించిన ఇమ్రాన్‌  ఒక అసమర్థ ప్రధానిగా ప్రపంచ దేశాల్లో ఎందుకు ముద్ర పడ్డారు?   మొదటి నుంచి పాటించిన ఉన్నత విలువలకు అధికారం రాగానే తిలోదకాలు ఇచ్చారు కాబట్టి.. మాట తప్పి.. ప్రధాని పదవిని నిలుపుకోవడానికి అమెరికా బూచి చూపి   పాక్‌ ప్రజలను బురిడీ కొట్టించాలని చూశారు కాబట్టి.. క్రికెట్‌ నుంచి రాజకీయాల వరకు ఇమ్రాన్‌ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమే అయినప్పటికీ అబద్ధమాడి ప్రజాదరణను కోల్పోయారు!

క్రికెట్‌ మైదానంలో ఫాస్ట్‌ బౌలింగ్‌తో దూకుడు చూపించి పాకిస్తాన్‌కు వరల్డ్‌కప్‌ అందించిన సమర్థుడైన కెప్టెన్‌గా పేరుప్రతిష్టలు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ పొలిటికల్‌ పిచ్‌పై అవమాన భారంతో పెవిలియన్‌ ముఖం పట్టారు. దుందుడుకు స్వభావం, ఆవేశాన్ని అణచుకోలేని తత్వం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఆయన రాజకీయ జీవితానికి ఎదురు దెబ్బలా మారాయి. పాకిస్తాన్‌లోని లాహోర్లో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో 1952 సంవత్సరం అక్టోబర్‌ 5న ఇమ్రాన్‌ఖాన్‌ జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో   ఫిలాసఫీ, పాలిటిక్స్, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ చేశారు. క్రికెట్‌పై మక్కువతో దానిపైనే దృష్టి పెట్టారు. 1976లో జాతీయ స్థాయిలో పాక్‌ క్రికెట్‌ జట్టులో స్థానం పొందారు.

ఎదురులేని ఆల్‌రౌండర్‌గా ఎదుగుతూనే , తనకున్న అందమైన రూపంతో ఒక ప్లేబాయ్‌ ఇమేజ్‌ సంపాదించారు. అత్యంత లగ్జరీ లైఫ్‌ అనుభవిస్తూ లేడీ లిజా కేంబెల్, సుసన్నా కాన్‌ స్టాంటైన్‌ వంటి మోడల్స్‌తో ప్రేమాయణం నడిపారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ తన వ్యక్తిగత జీవితాన్ని దాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.  బ్రిటన్‌ బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌ స్మిత్‌ను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. 2004లో విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్‌ రెహామ్‌ ఖాన్‌ను రెండోసారి పెళ్లి చేసుకున్నారు. పది నెలల్లోనే వారి బంధం ముగిసింది. ముచ్చటగా మూడోసారి తన ఆధ్యాత్మిక గురు బష్రా మనేకను పాకిస్తాన్‌ ప్రధాని పదవి అందుకోవడానికి కొన్ని నెలల ముందే పెళ్లాడారు

రెండు సీట్ల నుంచి ప్రధాని పదవి వరకు  
1992లో పాక్‌కు ప్రపంచ కప్‌ అందించాక క్రికెట్‌కు గుడ్‌బై కొట్టిన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రజాసేవ వైపు మళ్లారు. 1996లో అందరికీ న్యాయం అన్న  నినాదంతో పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ (పీటీఐ) అన్న పార్టీని స్థాపించారు.మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పీటీఐ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అవినీతికి వ్యతిరేకంగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్‌ఖాన్‌ 2011 వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకున్నారు.

దేశంలో అవినీతి నేతలకు వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్వేగభరితంగా చేసే ప్రసంగాలు వినడానికి జనం వెల్లువెత్తారు. ప్రధాన పార్టీలైన నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌), బేనజీర్‌ భుట్టోకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)ని ఢీ కొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2013 నాటికల్లా పీటీఐ 35 సీట్లతో  ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్‌ షరీఫ్‌ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి, చివరికి ఆయనని జైలు పాలు చేశారు. 2018 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని పీఠం అందుకున్నారు.

ప్రధానిగా ఎలా విఫలమయ్యారు ?  
నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తానన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ గత మూడున్నరేళ్లలో కఠినమైన సవాళ్లే ఎదుర్కొన్నారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడంలో విఫలమయ్యారు. ఆర్థిక వృద్ధి రేటు 3.5శాతానికి మించలేదు. ద్రవ్యోల్బణం 12 శాతానికి పరుగులు పెట్టింది. కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చలేక చేతులెత్తేశారు. దీంతో సాధారణ ప్రజల్లో ఇమ్రాన్‌పై వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రభుత్వం కంటే ఆర్మీ శక్తిమంతంగా ఉండే పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కి, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాతో విభేదాలు ఏర్పడడంతో ఆయన పదవికి గండం ఏర్పడింది.

ఐఎస్‌ఐ చీఫ్‌ జనరల్‌గా నదీమ్‌ అహ్మద్‌ అంజుమ్‌ నియామకం అంశంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో విపక్ష పార్టీలు ఇదే అదునుగా ఏకమై ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేశాయి. మళ్లీ పాక్‌లో సైనిక పాలన వస్తుందని భావించారు కానీ ఈసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకే ఆర్మీ మొగ్గు చూపించినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పటివరకు పాకిస్తాన్‌ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో లేరు. అయితే సైనిక తిరుగుబాటు లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వాలు పతనమయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌కి ఇప్పుడు అదే అనుభవం ఎదురైంది.

పశ్చిమదేశాలపై ఎందుకీ ఆరోపణలు  
అమెరికా కుట్ర చేసి తన ప్రభుత్వాన్ని కూల్చేస్తోందంటూ ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన ఆరోపణలు పెను సంచలనంగా మారి చర్చకు దారి తీశాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24నే ఇమ్రాన్‌ రష్యా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోవడం రాజకీయంగా కలకలం రేపింది. తాను రష్యా వెళ్లినందుకే  అమెరికా కక్ష కట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిందని ఇమ్రాన్‌ ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలే ఇప్పుడు ఆయన పదవికి ఎసరు తెచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో విపక్షాలపై వ్యతిరేకత ఏర్పడడానికే ఇమ్రాన్‌ఖాన్‌ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ పరువే పోతుందని భారత్‌లో పాకిస్తాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం ఫలితంతో సంబంధం లేకుండా పాకిస్తాన్‌లో గడువు కంటే ముందే ఎన్నికలు వస్తాయని అంచనాలు ఉండడంతో.. అతివాద భావజాలం ప్రబలుతున్న పాక్‌లో అమెరికా ఎదురించిన రియల్‌ హీరో ఇమేజ్‌ను సంపాదించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలనేది ఇమ్రాన్‌ఖాన్‌ ఆలోచనగా ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

– నేషనల్‌ డెస్క్‌ సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement