ఇస్లామాబాద్/లాహోర్: ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ‘‘ఆంతరంగిక శాఖ మంత్రి సనావుల్లా, ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ ఫైసల్ నసీర్‌తో పాటు మరొకరికి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యముంది. వీరి పేర్లతో కూడిన వీడియోను ఇప్పటికే విదేశాలకు పంపించేశాను. నాకు జరగరానిది జరిగితే ఆ వీడియో బయటకు వస్తుంది’ అన్నారు.
దుండగుడి కాల్పుల్లో తన కుడి కాలిలోకి నాలుగు బుల్లెట్లు దిగాయని చెప్పారు. చికిత్స పొందుతున్న తన సొంత షౌకత్ ఖానుమ్ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపినట్లుగానే వజీరాబాద్‌లో తనను చంపేందుకు కుట్ర జరుగుతున్న విషయం ముందే తెలుసన్నారు. ‘‘నాపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉగ్రవాది కాడు. నాపై దైవదూషణ నేరం మోపారు. అధికార పీఎంఎల్‌ఎన్ దాన్ని ప్రచారం చేసింది.
అంతా పథకం ప్రకారం జరుగుతోంది. దీని వెనుక కుట్రను ఛేదిస్తాం’’ అన్నారు. గాయం నుంచి కోలుకున్నాక పోరాటం కొనసాగిస్తానన్నారు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ నేతకు కూడా న్యాయం జరగడం లేదని పాక్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ బందియాల్‌నుద్దేశించి అన్నారు. ఇమ్రాన్ కుడి కాలి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇమ్రాన్‌పై కాల్పులను నిరసిస్తూ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు.
శుక్రవారం ప్రార్థనల అనంతరం పీటీఐ కార్యకర్తలు రావల్పిండి, ఫైజాబాద్‌ల్లో భారీగా రోడ్లపై బైఠాయించారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. లాహోర్‌లో గవర్నర్ హౌస్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ ఘటనపై పోలీసులు, నిఘా అధికారులతో సంయుక్త విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ ప్రభుత్వం పంజాబ్‌ను కోరింది. ఇమ్రాన్ మాత్రమే చంపేందుకు కాల్పులు జరిపినట్లు నిందితుడు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో లీక్‌కు కారకులైన పలువురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. వారి సెల్‌ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. వజీరాబాద్ పట్టణంలో గురువారం పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ర్యాలీలో దుండగుల తుపాకీ కాల్పుల్లో ఒకరు చనిపోగా ఇమ్రాన్ సహా పలువురు గాయపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment