anti-people
-
తొండి ఆటతో.. హిట్ వికెట్
నాయకుడంటే ఎలా ఉండాలి? మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకూడదు ప్రధాని పీఠం ఎక్కేవరకు తూటాల్లా పేలే మాటలతో, భావోద్వేగ ప్రసంగాలతో అవినీతి నాయకులపై సమరోత్సాహంతో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవి చేపట్టాక ఎందుకు ప్రజల ఆశలకి తగ్గట్టుగా ఉండలేకపోయారు? సమర్థుడైన క్రికెట్ కెప్టెన్‌గా పాక్‌కు ప్రపంచ కప్‌ను అందించిన ఇమ్రాన్ ఒక అసమర్థ ప్రధానిగా ప్రపంచ దేశాల్లో ఎందుకు ముద్ర పడ్డారు? మొదటి నుంచి పాటించిన ఉన్నత విలువలకు అధికారం రాగానే తిలోదకాలు ఇచ్చారు కాబట్టి.. మాట తప్పి.. ప్రధాని పదవిని నిలుపుకోవడానికి అమెరికా బూచి చూపి పాక్ ప్రజలను బురిడీ కొట్టించాలని చూశారు కాబట్టి.. క్రికెట్ నుంచి రాజకీయాల వరకు ఇమ్రాన్ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమే అయినప్పటికీ అబద్ధమాడి ప్రజాదరణను కోల్పోయారు! క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్‌తో దూకుడు చూపించి పాకిస్తాన్‌కు వరల్డ్‌కప్ అందించిన సమర్థుడైన కెప్టెన్‌గా పేరుప్రతిష్టలు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్ పొలిటికల్ పిచ్‌పై అవమాన భారంతో పెవిలియన్ ముఖం పట్టారు. దుందుడుకు స్వభావం, ఆవేశాన్ని అణచుకోలేని తత్వం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఆయన రాజకీయ జీవితానికి ఎదురు దెబ్బలా మారాయి. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో 1952 సంవత్సరం అక్టోబర్ 5న ఇమ్రాన్‌ఖాన్ జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ చేశారు. క్రికెట్‌పై మక్కువతో దానిపైనే దృష్టి పెట్టారు. 1976లో జాతీయ స్థాయిలో పాక్ క్రికెట్ జట్టులో స్థానం పొందారు. ఎదురులేని ఆల్‌రౌండర్‌గా ఎదుగుతూనే , తనకున్న అందమైన రూపంతో ఒక ప్లేబాయ్ ఇమేజ్ సంపాదించారు. అత్యంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ లేడీ లిజా కేంబెల్, సుసన్నా కాన్ స్టాంటైన్ వంటి మోడల్స్‌తో ప్రేమాయణం నడిపారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ తన వ్యక్తిగత జీవితాన్ని దాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్ స్మిత్‌ను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. 2004లో విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్ రెహామ్ ఖాన్‌ను రెండోసారి పెళ్లి చేసుకున్నారు. పది నెలల్లోనే వారి బంధం ముగిసింది. ముచ్చటగా మూడోసారి తన ఆధ్యాత్మిక గురు బష్రా మనేకను పాకిస్తాన్ ప్రధాని పదవి అందుకోవడానికి కొన్ని నెలల ముందే పెళ్లాడారు రెండు సీట్ల నుంచి ప్రధాని పదవి వరకు 1992లో పాక్‌కు ప్రపంచ కప్ అందించాక క్రికెట్‌కు గుడ్‌బై కొట్టిన ఇమ్రాన్‌ఖాన్ ప్రజాసేవ వైపు మళ్లారు. 1996లో అందరికీ న్యాయం అన్న నినాదంతో పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అన్న పార్టీని స్థాపించారు.మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పీటీఐ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అవినీతికి వ్యతిరేకంగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్‌ఖాన్ 2011 వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకున్నారు. దేశంలో అవినీతి నేతలకు వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్వేగభరితంగా చేసే ప్రసంగాలు వినడానికి జనం వెల్లువెత్తారు. ప్రధాన పార్టీలైన నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), బేనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)ని ఢీ కొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2013 నాటికల్లా పీటీఐ 35 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్ షరీఫ్ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి, చివరికి ఆయనని జైలు పాలు చేశారు. 2018 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని పీఠం అందుకున్నారు. ప్రధానిగా ఎలా విఫలమయ్యారు ? నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తానన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ గత మూడున్నరేళ్లలో కఠినమైన సవాళ్లే ఎదుర్కొన్నారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడంలో విఫలమయ్యారు. ఆర్థిక వృద్ధి రేటు 3.5శాతానికి మించలేదు. ద్రవ్యోల్బణం 12 శాతానికి పరుగులు పెట్టింది. కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చలేక చేతులెత్తేశారు. దీంతో సాధారణ ప్రజల్లో ఇమ్రాన్‌పై వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రభుత్వం కంటే ఆర్మీ శక్తిమంతంగా ఉండే పాకిస్తాన్లో ఇమ్రాన్‌ఖాన్‌కి, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో విభేదాలు ఏర్పడడంతో ఆయన పదవికి గండం ఏర్పడింది. ఐఎస్ఐ చీఫ్ జనరల్‌గా నదీమ్ అహ్మద్ అంజుమ్ నియామకం అంశంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో విపక్ష పార్టీలు ఇదే అదునుగా ఏకమై ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేశాయి. మళ్లీ పాక్‌లో సైనిక పాలన వస్తుందని భావించారు కానీ ఈసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకే ఆర్మీ మొగ్గు చూపించినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పటివరకు పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో లేరు. అయితే సైనిక తిరుగుబాటు లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వాలు పతనమయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌కి ఇప్పుడు అదే అనుభవం ఎదురైంది. పశ్చిమదేశాలపై ఎందుకీ ఆరోపణలు అమెరికా కుట్ర చేసి తన ప్రభుత్వాన్ని కూల్చేస్తోందంటూ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలు పెను సంచలనంగా మారి చర్చకు దారి తీశాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24నే ఇమ్రాన్ రష్యా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోవడం రాజకీయంగా కలకలం రేపింది. తాను రష్యా వెళ్లినందుకే అమెరికా కక్ష కట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలే ఇప్పుడు ఆయన పదవికి ఎసరు తెచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో విపక్షాలపై వ్యతిరేకత ఏర్పడడానికే ఇమ్రాన్‌ఖాన్ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువే పోతుందని భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం ఫలితంతో సంబంధం లేకుండా పాకిస్తాన్లో గడువు కంటే ముందే ఎన్నికలు వస్తాయని అంచనాలు ఉండడంతో.. అతివాద భావజాలం ప్రబలుతున్న పాక్‌లో అమెరికా ఎదురించిన రియల్ హీరో ఇమేజ్ను సంపాదించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలనేది ఇమ్రాన్‌ఖాన్ ఆలోచనగా ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. – నేషనల్ డెస్క్ సాక్షి -
ఎన్నికల్లో బీజేపీని ఓడించండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పంచాయత్‌లలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల వెన్ను విరుస్తోందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటాన్ని అణచి వేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ‘‘బీజేపీకి ఓటు వేయొద్దు. ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే మీ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతారు. మిమ్మల్ని భూమిలేని పేదలుగా మార్చేస్తారు. దేశాన్ని బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడతారు. మీరు ఉపాధి కోల్పోతారు’’ అని ప్రజలను అప్రమత్తం చేశారు. బీజేపీ మోసాలకు మారుపేరని దుయ్యబట్టారు. ఆ పార్టీ సంపన్నుల పక్షపాతి అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారి పక్షాన తాము ఉంటామన్నారు. బీజేపీని వ్యతిరేకించేవారు రైతులు, పేదల పక్షాన ఉంటారని రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. కిసాన్ మహాపంచాయత్‌లలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తయిన ఇంట్లో సేదతీరుతున్న రైతులు -
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం
హాలియా : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం హాలియాలో జరిగిన సీపీఎం నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో కొంత మేరకే అవినీతి నకిలీ కరెన్సీ తగ్గుతుందని, ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో చిల్లర దొరకక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ వదులుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిం దని దీంతో దేశంలో 75 మంది ప్రాణాలు కో ల్పోయారని అన్నారు. సమావేశంలో జిల్లా కమి టీ సభ్యులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కత్తి లింగారెడ్డి, అవుతా సైదయ్య, మండల కార్యదర్శులు కొండేటి శ్రీను, దైద శ్రీను, దుబ్బ రాంచంద్రయ్య, కత్తి శ్రీనివాసరెడ్డి, కామేశ్వర్, కోమండ్ల గురువయ్య, శంకర్‌నాయక్, వెంకన్న, నరేష్, మల్లయ్య, నాగేందర్, సారమ్మ, చాంద్‌పాష, నామ సత్యనారాయణ, లింగమ్మ, శ్రీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఆగడాలను ప్రతిఘటిస్తాం
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ప్రజల పక్షాన నిలుస్తాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ యలమంచిలి : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు సాగిస్తున్న ఆగడాలు, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. ఇందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం యలమంచిలిలో విలేకరుల సమావేశంలో అధికారి పార్టీ వారి ప్రజావ్యతిరేక విధానాలపై అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆచరణసాధ్యం కాని వాగ్ధానాలు చేసి చంద్రబాబునాయుడు అధికారం దక్కించుకున్నారన్నారు. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు గడిచినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చంద్రబాబునాయుడుపై మం డిపడ్డారు. 2004లో దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెం టనే ఫైళ్లపై సంతకాలు చేసిన మరుక్షణం సంక్షేమ పథకాల అమలులోకి వచ్చాయన్నారు. కాని చంద్రబాబు ఫైళ్లపై సంతకాలు పెట్టి నెలలు గడుస్తున్నా ఒక్కటీ అమలు కాకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. మాట నిలబెట్టుకునే అలవాటు చంద్రబాబుకు లేదన్నారు. ప్రజలిచ్చిన తీర్పును శిరసావహించి ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పారు. ఎన్నికలప్పుడు టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఒత్తిడి తీసుకొస్తామని చెప్పా రు. డ్వాక్రా రుణాల మాఫీ, రైతు రుణమాఫీ, కొత్త రుణాల మంజూరుకు సంబంధించి షరతులతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగభృతి, ఇంటికో ఉద్యోగం ఎక్కడని ప్రశ్నించారు. విభజన అనంతరం రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నంపై ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోందన్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాధాకరంగా ఉందని, గ్రూపు రాజకీయాలతో మంత్రులు జిల్లా అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఆధార్ లింకేజీని వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలకు ఆధార్‌ను జోడిస్తూ సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకు చూడటం దురదృష్టకరమన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు తనిఖీల పేరుతో పక్షపాతం చూపితే చూస్తూ ఊరుకోవబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో యలమంచిలి వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ సమన్వయ కర్త ప్రగడ నాగేశ్వరరావు, యలమంచిలి జెడ్పీటీసీ మట్టా రాజవేణి, వైఎస్సార్ సీపీ నేతలు బోదెపు గోవిందు, బొద్దపు ఎర్రయ్యదొర, ఆడారి శ్రీధర్ (చిన్నా), చంటిరాజు, బెజవాడ నాగేశ్వరరావు, బొద్దపు లక్ష్మి, జాగారపు కొండబాబు, రాంబిల్లి నేత శ్రీనుబాబు పాల్గొ న్నారు. 28న పార్టీ విస్తత స్థాయి సమావేశం యలమంచిలిలో రూరల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 28న నిర్వహించనున్నట్టు అమర్నాథ్ చెప్పారు. స్థానిక నాయకులతో సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. యలమంచిలి గుర్రప్ప కల్యాణమండపంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ముఖ్యనేతలు, నాయకులు హాజరుకానున్నట్టు తెలియజేశారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఫలితాలు, ప్రజల తీర్పు, వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితరుల అంశాలపై ముఖ్యనాయకుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతామన్నారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తునామన్నారు. పార్టీకోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు గుర్తింపునిస్తామన్నారు. మండల కమిటీలు ఏర్పాటుతో పాటు జిల్లా పార్టీ కార్యవర్గంలో పార్టీ పదవులిచ్చి కేడర్‌లో నూతనోత్తేజాన్ని నింపి అంతా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తామన్నారు.