- ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం
- ప్రజల పక్షాన నిలుస్తాం
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
యలమంచిలి : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు సాగిస్తున్న ఆగడాలు, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. ఇందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం యలమంచిలిలో విలేకరుల సమావేశంలో అధికారి పార్టీ వారి ప్రజావ్యతిరేక విధానాలపై అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆచరణసాధ్యం కాని వాగ్ధానాలు చేసి చంద్రబాబునాయుడు అధికారం దక్కించుకున్నారన్నారు.
ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు గడిచినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చంద్రబాబునాయుడుపై మం డిపడ్డారు. 2004లో దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెం టనే ఫైళ్లపై సంతకాలు చేసిన మరుక్షణం సంక్షేమ పథకాల అమలులోకి వచ్చాయన్నారు. కాని చంద్రబాబు ఫైళ్లపై సంతకాలు పెట్టి నెలలు గడుస్తున్నా ఒక్కటీ అమలు కాకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు.
మాట నిలబెట్టుకునే అలవాటు చంద్రబాబుకు లేదన్నారు. ప్రజలిచ్చిన తీర్పును శిరసావహించి ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పారు. ఎన్నికలప్పుడు టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఒత్తిడి తీసుకొస్తామని చెప్పా రు. డ్వాక్రా రుణాల మాఫీ, రైతు రుణమాఫీ, కొత్త రుణాల మంజూరుకు సంబంధించి షరతులతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగభృతి, ఇంటికో ఉద్యోగం ఎక్కడని ప్రశ్నించారు.
విభజన అనంతరం రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నంపై ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోందన్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాధాకరంగా ఉందని, గ్రూపు రాజకీయాలతో మంత్రులు జిల్లా అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఆధార్ లింకేజీని వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలకు ఆధార్‌ను జోడిస్తూ సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకు చూడటం దురదృష్టకరమన్నారు.
పింఛన్లు, రేషన్ కార్డులు తనిఖీల పేరుతో పక్షపాతం చూపితే చూస్తూ ఊరుకోవబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో యలమంచిలి వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ సమన్వయ కర్త ప్రగడ నాగేశ్వరరావు, యలమంచిలి జెడ్పీటీసీ మట్టా రాజవేణి, వైఎస్సార్ సీపీ నేతలు బోదెపు గోవిందు, బొద్దపు ఎర్రయ్యదొర, ఆడారి శ్రీధర్ (చిన్నా), చంటిరాజు, బెజవాడ నాగేశ్వరరావు, బొద్దపు లక్ష్మి, జాగారపు కొండబాబు, రాంబిల్లి నేత శ్రీనుబాబు పాల్గొ న్నారు.
28న పార్టీ విస్తత స్థాయి సమావేశం
యలమంచిలిలో రూరల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 28న నిర్వహించనున్నట్టు అమర్‌నాథ్ చెప్పారు. స్థానిక నాయకులతో సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. యలమంచిలి గుర్రప్ప కల్యాణమండపంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ముఖ్యనేతలు, నాయకులు హాజరుకానున్నట్టు తెలియజేశారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో ఫలితాలు, ప్రజల తీర్పు, వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితరుల అంశాలపై ముఖ్యనాయకుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతామన్నారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తునామన్నారు. పార్టీకోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు గుర్తింపునిస్తామన్నారు. మండల కమిటీలు ఏర్పాటుతో పాటు జిల్లా పార్టీ కార్యవర్గంలో పార్టీ పదవులిచ్చి కేడర్‌లో నూతనోత్తేజాన్ని నింపి అంతా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తామన్నారు.