Cricket Captain
-
తొండి ఆటతో.. హిట్ వికెట్
నాయకుడంటే ఎలా ఉండాలి? మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకూడదు ప్రధాని పీఠం ఎక్కేవరకు తూటాల్లా పేలే మాటలతో, భావోద్వేగ ప్రసంగాలతో అవినీతి నాయకులపై సమరోత్సాహంతో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవి చేపట్టాక ఎందుకు ప్రజల ఆశలకి తగ్గట్టుగా ఉండలేకపోయారు? సమర్థుడైన క్రికెట్ కెప్టెన్‌గా పాక్‌కు ప్రపంచ కప్‌ను అందించిన ఇమ్రాన్ ఒక అసమర్థ ప్రధానిగా ప్రపంచ దేశాల్లో ఎందుకు ముద్ర పడ్డారు? మొదటి నుంచి పాటించిన ఉన్నత విలువలకు అధికారం రాగానే తిలోదకాలు ఇచ్చారు కాబట్టి.. మాట తప్పి.. ప్రధాని పదవిని నిలుపుకోవడానికి అమెరికా బూచి చూపి పాక్ ప్రజలను బురిడీ కొట్టించాలని చూశారు కాబట్టి.. క్రికెట్ నుంచి రాజకీయాల వరకు ఇమ్రాన్ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమే అయినప్పటికీ అబద్ధమాడి ప్రజాదరణను కోల్పోయారు! క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్‌తో దూకుడు చూపించి పాకిస్తాన్‌కు వరల్డ్‌కప్ అందించిన సమర్థుడైన కెప్టెన్‌గా పేరుప్రతిష్టలు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్ పొలిటికల్ పిచ్‌పై అవమాన భారంతో పెవిలియన్ ముఖం పట్టారు. దుందుడుకు స్వభావం, ఆవేశాన్ని అణచుకోలేని తత్వం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఆయన రాజకీయ జీవితానికి ఎదురు దెబ్బలా మారాయి. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో 1952 సంవత్సరం అక్టోబర్ 5న ఇమ్రాన్‌ఖాన్ జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ చేశారు. క్రికెట్‌పై మక్కువతో దానిపైనే దృష్టి పెట్టారు. 1976లో జాతీయ స్థాయిలో పాక్ క్రికెట్ జట్టులో స్థానం పొందారు. ఎదురులేని ఆల్‌రౌండర్‌గా ఎదుగుతూనే , తనకున్న అందమైన రూపంతో ఒక ప్లేబాయ్ ఇమేజ్ సంపాదించారు. అత్యంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ లేడీ లిజా కేంబెల్, సుసన్నా కాన్ స్టాంటైన్ వంటి మోడల్స్‌తో ప్రేమాయణం నడిపారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ తన వ్యక్తిగత జీవితాన్ని దాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్ స్మిత్‌ను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. 2004లో విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్ రెహామ్ ఖాన్‌ను రెండోసారి పెళ్లి చేసుకున్నారు. పది నెలల్లోనే వారి బంధం ముగిసింది. ముచ్చటగా మూడోసారి తన ఆధ్యాత్మిక గురు బష్రా మనేకను పాకిస్తాన్ ప్రధాని పదవి అందుకోవడానికి కొన్ని నెలల ముందే పెళ్లాడారు రెండు సీట్ల నుంచి ప్రధాని పదవి వరకు 1992లో పాక్‌కు ప్రపంచ కప్ అందించాక క్రికెట్‌కు గుడ్‌బై కొట్టిన ఇమ్రాన్‌ఖాన్ ప్రజాసేవ వైపు మళ్లారు. 1996లో అందరికీ న్యాయం అన్న నినాదంతో పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అన్న పార్టీని స్థాపించారు.మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పీటీఐ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అవినీతికి వ్యతిరేకంగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్‌ఖాన్ 2011 వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకున్నారు. దేశంలో అవినీతి నేతలకు వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్వేగభరితంగా చేసే ప్రసంగాలు వినడానికి జనం వెల్లువెత్తారు. ప్రధాన పార్టీలైన నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), బేనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)ని ఢీ కొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2013 నాటికల్లా పీటీఐ 35 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్ షరీఫ్ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి, చివరికి ఆయనని జైలు పాలు చేశారు. 2018 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని పీఠం అందుకున్నారు. ప్రధానిగా ఎలా విఫలమయ్యారు ? నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తానన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ గత మూడున్నరేళ్లలో కఠినమైన సవాళ్లే ఎదుర్కొన్నారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడంలో విఫలమయ్యారు. ఆర్థిక వృద్ధి రేటు 3.5శాతానికి మించలేదు. ద్రవ్యోల్బణం 12 శాతానికి పరుగులు పెట్టింది. కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చలేక చేతులెత్తేశారు. దీంతో సాధారణ ప్రజల్లో ఇమ్రాన్‌పై వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రభుత్వం కంటే ఆర్మీ శక్తిమంతంగా ఉండే పాకిస్తాన్లో ఇమ్రాన్‌ఖాన్‌కి, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో విభేదాలు ఏర్పడడంతో ఆయన పదవికి గండం ఏర్పడింది. ఐఎస్ఐ చీఫ్ జనరల్‌గా నదీమ్ అహ్మద్ అంజుమ్ నియామకం అంశంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో విపక్ష పార్టీలు ఇదే అదునుగా ఏకమై ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేశాయి. మళ్లీ పాక్‌లో సైనిక పాలన వస్తుందని భావించారు కానీ ఈసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకే ఆర్మీ మొగ్గు చూపించినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పటివరకు పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో లేరు. అయితే సైనిక తిరుగుబాటు లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వాలు పతనమయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌కి ఇప్పుడు అదే అనుభవం ఎదురైంది. పశ్చిమదేశాలపై ఎందుకీ ఆరోపణలు అమెరికా కుట్ర చేసి తన ప్రభుత్వాన్ని కూల్చేస్తోందంటూ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలు పెను సంచలనంగా మారి చర్చకు దారి తీశాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24నే ఇమ్రాన్ రష్యా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోవడం రాజకీయంగా కలకలం రేపింది. తాను రష్యా వెళ్లినందుకే అమెరికా కక్ష కట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలే ఇప్పుడు ఆయన పదవికి ఎసరు తెచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో విపక్షాలపై వ్యతిరేకత ఏర్పడడానికే ఇమ్రాన్‌ఖాన్ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువే పోతుందని భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం ఫలితంతో సంబంధం లేకుండా పాకిస్తాన్లో గడువు కంటే ముందే ఎన్నికలు వస్తాయని అంచనాలు ఉండడంతో.. అతివాద భావజాలం ప్రబలుతున్న పాక్‌లో అమెరికా ఎదురించిన రియల్ హీరో ఇమేజ్ను సంపాదించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలనేది ఇమ్రాన్‌ఖాన్ ఆలోచనగా ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. – నేషనల్ డెస్క్ సాక్షి -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ సారథి
లండన్: ఇంగ్లండ్ మూడు సార్లు యాషెస్ సిరీస్ గెలిచింది ఆతడి సారథ్యంలోనే.. టీ20 ప్రపంచకప్ ముద్దాడింది కూడా ఆయన కెప్టెన్సీలోనే. 22 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన ఇంగ్లండ్ మాజీ సారథి పాల్ కాలింగ్‌వుడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ ఆడని కాలింగ్ వుడ్.. వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందంటూ ప్రకటించాడు. 1996లోనే తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 2001లో వన్డే (పాకిస్తాన్‌పై), 2003లో టెస్టు(శ్రీలంకపై) అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరుపున 68 టెస్టులు, 197 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌తోనూ కాలింగ్ వుడ్‌కు అనుబంధం వుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఈ దిగ్గజ ఆటగాడి రిటైర్మెంట్పై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైకెల్ వాన్, ఇయాన్ బోథమ్‌లు ‘గొప్ప ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు’అంటూ ట్వీట్ చేశారు. 2011లో కాలింగ్ వుడ్‌పై వివాదం చిన్న తప్పు కాలింగ్ వుడ్ జీవితాన్నే మార్చేసింది. భారత్‌లో జరిగిన 2011 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఇంగ్లండ్ జట్టులో అతడు సాధారణ సభ్యుడు. అప్పటికే ఇంగ్లండ్ నాన్ స్టాప్ సిరీస్‌లు ఆడుతూ వచ్చింది. ఆ సందర్భంలో ‘ నాన్ స్టాప్‌గా క్రికెట్ ఆడుతున్నాము. ఇంటికి వెళ్లక చాలా రోజులయింది. నా కూతురయితే మ్యాచ్ ఓడిపోయి ఇంటికి త్వరగా వచ్చేయండి నాన్న’ అంటుందని కాలింగ్‌వుడ్ మీడియాతో పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఆటగాడిపై విమర్శల వర్షం కురిసింది. క్రికెట్ బోర్టు అతడిని ప్రపంచకప్ నుంచి అర్థంతరంగా తప్పించింది. అనంతరం అతనికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.. కౌంటీ క్రికెట్లో మాత్రమే ఆడాడు. -
భారత్ క్రికెట్‌కు గొప్ప సేవకుడు..
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ అజిత్ వాడేకర్ (77) బుధవారం కన్నుమూశారు. అజిత్ వాడేకర్ మృతి పట్ల రాష్ట్రపతితో పాటు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమైన వార్త అని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన గొప్ప ఆటగాళ్లలో వాడేకర్ ఒకరని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. క్రికెటర్, కెప్టెన్, కోచ్, మేనేజర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా సేవలందించిన వాడేకర్ చాలా అరుదైన వ్యక్తిగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. భారత క్రికెట్‌కు గొప్ప సేవకుడు వాడేకర్ సర్ అని కొనియాడాడు. ‘ఓం శాంతి అజిత్ వాడేకర్ సర్’ అంటూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. భారత్‌కు చారిత్రక విజయాలు అందించిన మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ఇక లేరన్న వార్త తనను ఎంతగానో కలచి వేసిందంటూ సురేశ్ రైనా పేర్కొన్నాడు. ఆయన కుటుంబ సభ్యులకు రైనా సంతాపం తెలియజేశారు. అజిత్ వాడేకర్ కన్నుమూత -
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మృతి
అక్లాండ్: న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1965లో క్రికెట్లో అరంగేట్రం చేసిన బెవాన్ తన 13 ఏళ్ల కెరీర్లో మొత్తం 61 టెస్టులు ఆడారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని ఇష్టపడే బెవాన్ 32.22 సగటుతో 3,448 పరుగులు చేశారు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. 17 టెస్టులకు సారథ్య బాధ్యతలు వహించిన బెవాన్ ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఆడిన తొలి అంతర్జాతీయ వన్డేకు బెవాన్ నాయకత్వం వహించారు.11 వన్డేల్లో 56.33 సగటుతో ఐదు అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ నమోదు చేశారు. న్యూజిలాండ్ తరపున పది ఇన్నింగ్స్‌లలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ సగటు కావడం విశేషం. బెవాన్ మృతితో న్యూజిలాండ్ అభిమానులు, ఆటగాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. -
కోహ్లి ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తోంది
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆస్ట్రేలియా మీడియాపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ధ్వజమెత్తారు. కోహ్లి గురించి చెత్త రాతలు రాస్తోందని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోహ్లికి సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కోహ్లిని పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఆసీస్ జర్నలిస్టులు అతడి ఇమేజ్‌ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, దీన్ని కోహ్లి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చారు. ‘ట్రంప్‌తో కోహ్లిని పోల్చడం చాలా చెత్తగా ఉంది. కోహ్లి అంటే నాకే కాదు ఆసీస్ దేశస్తులకు కూడా చాలా ఇష్టం. సవాళ్లను స్వీకరించే అతడి తత్వం ఆదర్శనీయం. ఇద్దరు ముగ్గురు ఆసీస్ జర్నలిస్టులు అతడి గౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. వారి గురించి తను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఆసీస్ మీడియా చెబుతున్న విషయాలను స్మిత్ కూడా పట్టించుకోవడం లేదు. ధర్మశాలలో జరిగే చివరి టెస్టుపై దృష్టి సారించి సిరీస్ దక్కించుకోవాలనే ఇరు జట్ల కెప్టెన్లు తమ ఆటగాళ్లకు చెబుతున్నారు’ అని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో క్లార్క్ వివరించారు. విరాట్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని, క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ అతడి నుంచి అభిమానులు సెంచరీలు ఆశిస్తారని తెలిపారు. అయితే అతడి తాజా ఫామ్ లేమి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధర్మశాలలో భారీ స్కోరు చేసి సిరీస్ గెలిపించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఇరు జట్ల బౌలర్లు తీవ్రంగా అలసిపోయారని, దీంతో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుని వారికి తగిన విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, పరిపాలన కమిటీ చీఫ్ వినోద్ రాయ్‌లకు క్లార్క్ అందజేశారు. -
కోహ్లిని తొందరగా
అవుట్ చేస్తేనే... మెల్బోర్న్: భారత్‌లో ఆస్ట్రే లియా జట్టు విజయావకాశా లను పెంచుకోవాలంటే స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లిని త్వరగా పెవిలియన్‌కు పంపడంపై దృష్టి పెట్టాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించారు. కోహ్లిని రెచ్చగొట్టినట్టయితే మరింత దూకుడు పెంచుతాడని, ఇది కొన్నిసార్లు అతడికే కాకుండా ప్రత్యర్థికి కూడా లాభమేనని అన్నారు. వన్డేల్లో కోహ్లి బెస్ట్ బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చిన పాంటింగ్... టెస్టుల్లో కోహ్లి నిరూపించుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. భారీ స్కోరుకు కష్టపడాల్సిందే: లీమన్ భారత పిచ్‌లపై తమ జట్టు భారీ స్కోరు చేయడం గట్టి సవాల్‌తో కూడుకుందని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరి మాథ్యూ హేడెన్, డామియన్ మార్టిన్లా ఎవరో ఒకరు నిలదొక్కుకుని ఈ సమస్య తీరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 23 నుంచి ఆసీస్ తమ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆరంభించనుంది. -
మాజీ టెస్టు కెప్టెన్లకు సన్మానం
కాన్పూర్: భారత జట్టు 500వ టెస్టు ఆడుతున్న సందర్భంగా బీసీసీఐ తమ మాజీ కెప్టెన్లను సత్కరించింది. అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, కె.శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, మొహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ గౌరవం పొందిన వారిలో ఉన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ వీరికి మెమొంటోలు, శాలువాతో సన్మానం చేశారు. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఇందులో పాల్గొన్నారు. బుధవారం రాత్రి జరిగిన డిన్నర్లో మాజీ కెప్టెన్లతో పాటు భారత జట్టు కూడా పాల్గొంది. అరుుతే 22 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన బిషన్ సింగ్ బేడిని, రెండు టెస్టులకు సారథిగా ఉన్న గుండప్ప విశ్వనాథ్‌లను మా త్రం ఈ సన్మానానికి బీసీసీఐ ఆహ్వానించలేదు. ఇది బీసీసీఐ ఈవెంట్ అని, ఎవరిని పిలుచుకోవాలో వారిష్టమని ఈ దిగ్గజాలు తేలిగ్గా తీసుకున్నారు. -
మాజీ క్రికెట్ కెప్టెన్లకు సన్మానం
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌ను పురస్కరించుకుని మాజీ కెప్టెన్లను సన్మానించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో భారత జట్టుకు సేవలందించిన మాజీ టెస్టు కెప్టెన్లను సత్కరించారు. ఈ సన్మానం అందుకున్న భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్లలో అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగసర్కార్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిశాస్త్రి, మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోనిలు ఉన్నారు. గురువారం న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆరంభమయ్యే తొలి టెస్టుకు ముందు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్టు హోదా సంపాదించిన ఆరో జట్టుగా గుర్తింపు పొందిన భారత్.. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టును ఆడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ భారత టెస్టు జట్టుకు 32 మంది కెప్టెన్లగా వ్యవహరించారు. భారత టెస్టు కెప్టెన్లలో సీకే నాయుడు మొదలుకొని, విరాట్ కోహ్లి వరకూ భారత టెస్టు జట్టుకు సారథులుగా చేశారు. ఇప్పటివరకూ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ 976 టెస్టు మ్యాచ్‌లతో తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 791 టెస్టు మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత 500 టెస్టు మ్యాచ్‌ల మార్కును అందుకున్న జట్లలో వెస్టిండీస్(517), భారత్ లు ఉన్నాయి. -
అనవసరంగా హాకీ ఆడానేమో..
మాజీ కెప్టెన్ రీతూ రాణి ఆవేదన న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో తలపడే భారత మహిళల హాకీ జట్టు నుంచి తనను తొలగించడంపై మాజీ కెప్టెన్ రితూ రాణి హాకీ ఇండియాపై ధ్వజమెత్తింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చింది. ‘ఫామ్ కోల్పోవడంతో పాటు అధికారులపై ధిక్కార ధోరణితో వ్యవహరించినట్లు నాపై వచ్చిన కథనాలతో షాక్‌కు గురయ్యాను. అవన్నీ నిరాధార ఆరోపణలు. ఇప్పటిదాకా నన్ను ఎందుకు తీసేశారో వివరణ ఇవ్వలేదు. నేను ఏ శిబిరం నుంచి వెళ్లిపోలేదు. శిబిరం విరామ సమయంలోనే నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. సర్దార్ సింగ్‌పై కూడా ఆరోపణలున్నాయి. కానీ అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి జట్టులో మాత్రం ఉంచారు. మరి నా విషయంలో హాకీ ఇండియాకు ఎందుకు ఈ వివక్ష?. ఇన్నాళ్లు హాకీని అనవసరంగా ఆడానని అనిపిస్తోంది’ అంటూ రీతూ కంటతడి పెట్టింది. -
పరుగెత్తకపోతే... ఆటెందుకు!
బీబీఎల్‌లో గేల్‌పై విమర్శల వర్షం సిడ్నీ: మహిళా కామెంటేటర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌పై మరో దుమారం చెలరేగింది. బిగ్ బాష్ లీగ్‌లో అతని ఆటతీరుపై మాజీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం రాత్రి సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సహచరుడు టామ్ కూపర్ ఓ సింగిల్ కోసం గేల్‌ను పిలిచాడు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సులువుగా పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ విండీస్ బ్యాట్స్‌మన్ పరుగు తీసేందుకు నిరాకరించాడు. అంతే కామెంట్రీలో ఉన్న మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్... గేల్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఏ జట్టైనా గెలవడాని, ఓడటానికి కావాల్సింది ఒక్క పరుగేనంటూ ధ్వజమెత్తారు. ‘గేల్ ప్రవర్తనను నమ్మలేకపోతున్నాం. అతని తీరు చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి తీరును క్రికెట్లో ఎప్పుడూ చూడలేదు’ అంటూ రికీ విమర్శించాడు. ఇదంతా ఓవైపు జరుగుతుంటే మైదానంలో తర్వాతి బంతికే గేల్... ఫవాద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అంతే పాంటింగ్ తన మాటలకు మరింత పదును పెంచాడు. మ్యాచ్ తర్వాత కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు గేల్ నిరాకరించడంతో మాజీలు మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గేల్ జట్టు మెల్బోర్న్ రెనెగడెస్ ఐదు వికెట్ల తేడాతో గెలవడం విశేషం. -
కేజ్రీవాల్‌కు బీసీసీఐ షాక్
క్రికెటర్ల సన్మానానికి అనుమతివ్వని బోర్డు న్యూఢిల్లీ: రెండుసార్లు భారత్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన జట్లలోని తమ రాష్ట్ర ఆటగాళ్లకు సన్మానం చేయాలనుకున్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలకు బీసీసీఐ అడ్డు తగిలింది. దీంతో ఈ కార్యక్రమం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 1983, 2011 టోర్నీల్లో ఆడిన ఢిల్లీ క్రికెటర్లు అమర్నాథ్, మదన్ లాల్, సెహ్వాగ్, గంభీర్, కోహ్లిలతోపాటు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడిని దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టులో సన్మానిస్తామని ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డీడీసీఏకు తెలిపారు. దీనికి మూడో రోజు లంచ్ విరామాన్ని వినియోగించుకోవాలని భావించారు. అయితే ఇలా ఆట మధ్యలో కార్యక్రమాలు నిర్వహించడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయం తెలియని బేడీ మైదానానికి వచ్చి... ఆ తర్వాత వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై మాజీ ఆటగాళ్లు బీసీసీఐని విమర్శించారు. కే జ్రీవాల్ ఒత్తిడి తెచ్చారు: జస్టిస్ ముద్గల్ ఆటగాళ్లకు సన్మానం చేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఒత్తిడి చేశారని... ఈ మ్యాచ్ కోసం హైకోర్టు నియమించిన పరి శీలకులు జస్టిస్ ముకుల్ ముద్గల్ తెలిపారు. అయితే బీసీసీఐ సూచనల మేరకు తాను ఇందుకు అంగీకరించలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ ప్రభుత్వ కౌన్సిల్ రాహుల్ మెహ్రా, తన కు మధ్య జరిగిన సందేశాల వివరాలను ఆయన వెల్లడించారు. మరోవైపు స్టేడియంలో పాఠశాల విద్యార్థులు కూర్చున్న స్టాండ్స్ దగ్గరకు వెళ్లి ఢిల్లీ సీఎం మాట్లాడతారని మెహ్రా డిమాండ్ చేశారు. అయితే భద్రతాపరంగా ఇబ్బంది ఎదురవుతుందని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సన్మానానికి దూరంగా ఉండు’ ఒకవేళ ఢిల్లీ స్టేట్ తమ ఆటగాళ్లకు సన్మానం చేస్తే దానికి దూరంగా ఉండాలని స్థానిక క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి బీసీసీఐ సూచించింది. ‘కోహ్లి బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాడు. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో మూడో పార్టీ నిర్వహించే కార్యక్రమానికి భారత కెప్టెన్‌ను అనుమతించలేము’ అని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. అలాగే ఈ సిరీస్‌లోనే రెండో టెస్టు దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్‌కు వందో మ్యాచ్ కావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడికి సన్మానం చేద్దామని భావించింది. అయితే దీనికి కూడా బీసీసీఐ అంగీకరించలేదు. -
బీసీసీఐ మేల్కోవాలి
* జూనియర్ క్రికెట్‌కు బ్లూప్రింట్ అవసరం * పటౌడీ స్మారకోపన్యాసంలో ద్రవిడ్ న్యూఢిల్లీ: భారత క్రికెట్ భవిష్యత్తు కోసం జూనియర్ స్థాయిలో ఆటను అభివృద్ధి చేసేందుకు బీసీసీఐ చొరవ చూపించాలని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయ పడ్డారు. వివిధ వయో విభాగాల కోసం ప్రత్యేక బ్లూప్రింట్‌ను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. మంగళవారం ఇక్కడ ‘మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసం’లో ప్రసంగిస్తూ ద్రవిడ్ పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రధానంగా జూనియర్ స్థాయి క్రికెట్లోని కొన్ని లోపాలపై బోర్డును హెచ్చరించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ అకాడమీలు భారీ ఫీజులు తీసుకుంటూ సరైన శిక్షణ ఇవ్వడం లేదని, ఒక ప్రత్యేక పాలసీ రూపొందిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు. క్రికెట్ కోచింగ్ ఇప్పుడు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని... ప్రతి ఏటా దాదాపు రూ. 30 కోట్ల వరకు తీసుకునే రాష్ట్ర క్రికెట్ సంఘాలు కొంత మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత క్రికెట్ కోచింగ్‌కు కేటాయిస్తే పేదవారికి కూడా న్యాయం జరుగుతుందని ద్రవిడ్ వ్యాఖ్యానించారు. స్కూల్ స్థాయి క్రికెట్ మ్యాచ్‌లలో ఫుట్‌బాల్ తరహాలో సబ్స్టిట్యూషన్, రొటేషన్ పద్ధతి పెట్టి అందరు ఆటగాళ్లకు అవకాశం ఇస్తే ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని గుర్తు చేశారు. అండర్-14 స్థాయిలో రాణించకపోతే తమ పిల్లాడి ప్రపంచం ముగిసిపోయినట్లు తల్లిదండ్రులు భావించరాదని ఆయన చెప్పారు. ఒక వేళ ఆటలో ముందుకు వెళ్లకపోయినా తిరిగి తమ చదువులో కొనసాగే ధైర్యం వారికివ్వాలన్నారు. సచిన్ టెండూల్కర్‌ది ప్రత్యేకమైన ఘనత అని, అతడితో పోల్చి ఒత్తిడి పెంచవద్దని ద్రవిడ్ కోరాడు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయసు తక్కువగా చూపించడం కూడా ఫిక్సింగ్‌లాంటి జాడ్యమే అని...కఠిన నిబంధనలతో బోర్డు దీనికి అడ్డుకట్ట వేయాలని ద్రవిడ్ సూచించారు. ఈ సందర్భంగా పటౌడీతో తనకు ఉన్న అనుబంధాన్ని ద్రవిడ్ గుర్తు చేసుకున్నారు. -
టి20 ప్రపంచకప్ భారత్ గెలుస్తుంది
క్రిష్ శ్రీకాంత్ ఆశాభావం హైదరాబాద్: వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌ను గెలిచే సత్తా భారత జట్టుకు ఉందని మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయ పడ్డారు. ‘టి20ల్లో భారత్ ప్రదర్శన ఎప్పుడైనా బాగానే ఉంది. ఈ సారి కూడా టీమ్ మరింత మెరు గ్గా ఆడుతుందని నాకు నమ్మకముంది. 2016లో స్వదేశంలో జరిగే ప్రపంచకప్ గెలుస్తుంది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. వర్షం అడ్డు పడకపోతే భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టులోనూ మొహాలి ఫలితం పునరావృతం అయ్యేదని ఆయన అన్నారు. ‘ఏకపక్షంగా తొలి టెస్టు గెలవడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం పెరిగింది. కనీసం మూడు రోజులు ఆట జరిగినా మ్యాచ్ మన సొంతమయ్యేది. కోహ్లి సేనను నిలువరించే సత్తా దక్షిణాఫ్రికా జట్టులో కనిపించడం లేదు. నిలకడగా ఆడుతున్న యువ ఆటగాళ్లతో ఇప్పుడు భారత జట్టు సరైన దిశలోనే పయనిస్తోంది’ అని శ్రీకాంత్ విశ్లేషించారు. -
అజహర్‌తో ఎందుకు మాట్లాడారు?
డీడీసీఏకు బీసీసీఐ లేఖ న్యూఢిల్లీ: బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌తో విదర్భ రంజీ ఆటగాళ్లు సంభాషించడం వివాదాస్పదమైంది. 2000లో వెలుగు చూసిన మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా అజ్జూపై బీసీసీఐ వేటు వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ ఆహ్వానం మేరకు అజహర్ మైదానానికి వచ్చారు. అయితే విదర్భకు ఆడుతున్న వెటరన్ క్రికెటర్లు వసీం జాఫర్, ఎస్.బద్రీనాథ్, చీఫ్ కోచ్ పారస్ మాంబ్రే.. అజహర్‌తో మాట్లాడుతూ కనిపించారు. అవినీతి వ్యతిరేక యూనిట్ నిబంధనల ప్రకారం నిషేధిత ఆటగాళ్లతో ప్రస్తుత క్రికెటర్లు ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ‘బీసీసీఐ నుంచి మాకు లేఖ అందిన విషయం వాస్తవమే. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల అధికారిక స్థలం (పీఎంఓఏ)లో అజహర్‌తో వారు ఎలా మా ట్లాడారని ప్రశ్నించారు. అయితే అజహర్ పీఎంఓఏ దగ్గర లేరు. ఈవిషయంలో కాస్త గందరగోళం నెల కొంది. ఏది ఏమైనా అజ్జూతో ఆటగాళ్లు మాట్లాడకూడదని చెప్పారు కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం’ అని చౌహాన్ తెలిపారు. -
దేశంకంటే క్రికెట్ ఎక్కువేమీ కాదు!
- భారత్, పాక్ సిరీస్‌పై గంగూలీ - రవిశాస్త్రి సమర్థంగా పని చేస్తున్నారు - కుర్రాళ్లు రాటుదేలారన్న మాజీ కెప్టెన్ న్యూఢిల్లీ: ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతుండగా... మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అతను మద్దతు పలికాడు. ‘భారత్, పాక్ సిరీస్ జరగాలని, ఎక్కువ వినోదం దక్కుతుందని చాలా మంది ఆశించడం సహజమే. అయితే సరిహద్దులో భయాందోళనతో జీవిస్తున్న మన ప్రజల మనోభావాలు ఎంతో ముఖ్యం. ఆట జరిగే ముందు తీవ్రవాదం పూర్తిగా ఆగిపోవాలని బీసీసీఐ చెప్పడం సరైన నిర్ణయం. సాధారణ ప్రజలు కోరుకునేది కూడా అదే. క్రికెట్ కంటే దేశం ముఖ్యం’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ కోర్టు తీర్పుతో బీసీసీఐ సంతృప్తి చెందితే శ్రీశాంత్ తిరిగి రావడం సమస్య కాదని, ఈ విషయంలో తన వివరణ ఇచ్చుకునేందుకు ఆటగాడికి బోర్డు అవకాశం ఇస్తుందని భావిస్తున్నానన్నాడు. లోధా కమిటీ తీర్పుపై ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న గంగూలీ, తాము శిక్షలు ఖరారు చేయమని, ఐపీఎల్‌ను బాగా నిర్వహించేందుకు కావాల్సిన సూచనలు మాత్రమే ఇస్తామని వెల్లడించాడు. అయితే గతంలో స్పాన్సర్లు, ప్రసారకర్తలతో చేసుకున్న ఒప్పందాల మేరకు కనీసం ఎనిమిది జట్లతోనే లీగ్ జరుగుతుందని గంగూలీ చెప్పాడు. కోచ్‌కు డెరైక్టర్‌కు తేడా లేదు! శ్రీలంక పర్యటన ముగిసేవరకు టీమిండియాకు రవిశాస్త్రినే డెరైక్టర్‌గా కొనసాగుతారని బీసీసీఐ సలహా కమిటీ సభ్యుడైన గంగూలీ స్పష్టం చేశాడు. మరీ అవసరమనిపిస్తే ఆ తర్వాత కొత్త కోచ్ ఎంపికపై ఆలోచిస్తామన్నాడు. ‘రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా బాగా పని చేస్తున్నారు. నా దృష్టిలో కోచ్‌కు, డెరైక్టర్‌గా తేడా ఏమీ లేదు. పైగా ఆయనకు అండగా సమర్థులైన సహాయక సిబ్బంది ఉన్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇదే బృందాన్ని కొనసాగించడంలో తప్పేముంది’ అని ఈ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టులోని యువ ఆటగాళ్లను రాటుదేల్చిందని, ఆ అనుభవం శ్రీలంకలో ఉపయోగపడుతుందని సౌరవ్ అన్నాడు. లంక పటిష్టమైన ప్రత్యర్థే అయినా భారత్‌కు మంచి విజయావకాశాలు ఉన్నాయన్నాడు. ప్రధాన ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న జింబాబ్వే పర్యటన ఫలితం గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. రహానే తదితరులు దానిని మరచి రాబోయే లంక సిరీస్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. గెలిస్తే అంతా బాగుంటుంది! టెస్టు, వన్డే జట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించడం గతంలో అనేక జట్లు చేశాయని, భారత్‌కు మాత్రం ఇది కొత్త అని ఈ మాజీ కెప్టెన్ అన్నాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ వల్లే ఇది జరిగిందని అతను గుర్తు చేశాడు. ‘టీమ్ గెలిస్తే ఈ ప్రయోగం పని చేసినట్లు, ఓడితే విఫలమైనట్లు’ అని గంగూలీ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు. -
క్లైవ్ రైస్ కన్నుమూత
నిషేధం తొలగిన తర్వాత దక్షిణాఫ్రికాకు తొలి కెప్టెన్ కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు వచ్చి బెంగళూరులో రొబోటిక్ రేడియేషన్ చికిత్స కూడా చేయించుకున్నారు. కెరీర్లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికా జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించడంతో దాదాపు 20 ఏళ్ల పాటు రైస్ కెరీర్ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైంది. 1991లో దక్షిణాఫ్రికాపై నిషేధం ఎత్తివేసిన తర్వాత భారత్‌తో జరిగిన తొలి వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా రైస్ ప్రపంచ క్రికెట్‌కు చిరపరిచితుడు. 42 ఏళ్ల వయసులో ఆ సిరీస్‌లో ఆడిన మూడు వన్డేల అనంతరం ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేకపోవడంతో రైస్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఠ 1971-1991 మధ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచంలోని మేటి ఆల్‌రౌండర్లతో సమానంగా రైస్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. వివాదాస్పద కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్‌లో కూడా ఆయన పాల్గొన్నారు. ఠ మొత్తం 482 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్లైవ్ రైస్ 40.95 సగటుతో 48 సెంచరీలు సహా 26,331 పరుగులు చేశారు. తన పేస్ బౌలింగ్‌తో 22.49 సగటుతో 930 వికెట్లు పడగొట్టారు. -
ద్రవిడ్ ఉంటే ఇంకా బాగుండేది
న్యూఢిల్లీ: బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఉంటే మరింత బాగుండేదని భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ద్రవిడ్‌తో కలిసి నలుగురు దిగ్గజాలు సలహా కమిటీలో ఉంటే చక్కగా ఉండేది. అయితే తనకు ఇతరత్రా ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయేమో.. చాలా మంది యువ ఆటగాళ్లు వారి ఆటతీరును చూస్తూనే ఎదిగారు. ఇప్పుడు చాలా విషయాల్లో వారి సలహాలు తీసుకోవడం అద్భుతంగా ఉండనుంది. ఇక రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా ఉన్నంతకాలం జట్టుకు అది లాభదాయకమే. ఆటగాళ్లలో ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపారు. టెస్టు కెప్టెన్‌గా నేను ఇతర ఆటగాళ్లతో చాలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. ఎలాంటి విషయాన్నైనా నాతో వారు పంచుకునేలా తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాను’ అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి అన్నాడు. నేడు కోల్‌కతాకు కోహ్లి బృందం కోల్‌కతా: రెండు రోజుల శిబిరం కోసం భారత టెస్టు జట్టు నేడు (శుక్రవారం) కోల్‌కతాకు చేరుకోనుంది. ఆటగాళ్లు విడతల వారీగా మధ్యాహ్నం వరకు చేరుకుంటారని సమాచారం. శని, ఆదివారాలు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అనంతరం 10 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం సోమవారం ఉదయం జట్టు ఢాకాకు పయనమవుతుంది. మరోవైపు బోర్డు కొత్తగా ఏర్పాటు చేసిన సలహా కమిటీ కూడా శనివారం తొలిసారిగా ఇక్కడే సమావేశం కానుంది. -
'ఆ జగడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది'
సునీల్ గవాస్కర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పేసర్ మిషెల్ జాన్సన్‌తో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి జగడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దూకుడు కారణంగా జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ‘మీడియా సమావేశంలో క్రికెట్ గురించే మాట్లాడాలి. మైదానంలో జరిగిన ఇతర విషయాల గురించి అక్కడే వదిలేయాలి. కోహ్లి మాట్లాడిన విధానం తెలివైనదనిపించుకోదు. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, ద్రవిడ్ ఇంతకంటే కఠిన పరిస్థితులే ఎదుర్కొన్నారు. కానీ వారి ప్రవర్తన ఇలా ఉండేది కాదు. అవతలి వ్యక్తి రెచ్చగొడితే స్పందించడం కరెక్టే అయినా మనం కూడా అదే పనిగా ఇతరులపై నోరుపారేసుకోవడం సముచితం కాదు. దీనివల్ల అతడి వికెట్ కూడా పడింది. ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బతీసింది’ అని గవాస్కర్ విమర్శించారు. -
సచిన్ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి: కపిల్
న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్‌గా తాను సరిగా పని చేయలేకపోయానని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిరాకరించారు. అది మాస్టర్ వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. ‘అభిప్రాయాలు వెల్లడించడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. కాబట్టి వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తా. సచిన్‌కు మంచి జరగాలని మాత్రమే నేను కోరుకుంటా. మిగతా వాటిపై మాట్లాడలేను’ అని కొత్త బిజినెస్ వెంచర్ ‘స్లోపో.కామ్’ను ప్రారంభించిన సందర్భంగా ఈ మాజీ ఆల్‌రౌండర్ పేర్కొన్నారు. 20 ఏళ్ల అమన్ సహానీ అనే టెకీ తయారు చేసిన ఈ సోషల్ గేమింగ్ సైట్‌కు కపిల్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. 1999-2000లో జరిగిన ఆసీస్ పర్యటనలో భారత కోచ్‌గా ఉన్న కపిల్ జట్టు వ్యూహాలను రచించడంలో అసలు కల్పించుకునేవారు కాదని అప్పటి కెప్టెన్ సచిన్... తన ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్స్ మై వే’లో ఆరోపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌ను భారత్ నిలబెట్టుకోవడంపై కపిల్ ఎలాంటి ఊహాగానాలు చేయలేదు. అయితే వరల్డ్ కప్‌లో ఆడనున్న సహచరులకు శుభాకాంక్షలు మాత్రం తెలిపారు. ఆసీస్ పర్యటనకు తనతో పాటు గవాస్కర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించడం తెలివైన నిర్ణయం అని కపిల్ అభివర్ణించారు. అయితే ప్రతినిధుల బృందంలో తన పాత్ర ఏంటో ఇంకా తెలియదన్నారు. తనను ఎలా వినియోగించుకోవాలన్నది ప్రధానికే వదిలేశానని స్పష్టం చేశారు. -
ఈడెన్ గార్డెన్స్... లార్డ్స్లాంటిది
ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా కితాబు న్యూఢిల్లీ: భారత్‌లో ఆధునిక హంగులతో ఎన్నో కొత్త మైదానాలు పుట్టుకొస్తున్నా... ఉపఖండంలో మాత్రం ఈడెన్ గార్డెన్స్ అత్యుత్తమ గ్రౌండ్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కితాబిచ్చాడు. ‘భారత్‌లో నా చివరి పర్యటన సందర్భంగా ఈడెన్‌లో 90 వేల మంది ప్రేక్షకుల ముందు ఐదు రోజులు మ్యాచ్ ఆడా. ఉపఖండానికి ఇది లార్డ్స్లాగా అనిపించింది. ప్రపంచ క్రికెటర్లకు ఇది అద్భుతమైన ప్రదేశం. ఈడెన్‌లో సెంచరీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. కార్పెట్‌ను పోలిన అవుట్ ఫీల్డ్ అద్భుతం’ అని ‘సలామ్ క్రికెట్’లో పాల్గొన్న వా పేర్కొన్నాడు. భారత్, ఆసీస్ ఫైనల్ ఆడతాయి: పాంటింగ్ వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతుందని మరో సారథి రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందన్నాడు. అయితే సొంతగడ్డపై ఆడుతుండటంతో క్లార్క్ సేన చాంపియన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఈ టోర్నీలో పవర్ హిట్టర్ డేవిడ్ వార్నర్ కీలకం కానున్నాడని తెలిపాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేమని చెప్పిన ‘పంటర్’... పేసర్లు, ఆల్‌రౌండర్లతో ఆ జట్టు పటిష్టంగా ఉందన్నాడు. 1983 విజయం స్ఫూర్తినిచ్చింది: రణతుంగ కపిల్‌సేన 1983లో సాధించిన ప్రపంచకప్ విజయం తాము వన్డేల్లో రాణించేందుకు స్ఫూర్తిగా నిలిచిందని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నాడు. ‘కపిల్ ప్రపంచకప్‌ను పట్టుకోవడం కళ్లారా చూశా. భారత్‌లాంటి జట్టు పటిష్టమైన విండీస్‌ను ఓడించగా లేనిది.... లంక ప్రపంచకప్ ఎందుకు గెలవలేదని ఆలోచించా. అలా 1996లో మేం దాన్ని సాధించి చూపాం. పాక్ కూడా 1992లో కప్ గెలిచింది. ఇమ్రాన్ జట్టును నడిపిన తీరు అమోఘం. నేను కూడా అలా జట్టును ముందుకు తీసుకెళ్లలేనా? అని మదనపడ్డా. ఇలా చాలా అంశాలు తమకు స్ఫూర్తిగా నిలిచాయి’ అని రణతుంగ వ్యాఖ్యానించాడు. -
‘దేవుడే రక్షించాడు’
కారు ప్రమాదంలో గవాస్కర్ సురక్షితం లండన్: మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం నాలుగో టెస్టు ముగిసిన అనంతరం జాగ్వార్ కారులో సన్నీతో పాటు అతడి స్నేహితుడు చంద్రేశ్ పటేల్, మరో వ్యాఖ్యాత మార్క్ నికోలస్ మాంచెస్టర్ నుంచి లండన్‌కు ప్రయాణమయ్యారు. భారీ వర్షంలో వేగంగా ప్రయాణిస్తున్న వీరి కారును ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొంది. అప్పటికీ డ్రైవర్ కారును కుడి వైపు తిప్పి ప్రమాదం నుంచి తప్పించాలనుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వెనుక సీట్లో ఎడమ వైపున గవాస్కర్ కూర్చోగా ఎదురుగా వచ్చిన వాహనం కూడా అదే వైపున ఢీకొంది. అయితే జాగ్వార్ పూర్తిగా దెబ్బతినగా కారులో సన్నీతో పాటు ప్రయాణిస్తున్న ఇతరులు కూడా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. ఈ సమయంలో వీరి డ్రైవర్ కాస్త వేగంగానే నడుపుతుండగా వెనక నుంచి గవాస్కర్ హెచ్చరించినట్టు సమాచారం. ఆ తర్వాత షాక్‌కు గురైన వీరంతా సమీప రైల్వే స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి లండన్‌కు రైలులో వెళ్లారు. ‘నిజంగా మమ్మల్ని దేవుడే రక్షించాడు. ఘటన సమయంలో భారీ వర్షం కురుస్తోంది. మా కారు కూడా చాలా వేగంగా వెళుతోంది. ప్రమాదం చాలా దారుణంగా ఉన్నా మాకెవరికీ గాయాలు కాలేదు. నేను మాత్రం షాక్‌తో వ ణికిపోయాను’ అని గవాస్కర్ చెప్పారు. -
టెన్నిస్ లీగ్‌లో గవాస్కర్
సింగపూర్ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు లండన్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ టెన్నిస్‌లో అడుగు పెడుతున్నారు. మహేశ్ భూపతి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో సింగపూర్ ఫ్రాంచైజీలో గవాస్కర్ వాటా కొనుగోలు చేశారు. ఈ మేరకు గత సోమవారమే ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరినట్లు ద డైలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. సింగపూర్ ఫ్రాంచైజీకి సెరెనా విలియమ్స్, ఆండ్రీ అగస్సీ, థామస్ బెర్డిచ్ వంటివారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాఫెల్ నాదల్, జొకోవిచ్, ముర్రే, అజరెంకా, ఇవనోవిక్లతోపాటు మాజీలు అగస్సీ, సంప్రాస్, పాట్రిక్ రాఫ్టర్, కార్లోస్ మోయాలు కూడా ఈ లీగ్‌లో పాలుపంచుకోనున్నారు. సింగపూర్, మనీలా, ముంబై, దుబాయ్‌లలో నవంబర్, డిసెంబర్లలో ఈ లీగ్ జరగనుంది. -
బీసీసీఐలో పారదర్శకత పెంచుతా
- మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలి - తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ వ్యాఖ్య దుబాయ్: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. తాను బోర్డును మరింత పారదర్శకంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సన్నీ ఐపీఎల్ ముగిసే జూన్ 1 వరకు ఈ పదవిలో కొనసాగనున్న విషయం తెలిసిందే. అయితే అప్పటిలోగానే బోర్డుపై ఉన్న అపోహలను తొలగించడంతో పాటు అసలు బీసీసీఐలో ఏం జరుగుతుందో మీడియా ద్వారా ప్రజానీకానికి తెలపాలనే ఆలోచనతో ఉన్నారు. ‘ఇక నుంచి బీసీసీఐ మరింత ఓపెన్‌గా ఉంటుందని ఆశిస్తున్నాను. కనీసం ఐపీఎల్ ముగిసేదాకా అయినా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఆ తర్వాత బీసీసీఐ ఇదే పద్ధతిని మున్ముందు కూడా కొనసాగిస్తే బావుంటుంది. ఎందుకంటే ఇలాంటి పద్ధతిలో ఆరోగ్యకర చర్చలు, సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా తెలపడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అందరి ప్రమేయం ఉంటుంది. తప్పులు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పులను అంగీకరించి ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి.వచ్చే నెల నుంచి ఈ కొత్త పద్ధతి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇదంతా బీసీసీఐకి కొత్త. కానీ మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని విలేకరులతో జరిగిన సమావేశంలో గవాస్కర్ తెలిపారు.