పరుగెత్తకపోతే... ఆటెందుకు!
బీబీఎల్‌లో గేల్‌పై విమర్శల వర్షం
సిడ్నీ: మహిళా కామెంటేటర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌పై మరో దుమారం చెలరేగింది. బిగ్ బాష్ లీగ్‌లో అతని ఆటతీరుపై మాజీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం రాత్రి సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సహచరుడు టామ్ కూపర్ ఓ సింగిల్ కోసం గేల్‌ను పిలిచాడు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సులువుగా పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ విండీస్ బ్యాట్స్‌మన్ పరుగు తీసేందుకు నిరాకరించాడు. అంతే కామెంట్రీలో ఉన్న మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్... గేల్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
ఏ జట్టైనా గెలవడాని, ఓడటానికి కావాల్సింది ఒక్క పరుగేనంటూ ధ్వజమెత్తారు. ‘గేల్ ప్రవర్తనను నమ్మలేకపోతున్నాం. అతని తీరు చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి తీరును క్రికెట్‌లో ఎప్పుడూ చూడలేదు’ అంటూ రికీ విమర్శించాడు. ఇదంతా ఓవైపు జరుగుతుంటే మైదానంలో తర్వాతి బంతికే గేల్... ఫవాద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అంతే పాంటింగ్ తన మాటలకు మరింత పదును పెంచాడు. మ్యాచ్ తర్వాత కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు గేల్ నిరాకరించడంతో మాజీలు మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గేల్ జట్టు మెల్‌బోర్న్ రెనెగడెస్ ఐదు వికెట్ల తేడాతో గెలవడం విశేషం.