
అనవసరంగా హాకీ ఆడానేమో..
మాజీ కెప్టెన్ రీతూ రాణి ఆవేదన
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో తలపడే భారత మహిళల హాకీ జట్టు నుంచి తనను తొలగించడంపై మాజీ కెప్టెన్ రితూ రాణి హాకీ ఇండియాపై ధ్వజమెత్తింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చింది. ‘ఫామ్ కోల్పోవడంతో పాటు అధికారులపై ధిక్కార ధోరణితో వ్యవహరించినట్లు నాపై వచ్చిన కథనాలతో షాక్‌కు గురయ్యాను. అవన్నీ నిరాధార ఆరోపణలు. ఇప్పటిదాకా నన్ను ఎందుకు తీసేశారో వివరణ ఇవ్వలేదు. నేను ఏ శిబిరం నుంచి వెళ్లిపోలేదు.
శిబిరం విరామ సమయంలోనే నాకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. సర్దార్ సింగ్‌పై కూడా ఆరోపణలున్నాయి. కానీ అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి జట్టులో మాత్రం ఉంచారు. మరి నా విషయంలో హాకీ ఇండియాకు ఎందుకు ఈ వివక్ష?. ఇన్నాళ్లు హాకీని అనవసరంగా ఆడానని అనిపిస్తోంది’ అంటూ రీతూ కంటతడి పెట్టింది.