భారత్ ‘పసిడి సిక్సర్’
అథ్లెటిక్స్, షూటింగ్‌లలో స్వర్ణాలు దక్షిణాసియా క్రీడలు
గువాహటి: సొంతగడ్డపై తమ దూకుడును కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల ఏడో రోజు శుక్రవారం భారత్‌కు మరో ఆరు స్వర్ణాలు లభించాయి. అథ్లెటిక్స్‌లో మారథాన్ రేసులో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అందుబాటులో ఉన్న రెండు స్వర్ణాలనూ సొంతం చేసుకుంది. షూటర్లు తమ గురికి మరింత పదునుపెట్టి మరో నాలుగు బంగారు పతకాలను గెల్చుకున్నారు. ప్రస్తుతం భారత్ 146 స్వర్ణాలు, 80 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 249 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
గగన్‌కు రెండు పతకాలు
షూటింగ్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత్‌కే పసిడి పతకాలు దక్కాయి. తెలంగాణ షూటర్ గగన్ నారంగ్ స్వర్ణం, కాంస్యం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో గగన్ నారంగ్, చెయిన్ సింగ్, ఇమ్రాన్ హసన్ ఖాన్‌లతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో చెయిన్ సింగ్‌కు స్వర్ణం, గగన్ నారంగ్‌కు కాంస్యం లభించాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో నీరజ్ కుమార్, గుర్‌ప్రీత్ సింగ్, మహేందర్ సింగ్‌లతో కూడిన భారత జట్టుకు బంగారు పతకం దక్కగా... ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో నీరజ్ కుమార్, గుర్‌ప్రీత్, మహేందర్‌లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభించాయి.
మహిళల హాకీ జట్టుకు స్వర్ణం, పురుషుల జట్టుకు రజతం
హాకీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల జట్టు స్వర్ణం సాధించగా... పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. మహిళల ఫైనల్లో భారత్ 10-0తో శ్రీలంకను ఓడించింది. తెలంగాణ క్రీడాకారిణి యెండల సౌందర్య భారత్ తరఫున రెండు గోల్స్ సాధించింది. మరోవైపు పురుషుల ఫైనల్లో భారత్ 0-1 గోల్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ హాకీ జట్టుకిది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. 2006, 2010 క్రీడల్లోనూ పాకిస్తాన్ విజేతగా నిలిచింది.
రియో ఒలింపిక్స్‌కు కవిత అర్హత
అథ్లెటిక్స్ పోటీలను భారత్ స్వర్ణాలతో ముగించింది. మహిళల మారథాన్ రేసులో కవితా రౌత్ విజేతగా నిలిచింది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని కవిత 2 గంటల 38 నిమిషాల 38 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మారథాన్ విభాగంలో రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి అర్హత పొందిన నాలుగో క్రీడాకారిణిగా కవిత గుర్తింపు పొందింది. ఇప్పటికే ఓపీ జైషా, లలితా బబ్బర్, సుధా సింగ్ రియో బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. పురుషుల మారథాన్‌లోనూ భారత్‌కే స్వర్ణం దక్కింది. భారత అథ్లెట్ నితేందర్ సింగ్ రావత్ 2 గంటల 19 నిమిషాల 18 సెకన్లలో గమ్యానికి చేరుకొని బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు.