ఖేల్ కహానీ
అథ్లెటిక్స్ అందుబాటులో ఉన్న స్వర్ణాలు 47
రకరకాల క్రీడాంశాల సమాహారమే అథ్లెటిక్స్. ట్రాక్ అండ్ ఫీల్డ్, రోడ్, ఫీల్డ్ ఈవెంట్స్, వాకింగ్‌లో పోటీలు జరుగుతాయి. సమయం, కొలతలు, ఎత్తు, దూరం, ఫినిషింగ్ పొజిషన్‌లాంటి లెక్కలతో విజేతలను నిర్ణయిస్తారు. రిలే రేసులు మినహా మిగతా పోటీలన్నీ వ్యక్తిగత విభాగాల్లోనే జరుగుతాయి. ఏథెన్స్ (1896) ఒలింపిక్స్‌తో ఈ పోటీలకు కాస్త వెలుగు వచ్చింది. అప్పట్లో అథ్లెట్లు పరుగులు తీస్తుంటే లైన్ పక్కన నిల్చొని జడ్జీలు నిశితంగా పరిశీలించేవారు. అయితే ఆధునిక పోటీలకు సంబంధించిన నియమ నిబంధనలు వెస్ట్రన్ యూరోపియన్, నార్త్ అమెరికా నిర్దేశించాయి.
తర్వాతి కాలంలో ఈ అథ్లెటిక్స్‌ను ప్రపంచ మొత్తం విస్తరింపజేశాయి. ఒలింపిక్స్‌లో మిగతా పోటీలతో పోలిస్తే అథ్లెటిక్స్‌కు చాలా ప్రత్యేకత ఉంటుంది. క్షణాల్లో తారుమారయ్యే ఫలితాలు, వాయువును మించిన వేగంతో దూసుకుపోయే అథ్లెట్లు, సింహంలా ఆమాంతం లంఘించే నేర్పర్లు, ఆకాశం అంచుల దాకా ఎగిరే జంపింగ్‌లు, అలసట లేకుండా కిలో మీటర్లు పరుగెత్తడం, సింగిల్ నైట్‌తో స్టార్లుగా మారే క్రీడాకారులు దీనిలోనే ఎక్కువగా కనిపిస్తారు. అథ్లెటిక్స్‌లో ప్రధానంగా 100 మీటర్ల పరుగుకు ప్రపంచంలో వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఒక్క ఈవెంట్ ఫలితాలే దేశాల చరిత్రను మార్చిన సందర్భాలు ఉన్నాయి.
కరీబియన్లు కత్తులు
షార్ట్ డిస్టెన్స్ పరుగులో కరీబియన్లు, అమెరికన్ల హవా ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్‌లో మాత్రం ఆఫ్రికా అథ్లెట్ల హవా కొనసాగుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అమెరికా అథ్లెట్ల ఆధిపత్యం కనబడుతుంది. పోల్‌వాల్ట్, హైజంప్‌లో రష్యా పటిష్టంగా ఉంటుంది. షాట్‌పుట్, డిస్కస్ త్రో, ట్రిపుల్ జంప్, స్టీపుల్ ఛేజ్‌లో కొన్ని చిన్న దేశాలు కూడా విశేషమైన ప్రతిభను చూపుతున్నాయి.
ఒకరిద్దరిపై స్వల్ప ఆశలు
ఈసారి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందం జాబితా పెద్దగానే ఉంది. పురుషుల్లో 20 మంది, మహిళల్లో 17 మంది తమ పతక అవకాశాలను పరీక్షించుకోనున్నారు. 100, 200, 800, 4ఁ400, మారథాన్, 20, 50 కి,మీ, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్‌లో మన అథ్లెట్లు తమ ప్రతిభ పాటవాలను చూపెట్టనున్నారు. వికాస్ గౌడ, సీమా అంటిల్ (డిస్కస్ త్రో), రంజిత్ మహేశ్వరి (ట్రిపుల్ జంప్), కవితా రౌత్, జైశా, సుధా సింగ్‌ల మారథాన్ బృందంలపై పతకం ఆశలు కొద్దిగా పెట్టుకోవచ్చు.