23 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
మహిళల 10 వేల మీటర్ల రేసులో అల్మాజ్ అయానాకు స్వర్ణం
29ని:17.45 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు
రియో డి జనీరో: ప్రేక్షకులు అంతంత మాత్రంగానే హాజరైనా... రియో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజే ప్రపంచ రికార్డు బద్దలైంది. శుక్రవారం జరిగిన మహిళల 10 వేల మీటర్ల రేసులో ఇథియోపియా అథ్లెట్ అల్మాజ్ అయానా ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 29 నిమిషాల 17.45 సెకన్లలో గమ్యానికి చేరుకున్న అయానా... ఈ క్రమంలో 1993లో 29 నిమిషాల 31.78 సెకన్లతో వాంగ్ జున్‌జియా (చైనా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది.
అయానా ధాటికి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్ వివియన్ చెరియోట్ (కెన్యా-29ని:32.53 సెకన్లు) రజతం దక్కించుకోగా... డిఫెండింగ్ చాంపియన్ తిరునిష్ దిబాబా (ఇథియోపియా-29ని:42.56 సెకన్లు) కాంస్యపతకంతో సంతృప్తి పడింది. 24 ఏళ్ల అయానా 10 వేల మీటర్ల రేసులో పాల్గొనడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. రెండు నెలల క్రితం ఇథియోపియా జాతీయ ట్రయల్స్‌లో తొలిసారి 10 వేల మీటర్ల రేసులో పాల్గొని అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసి ఆమె రియో బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడల వేదికలో 10 వేల మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తొలి మహిళా అథ్లెట్‌గా అయానా గుర్తింపు పొందింది.