Khel Kahani
-
ఖేల్ కహానీ
అథ్లెటిక్స్ అందుబాటులో ఉన్న స్వర్ణాలు 47 రకరకాల క్రీడాంశాల సమాహారమే అథ్లెటిక్స్. ట్రాక్ అండ్ ఫీల్డ్, రోడ్, ఫీల్డ్ ఈవెంట్స్, వాకింగ్‌లో పోటీలు జరుగుతాయి. సమయం, కొలతలు, ఎత్తు, దూరం, ఫినిషింగ్ పొజిషన్లాంటి లెక్కలతో విజేతలను నిర్ణయిస్తారు. రిలే రేసులు మినహా మిగతా పోటీలన్నీ వ్యక్తిగత విభాగాల్లోనే జరుగుతాయి. ఏథెన్స్ (1896) ఒలింపిక్స్‌తో ఈ పోటీలకు కాస్త వెలుగు వచ్చింది. అప్పట్లో అథ్లెట్లు పరుగులు తీస్తుంటే లైన్ పక్కన నిల్చొని జడ్జీలు నిశితంగా పరిశీలించేవారు. అయితే ఆధునిక పోటీలకు సంబంధించిన నియమ నిబంధనలు వెస్ట్రన్ యూరోపియన్, నార్త్ అమెరికా నిర్దేశించాయి. తర్వాతి కాలంలో ఈ అథ్లెటిక్స్ను ప్రపంచ మొత్తం విస్తరింపజేశాయి. ఒలింపిక్స్‌లో మిగతా పోటీలతో పోలిస్తే అథ్లెటిక్స్‌కు చాలా ప్రత్యేకత ఉంటుంది. క్షణాల్లో తారుమారయ్యే ఫలితాలు, వాయువును మించిన వేగంతో దూసుకుపోయే అథ్లెట్లు, సింహంలా ఆమాంతం లంఘించే నేర్పర్లు, ఆకాశం అంచుల దాకా ఎగిరే జంపింగ్‌లు, అలసట లేకుండా కిలో మీటర్లు పరుగెత్తడం, సింగిల్ నైట్‌తో స్టార్లుగా మారే క్రీడాకారులు దీనిలోనే ఎక్కువగా కనిపిస్తారు. అథ్లెటిక్స్‌లో ప్రధానంగా 100 మీటర్ల పరుగుకు ప్రపంచంలో వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఒక్క ఈవెంట్ ఫలితాలే దేశాల చరిత్రను మార్చిన సందర్భాలు ఉన్నాయి. కరీబియన్లు కత్తులు షార్ట్ డిస్టెన్స్ పరుగులో కరీబియన్లు, అమెరికన్ల హవా ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్‌లో మాత్రం ఆఫ్రికా అథ్లెట్ల హవా కొనసాగుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అమెరికా అథ్లెట్ల ఆధిపత్యం కనబడుతుంది. పోల్‌వాల్ట్, హైజంప్‌లో రష్యా పటిష్టంగా ఉంటుంది. షాట్‌పుట్, డిస్కస్ త్రో, ట్రిపుల్ జంప్, స్టీపుల్ ఛేజ్‌లో కొన్ని చిన్న దేశాలు కూడా విశేషమైన ప్రతిభను చూపుతున్నాయి. ఒకరిద్దరిపై స్వల్ప ఆశలు ఈసారి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందం జాబితా పెద్దగానే ఉంది. పురుషుల్లో 20 మంది, మహిళల్లో 17 మంది తమ పతక అవకాశాలను పరీక్షించుకోనున్నారు. 100, 200, 800, 4ఁ400, మారథాన్, 20, 50 కి,మీ, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో మన అథ్లెట్లు తమ ప్రతిభ పాటవాలను చూపెట్టనున్నారు. వికాస్ గౌడ, సీమా అంటిల్ (డిస్కస్ త్రో), రంజిత్ మహేశ్వరి (ట్రిపుల్ జంప్), కవితా రౌత్, జైశా, సుధా సింగ్‌ల మారథాన్ బృందంలపై పతకం ఆశలు కొద్దిగా పెట్టుకోవచ్చు. -
ఖేల్ కహానీ
బ్యాడ్మింటన్ అందుబాటులో ఉన్న స్వర్ణాలు 5 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రాకెట్ క్రీడగా బ్యాడ్మింటన్‌కు పేరుంది. ఎందుకంటే గంటకు 400 కి.మీ వరకు వేగంతో దూసుకెళ్లే షటిల్‌కాక్‌ను ఆటగాళ్లు తమ నైపుణ్యంతో రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఓ మ్యాచ్‌లో సగటున ప్రతీ ఆటగాడు 2 వేల స్ట్రోక్స్‌ను ఆడతాడు. 20 సెకన్లలోనే షటిల్‌కాక్ కనీసం 40 నుంచి 50 సార్లు అటు ఇటూ పయనిస్తుంది. బ్రెజిల్ ఇప్పటిదాకా ఒలింపిక్స్‌లో అర్హత సాధించకపోయినా ఆతిథ్య జట్టు హోదాలో తొలిసారిగా బరిలోకి దిగబోతోంది. ఆసియా ఖండంలో అమిత ఆదరణ ఉన్న ఈ ఆట ఒలింపిక్స్‌లో ప్రవేశించి కేవలం 28 ఏళ్లే అయ్యింది. అయితే అంతకుముందు తొలిసారిగా 1972లో దీన్ని ప్రదర్శక క్రీడగా ఆడించారు. రెండు దశాబ్దాల అనంతరం 1992 బార్సిలోనా గేమ్స్‌లో అధికారికంగా ప్రవేశపెట్టారు. అందులో పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ మాత్రమే ఆడించారు. 1996 నుంచి మిక్స్డ్ డబుల్స్, కాంస్య పతక పోరును సైతం చేర్చారు. బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు సెమీస్‌లలో ఓడిన ఆటగాళ్ల మధ్య జరిగే ప్లేఆఫ్ విజేతకు కాంస్యం దక్కుతుంది. ఆధిపత్యం ఆసియాదే... దాదాపుగా అన్ని ఒలింపిక్స్ క్రీడలను యూరోప్ దేశాలు శాసిస్తున్నప్పటికీ బ్యాడ్మింటన్‌లో మాత్రం ఆసియానే కింగ్. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా, ఇండోనేసియా ఆటగాళ్లు ఈ క్రీడను శాసిస్తున్నారు. 1996లో డెన్మార్క్ ఆటగాడు పౌల్ ఎరిక్ హోయర్ స్వర్ణం సాధించిన అనంతరం ఇప్పటిదాకా మరే ఆసియేతర ఆటగాడు ఈ ఫీట్ సాధించలేకపోయాడు. ఇప్పటిదాకా జరిగిన అన్ని గేమ్స్ బ్యాడ్మింటన్ పతకాల్లో సగం చైనానే సాధించింది. క్రితం సారి జరిగిన లండన్ గేమ్స్‌లో మొత్తం 5 పతకాలను చైనా క్లీన్‌స్వీప్ చేసింది. ఓవరాల్‌గా 16 స్వర్ణాలతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత కొరియా, ఇండోనేసియా ఆరేసి స్వర్ణాలు సాధించాయి. సైనా రూపంలో మనదేశానికి లండన్ గేమ్స్‌లో ఏకైక కాంస్యం దక్కింది. సైనా, సింధు మెరుస్తారా? భారత్ నుంచి ఈసారి అత్యధికంగా ఏడుగురు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించారు. అయితే అందరి దృష్టి మరోసారి స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పైనే ఉంది. తనదైన రోజు ఎంతటి ప్రత్యర్థినైనా మట్టికరిపించే సామర్థ్యం సైనా సొంతం. తన ఖాతాలో ఇప్పటికే ఓ పతకం ఉండగా ఈసారి స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉంది. మహిళల సింగిల్స్‌లో తనతో పాటు సింధు కూడా బరిలోకి దిగుతోంది. డబుల్స్‌లో జ్వాలా, అశ్విని పొన్నప్ప పోటీ పడుతుండగా.. పురుషుల సిం గిల్స్‌లో శ్రీకాంత్, డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
ఖేల్ కహానీ
బాక్సింగ్ (అందుబాటులో ఉన్న స్వర్ణాలు 13) ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌కు ఘనచరిత్రే ఉంది. ఈ క్రీడను తొలిసారిగా (పురుషుల విభాగం) 1904లో సెయింట్ లూయిస్‌లో జరిగిన మెగా ఈవెంట్లో చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టాక్ హోమ్ (1912) మినహా అన్ని ఒ లింపిక్స్ల్లోనూ ఈ క్రీడను ఆడించారు. ఆ సమయం లో స్వీడిష్ లా బాక్సింగ్‌ను నిషేధించడంతో ఆ ఈవెంట్లో మాత్రమే దీన్ని తొలగించారు. అయి తే మహిళల ఈవెంట్‌ను మాత్రం చాలా ఆలస్యంగా... గత లండన్ క్రీడ (2012)ల్లోనే చేర్చారు. అమెరికాదే హవా ఒలింపిక్స్ బాక్సింగ్‌లో అమెరికా బాక్సర్లకు ఎదురే లేదు. వీళ్లకు కాస్తో కూస్తో పోటీనిచ్చేదెవరైనా ఉంటే అది క్యూబా ఆటగాళ్లే! ఇక ఈ క్రీడలో భారత్‌కు పతకాలు తెచ్చింది ఇద్దరే... విజేందర్ సింగ్ (కాంస్యం), మేరీకోమ్(కాంస్యం). లండన్లాగే ప్రస్తుత రియో ఒలింపిక్స్‌లో మొత్తం 13 ఈవెంట్లలో పోటీలుంటాయి. ఇందులో మూడు కేటగిరీలు ఫ్లయ్ వెయిట్, లైట్ వెయిట్, మిడిల్ వెయిట్ మహిళలవి... కాగా మిగతా పది పురుషుల ఈవెంట్లు. లైట్ ఫ్లయ్ వెయిట్, ఫ్లయ్ వెయిట్, బాంటమ్ వెయిట్, లైట్ వెయిట్, లైట్ వెల్టర్ వెయిట్, వెల్టర్ వెయిట్, మిడిల్ వెయిట్, లైట్ హెవీ వెయిట్, హెవీ వెయిట్, సూపర్ హెవీ వెయిట్. పురుషుల బౌట్ మూడు రౌండ్ల పాటు మూడు నిమిషాల నిడివితో జరుగుతాయి. మహిళల ఈవెంట్లో నాలుగు రౌండ్లున్నా... రెండే నిమిషాల్లో ముగిస్తా రు. బాక్సింగ్‌లో ఒక్కో ఈవెంట్లో రెండేసి కాంస్యాలిస్తారు. ఫైనల్లో గెలిచినవారికి స్వర్ణం, ఓడినవారికి రజతం ఇస్తారు. వీరిద్దరి చేతుల్లో సెమీస్‌లో ఓడిన వారికి చెరో కాంస్యం అందజేస్తారు. ఇటీవల మృతిచెందిన బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ రోమ్ ఒలిం పిక్స్ (1960)లో స్వర్ణం గెలిచాడు. భారత్ నుంచి ముగ్గురు ఈ సారి భారత్ నుంచి ముగ్గురు బాక్సర్లకు రియో బెర్తు లభించింది. లండన్ క్రీడల్లో తలపడిన శివ థాపా బాంటమ్ వెయిట్ కేటగిరీ బరిలో దిగుతాడు. మనోజ్ కుమార్ లైట్ వెల్టర్‌వెయిట్‌లో, వికాస్క్రిషన్ యాదవ్ మిడిల్ వెయిట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.