ఖేల్ కహానీ
బ్యాడ్మింటన్ అందుబాటులో ఉన్న స్వర్ణాలు 5
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రాకెట్ క్రీడగా బ్యాడ్మింటన్‌కు పేరుంది. ఎందుకంటే గంటకు 400 కి.మీ వరకు వేగంతో దూసుకెళ్లే షటిల్‌కాక్‌ను ఆటగాళ్లు తమ నైపుణ్యంతో రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఓ మ్యాచ్‌లో సగటున ప్రతీ ఆటగాడు 2 వేల స్ట్రోక్స్‌ను ఆడతాడు. 20 సెకన్లలోనే షటిల్‌కాక్ కనీసం 40 నుంచి 50 సార్లు అటు ఇటూ పయనిస్తుంది. బ్రెజిల్ ఇప్పటిదాకా ఒలింపిక్స్‌లో అర్హత సాధించకపోయినా ఆతిథ్య జట్టు హోదాలో తొలిసారిగా బరిలోకి దిగబోతోంది. ఆసియా ఖండంలో అమిత ఆదరణ ఉన్న ఈ ఆట ఒలింపిక్స్‌లో ప్రవేశించి కేవలం 28 ఏళ్లే అయ్యింది.
అయితే అంతకుముందు తొలిసారిగా 1972లో దీన్ని ప్రదర్శక క్రీడగా ఆడించారు. రెండు దశాబ్దాల అనంతరం 1992 బార్సిలోనా గేమ్స్‌లో అధికారికంగా ప్రవేశపెట్టారు. అందులో పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ మాత్రమే ఆడించారు. 1996 నుంచి మిక్స్‌డ్ డబుల్స్, కాంస్య పతక పోరును సైతం చేర్చారు. బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు సెమీస్‌లలో ఓడిన ఆటగాళ్ల మధ్య జరిగే ప్లేఆఫ్ విజేతకు కాంస్యం దక్కుతుంది.
ఆధిపత్యం ఆసియాదే...
దాదాపుగా అన్ని ఒలింపిక్స్ క్రీడలను యూరోప్ దేశాలు శాసిస్తున్నప్పటికీ బ్యాడ్మింటన్‌లో మాత్రం ఆసియానే కింగ్. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా, ఇండోనేసియా ఆటగాళ్లు ఈ క్రీడను శాసిస్తున్నారు. 1996లో డెన్మార్క్ ఆటగాడు పౌల్ ఎరిక్ హోయర్ స్వర్ణం సాధించిన అనంతరం ఇప్పటిదాకా మరే ఆసియేతర ఆటగాడు ఈ ఫీట్ సాధించలేకపోయాడు. ఇప్పటిదాకా జరిగిన అన్ని గేమ్స్ బ్యాడ్మింటన్ పతకాల్లో సగం చైనానే సాధించింది. క్రితం సారి జరిగిన లండన్ గేమ్స్‌లో మొత్తం 5 పతకాలను చైనా క్లీన్‌స్వీప్ చేసింది. ఓవరాల్‌గా 16 స్వర్ణాలతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత కొరియా, ఇండోనేసియా ఆరేసి స్వర్ణాలు సాధించాయి. సైనా రూపంలో మనదేశానికి లండన్ గేమ్స్‌లో ఏకైక కాంస్యం దక్కింది.
సైనా, సింధు మెరుస్తారా?
భారత్ నుంచి ఈసారి అత్యధికంగా ఏడుగురు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించారు. అయితే అందరి దృష్టి మరోసారి స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పైనే ఉంది. తనదైన రోజు ఎంతటి ప్రత్యర్థినైనా మట్టికరిపించే సామర్థ్యం సైనా సొంతం. తన ఖాతాలో ఇప్పటికే ఓ పతకం ఉండగా ఈసారి స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉంది. మహిళల సింగిల్స్‌లో తనతో పాటు సింధు కూడా బరిలోకి దిగుతోంది. డబుల్స్‌లో జ్వాలా, అశ్విని పొన్నప్ప పోటీ పడుతుండగా.. పురుషుల సిం గిల్స్‌లో శ్రీకాంత్, డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.