ఆరడుగుల రాకెట్ | special story to pv sindhu | Sakshi
Sakshi News home page

ఆరడుగుల రాకెట్

Published Sat, Aug 20 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

ఆరడుగుల రాకెట్

ఆరడుగుల రాకెట్

ఎవరీ అమ్మాయి? ఇంత పొద్దున్నే ప్రాక్టీస్‌కు వచ్చేసింది? మరీ తెల్లవారుజామున గం. 4.15కే రాకెట్‌తో సిద్ధమైంది? సింధును కెరీర్ ఆరంభంలో చూసిన వాళ్లు వేసిన ప్రశ్నలివి. ఈమె భవిష్యత్తులో భారత్‌కు ఒలింపిక్స్ పతకం తెస్తుందని బహుశా అప్పుడు వాళ్లకు తెలిసుండదు.


తల్లిదండ్రులు వాలీబాల్ ప్లేయర్లు అయినా.. తను మాత్రం బ్యాడ్మింటన్‌ను ఎంచుకోవటం గొప్ప విషయమే. కానీ ఇందుకోసం కెరీర్ ఆరంభంలో రోజుకు 56 కిలోమీటర్లు ప్రయాణం చేసేదంటే ఆశ్చర్యకరమే. అయినా ఆమెలో ఏమాత్రం అలసట కనిపించేది కాదు. అనుకున్నది సాధించాలన్న తపనే ఇందుకు కారణం. గురువు గోపీచంద్ పర్యవేక్షణలో.. అహోరాత్రులు శ్రమించి నేడు దేశం గర్వించదగ్గ బ్యాడ్మింటన్ స్టార్‌గా ఎదిగింది.

 

సాక్షి క్రీడావిభాగం కలలు కనండి వాటి సాకారానికి కృషిచేయండన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తిపూరిత వ్యాఖ్యలకు పీవీ సింధు నిలువెత్తు నిదర్శనం. తన కలను నెరవేర్చుకునేందుకు పడ్డ శ్రమకు నేటి ఈ పతకమే ఉదాహరణ. 1995 జూలై 5న పుట్టిన పీవీ సింధుకు చిన్నప్పటినుంచే బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఆమె ఇష్టాన్ని గుర్తించిన తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో బ్యాడ్మింటన్ కోచ్ మహబూబ్ అలీ వద్ద చేర్పించారు. ఇక్కడ రాకెట్ పట్టుకోవటం నేర్చుకున్న సింధు.. మరింత రాటుదేలాలన్న ఆలోచనతో గోపీచంద్ అకాడమీలో చేరింది. సికింద్రాబాద్ నుంచి అకాడమీకి వెళ్లి రావటానికి రోజుకు 56 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిందే. ఇందుకోసం సింధు తెల్లవారుజామున 3 గంటలకే లేచి గం.4.15కే అకాడమీకి చేరుకునేది. గం. 6.30 వరకు ట్రైనింగ్ పూర్తి చేసుకుని స్కూల్‌కు వెళ్లేది.


ఆనాడే చెప్పారు
సింధు స్థానిక టోర్నమెంట్లు ఆడటం ప్రారంభించిన కొత్తలో ఓ ప్రముఖుడు ‘రోజుకు 56 కిలోమీటర్లు ప్రయాణించి కోచింగ్‌కు వస్తున్న ఆమె పట్టుదలే ఆమెను ఓ మంచి బ్యాడ్మింటన్ స్టార్‌గా మలుస్తుంది. అందుకు కావాల్సిన కఠోరశ్రమ, చిత్తశుద్ధి ఆమె వద్ద పుష్కలంగా ఉన్నాయి’ అని ప్రశంసించారు. సింధులోని కసిని గుర్తించిన గోపీచంద్ కూడా... ‘ఓటమిని ఎప్పటికీ అంగీకరించని తత్వమే సింధు ఆటతీరుకు అదనపు బలం’ అని చాలా సందర్భాల్లో చెప్పారు. గోపీ అకాడమీలో చేరాకే సింధు పతకాల వేట మొదలైంది. అప్పటికి సింధు వయసు కేవలం పదేళ్లు మాత్రమే.


ఇంతింతై..
2012 జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌లో జర్మన్ షట్లర్ జులియన్ షెంక్ చేతిలో ఓడిన సింధు.. జూలైలో జరిగిన ఏషియా యూత్ అండర్-19 చాంపియన్‌షిప్‌లో కసిగా ఆడి టైటిల్ గెలుచుకుంది. ఇదే ఊపులో 2012 ఒలింపిక్స్ మహిళా సింగిల్స్ విజేత లీ జురీపై సంచలన విజయం సాధించి బ్యాడ్మింటన్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ టోర్నీ సందర్భంగానే సింధు కాలికి గాయమైంది. అదే ఏడాది జరిగిన జపాన్ ఓపెన్‌లో బరిలోకి దిగినా అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. తర్వాత జరిగిన జాతీయ ఈవెంట్లలో సత్తాచాటింది. సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. గాయం తీవ్రం కావటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకుంది.


ప్రత్యర్థుల ప్రశంసలు
2013లో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్‌లో రెండో సీడ్ వాంగ్ యిహాన్ (చైనా)పై సంచలన విజయంతో.. ఫైనల్లోకి దూసుకుపోయింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 2014లో డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రతిభతో.. మహామహులైన స్టార్లంతా ముక్కున వేలేసుకునేలా చేసింది. సెమీస్‌లోనే ఓడినా.. ప్రత్యర్థులంతా సింధు అటాకింగ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. 2015లో కెరీర్లో తొలి సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు (డెన్మార్ ఓపెన్) చేరింది. 2016 ఆరంభంలోనూ.. మరోసారి మలేసియా గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో బంగారు పతకం గెలిచింది.

 
పీబీఎల్‌లో కెప్టెన్‌గా..

ఐపీఎల్ ప్రేరణతో 2013 నుంచి మొదలైన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (పీబీఎల్)లోనూ సింధు సత్తా చాటింది. అవధ్ వారియర్స్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన సింధు సెమీస్‌లో ముంబై మరాఠాస్‌ను ఓడించి.. వారియర్స్‌ను ఫైనల్‌కు చేర్చింది. అయితే.. టైటిల్ పోరులో హైదరాబాద్ హాట్‌షాట్స్ చేతిలో ఓడిపోయింది. 2016లో చెన్నై స్మాషర్స్ కెప్టెన్‌గా ఉన్న సింధు.. తను ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి జట్టును సెమీస్‌కు చేర్చింది.

 

సిగలో అర్జున, పద్మశ్రీ
2013లో బ్యాడ్మింటన్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సింధుకు.. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు వరించింది. ఆ ఏడాది టాప్ ప్లేయర్లను ఓడించి రెండు సూపర్ సిరీస్‌లను తన ఖాతాలో వేసుకున్నం దుకు ఈ గౌరవం దక్కింది. తర్వాత 2015లో ఈమె సాధించిన విజయాలకు గుర్తుగా నాలుగో అత్యు త్తమ పౌర పురస్కారం పద్మశ్రీతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 2014లో ఫిక్కీ బ్రేక్‌త్రూ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులందుకుంది. ఇటు క్రీడల్లో రాణిస్తూనే.. విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. సెయింట్ ఆన్స్ కాలేజీలో ఎంబీఏ చేస్తోంది.

 
స్విమ్మింగ్, యోగా, హోటల్లో భోజనం
నిరంతరం టోర్నమెంట్లు, శిక్షణతో బిజీగా ఉండే సింధు... అప్పుడప్పుడు రాకెట్‌కు సెలవిచ్చి. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సేద తీరుతుంది. సమయం దొరికితే యోగా, స్విమ్మింగ్ ద్వారా రిలాక్సవుతుంది. ఫ్రెండ్స్‌తో కలిసి అప్పుడప్పుడు సినిమాలకూ వెళ్తుంది. టీవీ ప్రోగ్రాములు ఆసక్తిగా చూస్తుంది. చాకొలేట్స్, స్వీట్స్ తక్కువగా తినే సింధు... తల్లిదండ్రులతో కలిసి వారానికి ఒకట్రెండుసార్లు హోటల్‌కెళ్లి భోజనం చేసేందుకు ఇష్టపడుతుంది. చిన్న చిన్న నగలను, ఆభరణాలను కలెక్ట్ చేయటం సింధు హాబీ.

 

సింధు విజయాలు
జూనియర్ స్థాయిలో...
2009 కొలంబో సబ్-జూనియర్ ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (కొలంబో)లో కాంస్యం
2010 ఫజ్ ్రఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాలెంజ్ (ఇరాన్) లో రజతం

 

సీనియర్‌గా విజయాలు
2011లో ఇండోనేషియన్ ఇంటర్నేషనల్ టైటిల్
2012లో ఏషియా యూత్ అండర్-19 చాంపియన్‌షిప్
2013 మలేషియా మాస్టర్స్‌లో బంగారు పతకం (తొలి గ్రాండ్ ప్రి)
2013, 2014, 2015 మకావు ఓపెన్ టైటిల్స్
2013, 2014 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు
2015 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్
2016 మలేసియా మాస్టర్స్
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement