ఖేల్ కహానీ
బాక్సింగ్ (అందుబాటులో ఉన్న స్వర్ణాలు 13)
ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌కు ఘనచరిత్రే ఉంది. ఈ క్రీడను తొలిసారిగా (పురుషుల విభాగం) 1904లో సెయింట్ లూయిస్‌లో జరిగిన మెగా ఈవెంట్లో చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టాక్ హోమ్ (1912) మినహా అన్ని ఒ లింపిక్స్‌ల్లోనూ ఈ క్రీడను ఆడించారు. ఆ సమయం లో స్వీడిష్ లా బాక్సింగ్‌ను నిషేధించడంతో ఆ ఈవెంట్‌లో మాత్రమే దీన్ని తొలగించారు. అయి తే మహిళల ఈవెంట్‌ను మాత్రం చాలా ఆలస్యంగా... గత లండన్ క్రీడ (2012)ల్లోనే చేర్చారు.
అమెరికాదే హవా
ఒలింపిక్స్ బాక్సింగ్‌లో అమెరికా బాక్సర్లకు ఎదురే లేదు. వీళ్లకు కాస్తో కూస్తో పోటీనిచ్చేదెవరైనా ఉంటే అది క్యూబా ఆటగాళ్లే! ఇక ఈ క్రీడలో భారత్‌కు పతకాలు తెచ్చింది ఇద్దరే... విజేందర్ సింగ్ (కాంస్యం), మేరీకోమ్(కాంస్యం). లండన్‌లాగే ప్రస్తుత రియో ఒలింపిక్స్‌లో మొత్తం 13 ఈవెంట్లలో పోటీలుంటాయి. ఇందులో మూడు కేటగిరీలు ఫ్లయ్ వెయిట్, లైట్ వెయిట్, మిడిల్ వెయిట్ మహిళలవి... కాగా మిగతా పది పురుషుల ఈవెంట్లు.
లైట్ ఫ్లయ్ వెయిట్, ఫ్లయ్ వెయిట్, బాంటమ్ వెయిట్, లైట్ వెయిట్, లైట్ వెల్టర్ వెయిట్, వెల్టర్ వెయిట్, మిడిల్ వెయిట్, లైట్ హెవీ వెయిట్, హెవీ వెయిట్, సూపర్ హెవీ వెయిట్. పురుషుల బౌట్ మూడు రౌండ్ల పాటు మూడు నిమిషాల నిడివితో జరుగుతాయి. మహిళల ఈవెంట్‌లో నాలుగు రౌండ్లున్నా... రెండే నిమిషాల్లో ముగిస్తా రు. బాక్సింగ్‌లో ఒక్కో ఈవెంట్‌లో రెండేసి కాంస్యాలిస్తారు. ఫైనల్లో గెలిచినవారికి స్వర్ణం, ఓడినవారికి రజతం ఇస్తారు. వీరిద్దరి చేతుల్లో సెమీస్‌లో ఓడిన వారికి చెరో కాంస్యం అందజేస్తారు. ఇటీవల మృతిచెందిన బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ రోమ్ ఒలిం పిక్స్ (1960)లో స్వర్ణం గెలిచాడు.
భారత్ నుంచి ముగ్గురు
ఈ సారి భారత్ నుంచి ముగ్గురు బాక్సర్లకు రియో బెర్తు లభించింది. లండన్ క్రీడల్లో తలపడిన శివ థాపా బాంటమ్ వెయిట్ కేటగిరీ బరిలో దిగుతాడు. మనోజ్ కుమార్ లైట్ వెల్టర్‌వెయిట్‌లో, వికాస్‌క్రిషన్ యాదవ్ మిడిల్ వెయిట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.