Paris Olympics 2024: బుల్లెట్‌ దిగాలి... | Huge expectations on Indian shooters in Olympics | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: బుల్లెట్‌ దిగాలి...

Published Thu, Jul 18 2024 3:50 AM | Last Updated on Thu, Jul 18 2024 12:07 PM

Huge expectations on Indian shooters in Olympics

భారత షూటర్లపై భారీ అంచనాలు

అత్యధికంగా ఈసారి 21 మంది బరిలోకి

ప్రతి విభాగంలో మనోళ్ల ప్రాతినిధ్యం

గత రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో నిరాశపరిచిన షూటర్లు  

ఇంతింతై వటుడింతై అన్న నానుడి భారత షూటింగ్‌ క్రీడాంశానికి వర్తిస్తుంది. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో తొలిసారి భారత్‌ తరఫున ఇద్దరు షూటర్లు బరిలోకి దిగారు. నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారత షూటర్ల ప్రాతినిధ్యం కనిపిస్తోంది. 

2016 రియో ఒలింపిక్స్‌లో తొలిసారి రెండంకెల్లో భారత షూటర్లు పోటీపడగా... 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ అది కొనసాగింది... ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ భారత్‌ నుంచి మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 21 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

మెడల్‌ ఈవెంట్స్‌గా ఉన్న 12 విభాగాల్లోనూ భారత షూటర్లు ఉండటంతో ఈసారి రిక్తహస్తాలతో కాకుండా ఒకట్రెండు పతకాలతో తిరిగి వస్తారని భారీ అంచనాలున్నాయి. మన షూటర్లు లక్ష్యంలో బుల్లెట్‌లు దించి పతకాలను కొల్లగొడుతారా లేక గురితప్పి నిరాశపరుస్తారో వేచి చూడాలి.  –సాక్షి క్రీడా విభాగం  

రెండు దశాబ్దాల క్రితం ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో భారత సైనికాధికారి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ‘డబుల్‌ ట్రాప్‌’ షూటింగ్‌ ఈవెంట్‌లో దేశానికి తొలిసారి రజతం రూపంలో పతకాన్ని అందించాడు. నాలుగేళ్ల తర్వాత 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా ఎవ్వరూ ఊహించని విధంగా భారత్‌ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేశాడు. 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో విఫలమైన అభినవ్‌ బింద్రా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి అంచనాలను తారుమారు చేశాడు. 

స్వతంత్ర భారత్‌కు వ్యక్తిగత క్రీడాంశంలో తొలి బంగారు పతకాన్ని అందించాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో విజయ్‌ కుమార్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో రజతం... గగన్‌ నారంగ్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించడంతో భారత్‌కు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో షూటింగ్‌ క్రీడాంశంలో పతకాలు దక్కాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి తొలిసారి అత్యధికంగా 12 మంది షూటర్లు పోటీపడటంతో వరుసగా నాలుగోసారీ పతకాలు గ్యారంటీ అని అభిమానులు అనుకున్నారు. 

కానీ 12 మందిలో ఇద్దరు (అభినవ్‌ బింద్రా, జీతూ రాయ్‌) మాత్రమే ఫైనల్‌ చేరుకున్నారు. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అభినవ్‌ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోగా... పిస్టల్‌ షూటర్‌ జీతూ రాయ్‌ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఏకంగా 15 మంది షూటర్లు పాల్గొనగా... ఒత్తిడికి తట్టుకోలేక స్టార్‌ షూటర్లు కూడా తడబడ్డారు. కేవలం సౌరభ్‌ చౌధరీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లోకి ప్రవేశించి ఏడో స్థానంలో నిలిచాడు.  

అనుభవం పతకం తెస్తుందా... 
టోక్యో ఒలింపిక్స్‌ వైఫల్యాన్ని పక్కనబెడితే ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌కు ఏకంగా 21 మంది భారత షూటర్లు అర్హత సాధించారు. 21 మందిలో నలుగురు మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ వాళ్లున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన మనూ భాకర్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌), ఇలవేనిల్‌ వలారివన్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), అంజుమ్‌ మౌద్గిల్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌), ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌) పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగనున్నారు. 

మనూ భాకర్‌ మాత్రం ఈసారి రెండు ఈవెంట్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ నలుగురు కాకుండా మిగతా 17 మంది షూటర్లు తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై మిల్లీమీటర్ల వ్యత్యాసంలో పతకాలు, ఫలితాలు తారుమారవుతాయి. షూటర్లకు చెక్కు చెదరని ఏకాగ్రత, మానసిక దృఢత్వం అత్యవసరం. 

గత ఒలింపిక్స్‌ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఒలింపిక్‌ బెర్త్‌లు సాధించిన షూటర్లకు నేరుగా పారిస్‌ ఒలింపిక్స్‌కు పంపించకూడదని నిర్ణయించింది. నాలుగు దశల్లో సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించి ట్రయల్స్‌లో నిలకడగా రాణించిన షూటర్లనే పారిస్‌కు పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రయల్స్‌లో నూ రాణించి ఫామ్‌లో ఉన్న మనూ, అంజుమ్, ఇలవేనిల్, ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ అసలైన వేదికపై కూడా మెరిపించి పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం. 

అరంగేట్రంలోనే మెరిపిస్తారా! 
తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న 17 మంది షూటర్లు ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో వ్యవహరిస్తేనే పతకాల రేసులో నిలుస్తారు. ముఖ్యంగా అందరి దృష్టి 23 ఏళ్ల పంజాబ్‌ షూటర్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రాపై ఉంది. 2022 ఆసియా క్రీడల్లో సిఫ్ట్‌ కౌర్‌ 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. 19 ఏళ్ల ఇషా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. అదే జోరును ఆమె పారిస్‌లో కొనసాగించాలని ఆశిద్దాం. పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతాయి. 

‘పారిస్‌’లో భారత షూటర్లు
పురుషుల విభాగం: సందీప్‌ సింగ్, అర్జున్‌ బబూటా (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్‌ సింగ్‌ చీమా (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌), స్వప్నిల్‌ కుసాలే, ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌), అనీశ్‌ భన్వాలా, విజయ్‌వీర్‌ సిద్ధూ (25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌), పృథ్వీరాజ్‌ (ట్రాప్‌), అనంత్‌జీత్‌ సింగ్‌ నరూకా (స్కీట్‌). 

మహిళల విభాగం: ఇలవేనిల్‌ వలారివన్, రమితా జిందాల్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), రిథమ్‌ సాంగ్వాన్, మనూ భాకర్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌), ఇషా సింగ్, మనూ భాకర్‌ (25 మీటర్ల పిస్టల్‌), సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా, అంజుమ్‌ మౌద్గిల్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌), రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్‌ (ట్రాప్‌), రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్‌  (స్కీట్‌). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement