South Asian Sports
-
భారత్ ‘టాప్’ లేపింది
కఠ్మాండు (నేపాల్): మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నేపాల్‌లో మంగళవారం ముగిసిన ఈ క్రీడల్లో భారత్ అత్యధికంగా 312 పతకాలు సాధించి ‘టాప్’లో నిలిచింది. ఇందులో 174 స్వర్ణాలు, 93 రజతాలు, 45 కాంస్యాలు ఉన్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 309 పతకాలు సాధించింది. ఈసారి ఆ రికార్డును భారత్ బృందం సవరించింది. 1984లో దక్షిణాసియా క్రీడలు మొదలుకాగా... ఇప్పటివరకు జరిగిన అన్ని క్రీడల్లోనూ పతకాల పట్టికలో భారతే అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రీడల ఆఖరి రోజు మంగళవారం భారత్ 15 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం 18 పతకాలు సాధించింది. బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 101–62తో శ్రీలంక జట్టుపై, భారత మహిళల జట్టు 127–46తో నేపాల్‌పై గెలిచి స్వర్ణ పతకాలు నెగ్గాయి. స్క్వాష్ టీమ్ ఈవెంట్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం, పురుషుల జట్టు రజతం సాధించాయి. బాక్సింగ్‌లో ఆరు పసిడి పతకాలు లభించాయి. పురుషుల విభాగంలో వికాస్ కృషన్ (69 కేజీలు), స్పర్శ్ కుమార్ (52 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు)... మహిళల విభాగంలో పింకీ రాణి (51 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), మంజు బొంబారియా (64 కేజీలు) విజేతలుగా నిలిచారు. -
అదే జోరు...
కఠ్మాండు (నేపాల్): తొలి రోజు మొదలైన పతకాల వేటను కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రీడల ఎనిమిదో రోజు భారత్‌కు 22 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 38 పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 132 స్వర్ణాలు, 79 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి మొత్తం 252 పతకాలతో ‘టాప్’లో ఉంది. ఆదివారం టెన్నిస్ డబుల్స్ విభాగాల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మిక్స్డ్, పురుషుల, మహిళల డబుల్స్ విభాగాల్లో భారత్‌కే స్వర్ణాలు, రజతాలు లభించాయి. పతకాలు నెగ్గిన టెన్నిస్ క్రీడాకారుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సౌజన్య బవిశెట్టి, కాల్వ భువన, శ్రావ్య శివాని (తెలంగాణ)... సాకేత్ మైనేని (ఆంధ్రప్రదేశ్), విష్ణువర్ధన్ (తెలంగాణ) ఉన్నారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సౌజన్య బవిశెట్టి–శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6–3, 6–7 (4/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–ప్రార్థన తొంబారే (భారత్) జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్ మైనేని–విష్ణువర్ధన్ (భారత్) జంట 7–5, 3–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో శ్రీరామ్ బాలాజీ–జీవన్ నెడుంజెళియన్ ద్వయంపై నెగ్గింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రేరణ బాంబ్రీ–ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 6–3, 6–3తో కాల్వ భువన–చిలకలపూడి శ్రావ్య శివాని (భారత్) జంటను ఓడించింది. కోచ్, భర్త అయిన సురేశ్ కృష్ణ శిక్షణలో రాటుదేలిన సౌజన్య నేడు జరిగే మహిళల సింగిల్స్‌లో పసిడి పతకం కోసం పోరాడనుంది. తెలంగాణకే చెందిన సామ సాత్వికతో సౌజన్య ఫైనల్లో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ పసిడి పోరులో వైజాగ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత్‌కే చెందిన మనీశ్ సురేశ్ కుమార్‌తో తలపడతాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి. మహిళల 62 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్... అన్షు (59 కేజీలు)... పురుషుల 61 కేజీల విభాగంలో రవీందర్... పవన్ కుమార్ (86 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఇక బాక్సింగ్‌లో మొత్తం 15 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లి ఏకంగా 15 స్వర్ణాలపై గురి పెట్టారు. ఫెన్సింగ్‌లో పురుషుల ఇపీ, సాబ్రే... మహిళల ఫాయిల్ టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు వచ్చాయి. స్విమ్మింగ్‌లో ఏడు స్వర్ణాలు వచ్చాయి. జూడోలో భారత్ ‘కనకా’రంభం చేసింది. సుశీలా దేవి (48 కేజీలు), విజయ్ కుమార్ యాదవ్ (60 కేజీలు), జస్లీన్ సింగ్ సైని (66 కేజీలు), సుచిక తరియాల్ (57 కేజీలు), నిరుపమా దేవి (63 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. షూటింగ్లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో శ్రవణ్ కుమార్, రవీందర్ సింగ్, సుమీత్‌లతో కూడిన భారత బృందం స్వర్ణం నెగ్గింది. వ్యక్తిగత విభాగంలో శ్రవణ్ బంగారు పతకం సొంతం చేసుకోగా... రవీందర్‌సింగ్ కాంçస్యం గెలిచాడు. -
భారత్ పసిడి వేట
కఠ్మాండు (నేపాల్): బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్లోనూ పైచేయి సాధిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల వేటను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రీడల ఆరో రోజు శుక్రవారం భారత్ 19 స్వర్ణాలు, 18 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 41 పతకాలు సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ప్రస్తుతం భారత్ 81 స్వర్ణాలు, 59 రజతాలు, 25 కాంస్యాలతో కలిపి మొత్తం 165 పతకాలతో ‘టాప్’లో కొనసాగుతోంది. శుక్రవారం బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ స్వర్ణం నెగ్గాడు. ఫైనల్లో సిరిల్ వర్మ 17–21, 23–21, 21–13తో ఆర్యమాన్ టాండన్ (భారత్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి రజతం దక్కించుకుంది. ఫైనల్లో అషి్మత (భారత్) 21–18, 25–23తో గాయత్రిని ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ గారగ కృష్ణప్రసాద్–ధ్రువ్ కపిల (భారత్) జంట 21–19, 19–21, 21–18తో సచిన్ డయాస్–బువనెక (శ్రీలంక) జోడీపై గెలిచి బంగారు పతకం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో తెలుగమ్మాయి జక్కంపూడి మేఘన–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–16, 21–14తో సచిన్ డయాస్–ప్రమోదిక (శ్రీలంక) జంటపై నెగ్గి పసిడి పతకం సాధించింది. అథ్లెటిక్స్‌లో తేజిందర్ పాల్ పురుషుల షాట్‌పుట్‌లో స్వర్ణం గెలిచాడు. తేజిందర్ ఇనుప గుండును 20.03 మీటర్ల దూరం విసిరి ధక్షిణాసియా క్రీడల రికార్డును నెలకొల్పి విజేతగా నిలిచాడు. మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కే చెందిన అభా ఖతువా పసిడి పతకం గెలిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు స్వర్ణాలు దక్కాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆంథోనీ అమల్‌రాజ్ 4–3తో హరీ్మత్ దేశాయ్ (భారత్)పై, మహిళల సింగిల్స్ ఫైనల్లో సుతీర్థ 4–2తో ఐహిక ముఖర్జీ (భారత్)పై గెలిచారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో అచింత షెయులి (పురుషుల 73 కేజీలు), రాఖీ హల్దర్ (మహిళల 64 కేజీలు), మన్‌ప్రీత్ కౌర్ (మహిళల 71 కేజీలు) స్వర్ణ పతకాలు గెలిచారు. -
భారత్ జోరు
కఠ్మాండు: భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో ‘పసిడి’పట్టు పట్టారు. బుధవారం జరిగిన పలు ఈవెంట్ల ఫైనల్లో భారత ఆటగాళ్లే విజేతలుగా నిలిచారు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఖోఖో పోటీల్లో భారత మహిళలు, పురుషులు బంగారు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో భారత జోడీలే టైటిల్ పోరులో తలపడ్డాయి. దీంతో స్వర్ణాలతోపాటు రజతాలు లభించాయి. టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో హర్మీత్ దేశాయ్–ఆంథోని అమల్‌రాజ్ జోడీ 8–11, 11–7, 11–7, 11–5, 8–11, 12–10తో సానిల్ శెట్టి–సుధాన్షు గ్రోవర్ జంటపై గెలుపొందింది. మహిళల ఫైనల్లో ఆకుల శ్రీజ–మధురిక పాట్కర్ జంట 2–11, 11–8, 11–8, 11–6, 5–11, 11–5తో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో హర్మీత్–సుతీర్థ ద్వయం 11–6, 9–11, 11–6, 11–6, 11–8తో అమల్‌రాజ్–ఐహిక జంటపై గెలిచింది. ఖోఖో పురుషుల ఫైనల్లో భారత్ 16–9తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించగా, మహిళల తుదిపోరులో 17–5తో ఆతిథ్య నేపాల్‌ను ఓడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి, అష్మిత, పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ, ఆర్యమన్ టాండన్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో భారత కోచ్ గోపీచంద్ తనయ గాయత్రి 21–15, 21–16తో మహూర్ షాజాద్ (పాక్)పై, అష్మిత 21–9, 21–7తో పాల్వశ బషీర్ (పాక్)పై నెగ్గారు. పురుషుల క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ 21–12, 21–17తో మురద్ అలీ (పాక్)పై, ఆర్యమన్ 21–17, 21–17తో రంతుష్క కరుణతిలకే (శ్రీలంక)పై విజయం సాధించారు. దక్షిణాసియా క్రీడల్లో నాలుగో రోజు బుధవారం భారత్ ఏకంగా 29 పతకాలు సాధించింది. ఇందులో 15 స్వర్ణాలున్నాయి. మొత్తంమీద భారత్ 71 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 32 పసిడి పతకాలతో పాటు 26 రజతాలు, 13 కాంస్యాలు గెలిచింది. -
భారత్ ‘పసిడి సిక్సర్’
అథ్లెటిక్స్, షూటింగ్లలో స్వర్ణాలు దక్షిణాసియా క్రీడలు గువాహటి: సొంతగడ్డపై తమ దూకుడును కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల ఏడో రోజు శుక్రవారం భారత్‌కు మరో ఆరు స్వర్ణాలు లభించాయి. అథ్లెటిక్స్‌లో మారథాన్ రేసులో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అందుబాటులో ఉన్న రెండు స్వర్ణాలనూ సొంతం చేసుకుంది. షూటర్లు తమ గురికి మరింత పదునుపెట్టి మరో నాలుగు బంగారు పతకాలను గెల్చుకున్నారు. ప్రస్తుతం భారత్ 146 స్వర్ణాలు, 80 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 249 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గగన్‌కు రెండు పతకాలు షూటింగ్లో భారత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత్‌కే పసిడి పతకాలు దక్కాయి. తెలంగాణ షూటర్ గగన్ నారంగ్ స్వర్ణం, కాంస్యం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో గగన్ నారంగ్, చెయిన్ సింగ్, ఇమ్రాన్ హసన్ ఖాన్‌లతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో చెయిన్ సింగ్‌కు స్వర్ణం, గగన్ నారంగ్‌కు కాంస్యం లభించాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో నీరజ్ కుమార్, గుర్ప్రీత్ సింగ్, మహేందర్ సింగ్‌లతో కూడిన భారత జట్టుకు బంగారు పతకం దక్కగా... ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో నీరజ్ కుమార్, గుర్ప్రీత్, మహేందర్లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభించాయి. మహిళల హాకీ జట్టుకు స్వర్ణం, పురుషుల జట్టుకు రజతం హాకీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల జట్టు స్వర్ణం సాధించగా... పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. మహిళల ఫైనల్లో భారత్ 10-0తో శ్రీలంకను ఓడించింది. తెలంగాణ క్రీడాకారిణి యెండల సౌందర్య భారత్ తరఫున రెండు గోల్స్ సాధించింది. మరోవైపు పురుషుల ఫైనల్లో భారత్ 0-1 గోల్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ హాకీ జట్టుకిది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. 2006, 2010 క్రీడల్లోనూ పాకిస్తాన్ విజేతగా నిలిచింది. రియో ఒలింపిక్స్‌కు కవిత అర్హత అథ్లెటిక్స్ పోటీలను భారత్ స్వర్ణాలతో ముగించింది. మహిళల మారథాన్ రేసులో కవితా రౌత్ విజేతగా నిలిచింది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని కవిత 2 గంటల 38 నిమిషాల 38 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మారథాన్ విభాగంలో రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి అర్హత పొందిన నాలుగో క్రీడాకారిణిగా కవిత గుర్తింపు పొందింది. ఇప్పటికే ఓపీ జైషా, లలితా బబ్బర్, సుధా సింగ్ రియో బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. పురుషుల మారథాన్లోనూ భారత్‌కే స్వర్ణం దక్కింది. భారత అథ్లెట్ నితేందర్ సింగ్ రావత్ 2 గంటల 19 నిమిషాల 18 సెకన్లలో గమ్యానికి చేరుకొని బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు.