
కఠ్మాండు (నేపాల్): మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నేపాల్‌లో మంగళవారం ముగిసిన ఈ క్రీడల్లో భారత్ అత్యధికంగా 312 పతకాలు సాధించి ‘టాప్’లో నిలిచింది. ఇందులో 174 స్వర్ణాలు, 93 రజతాలు, 45 కాంస్యాలు ఉన్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 309 పతకాలు సాధించింది. ఈసారి ఆ రికార్డును భారత్ బృందం సవరించింది. 1984లో దక్షిణాసియా క్రీడలు మొదలుకాగా... ఇప్పటివరకు జరిగిన అన్ని క్రీడల్లోనూ పతకాల పట్టికలో భారతే అగ్రస్థానంలో నిలిచింది.
ఈ క్రీడల ఆఖరి రోజు మంగళవారం భారత్ 15 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం 18 పతకాలు సాధించింది. బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 101–62తో శ్రీలంక జట్టుపై, భారత మహిళల జట్టు 127–46తో నేపాల్‌పై గెలిచి స్వర్ణ పతకాలు నెగ్గాయి. స్క్వాష్ టీమ్ ఈవెంట్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం, పురుషుల జట్టు రజతం సాధించాయి. బాక్సింగ్‌లో ఆరు పసిడి పతకాలు లభించాయి. పురుషుల విభాగంలో వికాస్ కృషన్ (69 కేజీలు), స్పర్శ్ కుమార్ (52 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు)... మహిళల విభాగంలో పింకీ రాణి (51 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), మంజు బొంబారియా (64 కేజీలు) విజేతలుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment