పతకాల సెంచరీ | Indian Players Unbeaten In South Asian Games | Sakshi
Sakshi News home page

పతకాల సెంచరీ

Published Fri, Dec 6 2019 1:04 AM | Last Updated on Fri, Dec 6 2019 1:04 AM

Indian Players Unbeaten In South Asian Games - Sakshi

కఠ్మాండు (నేపాల్‌): పతకాల వేట కొనసాగిస్తూ... దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. ఈ క్రీడల ఐదో రోజు భారత్‌ తమ విశ్వరూపం ప్రదర్శించింది. ఒకే రోజు 30 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 56 పతకాలు సొంతం చేసుకొని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఐదో రోజు పోటీలు ముగిశాక భారత్‌ 62 స్వర్ణాలు, 41 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి 124 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆతిథ్య దేశం నేపాల్‌ 36 స్వర్ణాలు, 27 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 101 పతకాలతో రెండో స్థానంలో ఉంది. గురువారం స్విమ్మింగ్, వుషు, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. వుషులో ఏకంగా ఏడు స్వర్ణాలు లభించాయి.

మహిళల సాన్‌సూ 52 కేజీల విభాగంలో వై. సనతోయ్‌ దేవి... పూనమ్‌ (75 కేజీలు), దీపిక (70 కేజీలు), సుశీల (65 కేజీలు), రోషిబినా దేవి (60 కేజీలు)... పురుషుల గున్‌షు ఆల్‌ రౌండ్‌ ఈవెంట్‌లో సూరజ్‌ సింగ్‌... పురుషుల సాన్‌సూ ఈవెంట్‌లో సునీల్‌ సింగ్‌ (52 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. స్విమ్మింగ్‌లో లిఖిత్‌ సెల్వరాజ్‌ (పురుషుల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌), ఆపేక్ష (మహిళల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌), దివ్య (మహిళల 100 మీ. బటర్‌ఫ్లయ్‌) బంగారు పతకాలు గెలిచారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో జిలిల్‌ దలబెహెరా (మహిళల 45 కేజీలు), స్నేహా (49 కేజీలు), వింధ్యారాణి దేవి (55 కేజీలు), సిద్ధాంత్‌ (పురుషుల 61 కేజీలు) స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. తైక్వాండో లో పూర్వ (49 కేజీలు), రుచిక (67 కేజీలు), మార్గరెట్‌ (73 కేజీలు) బంగారు పతకాలు దక్కించుకున్నారు.  

ఫైనల్లో పుల్లెల గాయత్రి

బ్యాడ్మింటన్‌లో వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి, అషి్మత... పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ, ఆర్యమాన్‌ టాండన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో గాయత్రి 21–17, 21–14తో దిల్మీ డయాస్‌ (శ్రీలంక)పై, అష్మిత (భారత్‌) 21–5, 21–7తో అచిని రత్నసిరి (శ్రీలంక)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో సిరిల్‌ వర్మ 21–9, 21–12తో దినుక కరుణరత్నె (శ్రీలంక)పై, ఆర్యమాన్‌ 21–18, 14–21, 21–18తో రత్నజిత్‌ తమాంగ్‌ (నేపాల్‌)పై గెలిచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement