South Asian Games
-
‘స్వర్ణ’ సాత్విక
కఠ్మాండు (నేపాల్): తమ పతకాల వేటను కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత్ ‘ట్రిపుల్ సెంచరీ’కి చేరువైంది. పోటీల తొమ్మిదో రోజు సోమవారం భారత్ ఏకంగా 42 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 27 స్వర్ణాలు, 12 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 159 స్వర్ణాలు, 91 రజతాలు, 44 కాంస్యాలతో కలిపి మొత్తం 294 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 195 పతకాలతో (49 స్వర్ణాలు+54 రజతాలు+92 కాంస్యాలు) నేపాల్ రెండో స్థానంలో ఉంది. నేడు క్రీడలకు చివరి రోజు కావడం... ఇంకొన్ని ఈవెంట్స్‌లో భారత్ బరిలో ఉండటంతో మన పతకాల సంఖ్య 300 దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 309 పతకాలు సాధించింది. సోమవారం టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్స్‌లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మహిళల సింగిల్స్‌లో ఇద్దరు తెలుగమ్మాయిలు సామ సాత్విక, బవిశెట్టి సౌజన్య మధ్య ఫైనల్ జరిగింది. సాత్విక 4–6, 6–2, 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో మోచేతి గాయం కారణంగా సౌజన్య వైదొలిగింది. దాంతో సాత్వికకు స్వర్ణం ఖాయమైంది. మిక్స్డ్ డబుల్స్‌లో పసిడి నెగ్గిన సౌజన్య రజతంతో సంతృప్తి పడింది. పురుషుల సింగిల్స్‌లో మనీష్ సురేశ్ కుమార్ (భారత్) 6–4, 7–6 (8/6)తో భారత్‌కే చెందిన డేవిస్ కప్ జట్టు సభ్యుడు, విశాఖపట్నం ప్లేయర్ సాకేత్ మైనేనిపై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు. బాక్సింగ్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు, ఒక రజతం లభించింది. అంకిత్ ఖటానా (75 కేజీలు), వినోద్ తన్వర్ (49 కేజీలు), సచిన్ సివాచ్ (56 కేజీలు), గౌరవ్ చౌహాన్ (91 కేజీలు), కలైవాని శ్రీనివాసన్ (మహిళల 48 కేజీలు), పర్వీన్ (మహిళల 60 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. మనీశ్ కౌశిక్ (పురుషుల 64 కేజీలు) రజతం గెలిచాడు. మంగళవారం రెజ్లింగ్‌లో గౌరవ్ బలియాన్ (పురుషుల 74 కేజీలు), అనితా షెరోన్ (మహిళల 68 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లకే స్వర్ణాలు లభించాయి. పురుషుల ఫైనల్లో భారత్ 51–18తో శ్రీలంకపై, మహిళల జట్టు 50–13తో నేపాల్‌పై గెలిచాయి. భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఫైనల్లో 2–0తో నేపాల్‌పై నెగ్గి వరుసగా మూడోసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. -
ఒక్క ట్వీట్.. నెటిజన్లు ఫిదా
హైదరాబాద్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని కేవలం క్రీడలు మాత్రమే రూపుమావ గలవని, దాని కోసం ఏఎఫ్ఐ ముందుడుగేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏఎఫ్‌ఐపై ఇంతగా ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్(జావెలిన్ త్రో) స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీనిపై ఏఎఫ్ఐ తమ అధికారిక ట్విటర్లో స్పందించింది. ‘పాకిస్తాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్‌కు కంగ్రాట్స్. దక్షిణాసియా గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం నిజంగా అభినందనీయం. దశాబ్దాల తర్వాత నేరుగా ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి పాకిస్తాన్ అథ్లెట్‌గా అర్షద్ రికార్డు నెలకొల్పాడు’అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా భారత జావెలిన్ స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రాతో అర్షద్ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం భారత అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని కేవలం క్రీడల మాత్రమే తొలగించగలవు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. ‘రెండు దేశాల మధ్య సయోధ్య, సత్సంబంధాలు తిరిగి పునరుద్దరించుకోవాలంటే కేవలం క్రీడలు మాత్రమే ఉపయోగపడతాయి’అంటూ మరికొంత మంది ట్వీట్ చేశారు. ఇక ముంబై దాడుల అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య తిరిగి శత్రుత్వం తారాస్థాయికి చేరగా.. పుల్వామా టెర్రర్ అటాక్ అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన విషయం తెలిసిందే. -
స్వర్ణాల్లో సెంచరీ... పతకాల్లో డబుల్ సెంచరీ
కఠ్మాండు (నేపాల్): తమ ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటూ దక్షిణాసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. ఈ క్రీడల చరిత్రలో ఆరోసారి ‘స్వర్ణ’ పతకాల సెంచరీని పూర్తి చేసుకుంది. అదే క్రమంలో మొత్తం పతకాల్లో డబుల్ సెంచరీని దాటింది. ఈ క్రీడల్లో ఏడో రోజు శనివారం భారత్ మొత్తం 49 పతకాలు కొల్లగొట్టగా... అందులో 29 స్వర్ణాలు ఉండటం విశేషం. ప్రస్తుతం భారత్ 110 స్వర్ణాలు, 69 రజతాలు, 35 కాంస్యాలతో కలిపి మొత్తం 214 పతకాలతో ‘టాప్’లో కొనసాగుతోంది. 43 స్వర్ణాలు, 34 రజతాలు, 65 కాంస్యాలతో కలిపి మొత్తం 142 పతకాలతో నేపాల్ రెండో స్థానంలో ఉంది. శనివారం స్విమ్మర్లు, రెజ్లర్లు, షూటర్ల ప్రదర్శనతో భారత పసిడి పతకాల సంఖ్య 100 దాటింది. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్), రిచా మిశ్రా (800 మీ. ఫ్రీస్టయిల్), శివ (400 మీ. వ్యక్తిగత మెడ్లే), మానా పటేల్ (100 మీ. బ్యాక్‌స్ట్రోక్), చాహాత్ అరోరా (50 మీ. బ్యాక్‌స్ట్రోక్), లిఖిత్ (50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్), రుజుతా భట్ (50 మీ. ఫ్రీస్టయిల్) స్వర్ణాలు సాధించారు. రెజ్లింగ్‌లో సత్యవర్త్ కడియాన్ (పురుషుల ఫ్రీస్టయిల్ 97 కేజీలు), సుమీత్ మలిక్ (పురుషుల ఫ్రీస్టయిల్ 125 కేజీలు), గుర్‌శరణ్‌ప్రీత్ కౌర్ (మహిళల 76 కేజీలు), సరితా మోర్ (మహిళల 57 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. 97 కేజీల ఫైనల్లో పాక్ రెజ్లర్ తబియార్ ఖాన్‌ను సత్యవర్త్ చిత్తుగా ఓడించాడు. ఇక షూటింగ్లో మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అనీశ్ భన్వాలా... టీమ్ విభాగంలో అనీశ్, భావేశ్, ఆదర్శ్ సింగ్‌లతో కూడిన భారత జట్టుకు... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో మెహులీ ఘోష్–యశ్ వర్ధన్ జంటకు స్వర్ణాలు దక్కాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 81 కేజీల విభాగంలో సృష్టి సింగ్... 87 కేజీల విభాగంలో అనురాధ బంగారు పతకాలు గెలిచారు. -
పతకాల సెంచరీ
కఠ్మాండు (నేపాల్): పతకాల వేట కొనసాగిస్తూ... దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. ఈ క్రీడల ఐదో రోజు భారత్ తమ విశ్వరూపం ప్రదర్శించింది. ఒకే రోజు 30 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 56 పతకాలు సొంతం చేసుకొని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఐదో రోజు పోటీలు ముగిశాక భారత్ 62 స్వర్ణాలు, 41 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి 124 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆతిథ్య దేశం నేపాల్ 36 స్వర్ణాలు, 27 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 101 పతకాలతో రెండో స్థానంలో ఉంది. గురువారం స్విమ్మింగ్, వుషు, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. వుషులో ఏకంగా ఏడు స్వర్ణాలు లభించాయి. మహిళల సాన్‌సూ 52 కేజీల విభాగంలో వై. సనతోయ్ దేవి... పూనమ్ (75 కేజీలు), దీపిక (70 కేజీలు), సుశీల (65 కేజీలు), రోషిబినా దేవి (60 కేజీలు)... పురుషుల గున్‌షు ఆల్ రౌండ్ ఈవెంట్లో సూరజ్ సింగ్... పురుషుల సాన్‌సూ ఈవెంట్లో సునీల్ సింగ్ (52 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. స్విమ్మింగ్‌లో లిఖిత్ సెల్వరాజ్ (పురుషుల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్), ఆపేక్ష (మహిళల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్), దివ్య (మహిళల 100 మీ. బటర్‌ఫ్లయ్) బంగారు పతకాలు గెలిచారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో జిలిల్ దలబెహెరా (మహిళల 45 కేజీలు), స్నేహా (49 కేజీలు), వింధ్యారాణి దేవి (55 కేజీలు), సిద్ధాంత్ (పురుషుల 61 కేజీలు) స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. తైక్వాండో లో పూర్వ (49 కేజీలు), రుచిక (67 కేజీలు), మార్గరెట్ (73 కేజీలు) బంగారు పతకాలు దక్కించుకున్నారు. ఫైనల్లో పుల్లెల గాయత్రి బ్యాడ్మింటన్‌లో వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి, అషి్మత... పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ, ఆర్యమాన్ టాండన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో గాయత్రి 21–17, 21–14తో దిల్మీ డయాస్ (శ్రీలంక)పై, అష్మిత (భారత్) 21–5, 21–7తో అచిని రత్నసిరి (శ్రీలంక)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో సిరిల్ వర్మ 21–9, 21–12తో దినుక కరుణరత్నె (శ్రీలంక)పై, ఆర్యమాన్ 21–18, 14–21, 21–18తో రత్నజిత్ తమాంగ్ (నేపాల్)పై గెలిచారు. -
పసిడి పంట
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో రెండో రోజు భారత క్రీడాకారులు పసిడి పతకాల పంట పండించారు. అథ్లెటిక్స్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ క్రీడాంశాల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకొని పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా రెండో రోజు మంగళవారం భారత్‌కు 27 పతకాలు లభించాయి. ఇందులో 13 స్వర్ణాలు ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు నెగ్గాయి. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉన్న భారత టీటీ మహిళల జట్టు ఫైనల్లో 3–0తో శ్రీలంకను ఓడించింది. ఫైనల్స్ మ్యాచ్‌ల్లో సుతీర్థ ముఖర్జీ 11–9, 11–7, 11–3తో ఇషారా మధురాంగిపై, కృత్విక సిన్హా రాయ్ 11–6, 11–4, 11–2తో ఇరాండి వరుస్వితానాపై, ఆకుల శ్రీజ 11–5, 11–5, 11–3తో హన్సిని పియుమిలాపై నెగ్గారు. ఆంథోని అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్, సౌమ్యజిత్ ఘోష్ సభ్యులుగా ఉన్న భారత పురుషుల టీటీ జట్టు ఫైనల్లో 3–0తో నేపాల్‌పై గెలిచింది. వాలీబాల్ ఈవెంట్లోనూ భారత జట్లకు రెండు స్వర్ణాలు దక్కాయి. ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 20–25, 25–15, 25–17, 29–27తో పాకిస్తాన్‌పై నెగ్గగా, భారత మహిళల జట్టు 25–17, 23–25, 21–25, 25–20, 15–6తో నేపాల్‌ను ఓడించింది. షూటింగ్లో భారత్‌కు 4 స్వర్ణాలు, 4 రజతాలు, కాంస్యంతో కలిపి తొమ్మిది పతకాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో మెహులీ ఘోష్... టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకాలు గెలుచుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో చెయిన్ సింగ్... పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో యోగేశ్ సింగ్ స్వర్ణాలు సాధించారు. తైక్వాండోలో మహిళల 57 కేజీల విభాగంలో కశిష్ మలిక్ పసిడి పతకం నెగ్గింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు అర్చన సుశీంద్రన్ (మహిళల 100 మీటర్లు), జష్నా (మహిళల హైజంప్), సర్వేశ్ అనిల్ కుషారే (పురుషుల హైజంప్), అజయ్ కుమార్ సరోజ్ (పురుషుల 1500 మీటర్లు) బంగారు పతకాలు అందించారు. ఖో–ఖోలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. -
బ్యాడ్మింటన్‌లో డబుల్ ధమాకా
పొఖార (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో తొలి రోజు భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు టీమ్ విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 3–1తో శ్రీలంకపై... మహిళల టీమ్ ఫైనల్లో భారత్ 3–0తో శ్రీలంకపై నెగ్గాయి. భారత్ తరఫున రెండు సింగిల్స్‌లో శ్రీకాంత్, సిరిల్ వర్మ గెలిచారు. డబుల్స్ మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జంట ఓడిపోగా... మరో డబుల్స్ మ్యాచ్‌లో గారగ కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జంట నెగ్గడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. భారత మహిళల జట్టు తరఫున రెండు సింగిల్స్‌లలో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, పుల్లెల గాయత్రి గెలుపొందగా... డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–మేఘన జంట నెగ్గి పసిడి పతకాన్ని అందించారు. మరోవైపు పురుషుల ట్రయాథ్లాన్ వ్యక్తిగత విభాగంలో ఆదర్శ సినిమోల్ స్వర్ణం సాధించాడు. తైక్వాండోలో పురుషుల అండర్–29 పోమ్సె పెయిర్ ఈవెంట్లో, అండర్–23 పోమ్సె టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణాలు లభించాయి. -
గోపీచంద్ అకాడమీ ప్లేయర్లే ఆడాలా?
న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టు ఎంపికపై డబుల్స్ ప్లేయర్ ప్రజక్తా సావంత్ అసంతప్తి వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపాదికన భారత్‌కు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లను ఎంపిక చేశారంటూ సెలక్షన్ ప్రక్రియపై మండిపడింది. కనీసం దేశవాళీ టోర్నీల్లోనూ ఆడని ఆటగాళ్లను ప్రతిష్టాత్మక దక్షిణాసియా క్రీడలకు నేరుగా ఎలా ఎంపిక చేస్తారంటూ ట్విట్టర్ వేదికగా ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మను ప్రశ్నించింది. ‘బాయ్ నుంచి అధికారిక ప్రకటన రాకముందే దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపిక జరిగిపోయింది. దీన్ని నిర్ధారించేలా ఆటగాళ్లు తమ ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో దక్షిణాసియా క్రీడల వేదిక నేపాల్‌కు చేరుకున్నామంటూ తమ స్టోరీలను పోస్ట్ చేస్తున్నారు. ఏ ప్రాతిపాదికన టీమిండియాను ఎంపిక చేశారు. కేవలం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ) అకాడమీకి చెందిన ప్లేయర్లే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారా? ఆలిండియా టోర్నీల్లోనూ ఆడని ఆటగాళ్లకు భారత జట్టులో చోటు ఎలా దక్కింది?’ అని ఆమె ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మపై ప్రశ్నల బాణాలు సంధించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన శిఖా గౌతమ్, అశ్విన్ భట్‌లకు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై ఆమె అసంతప్తి వ్యక్తం చేసింది. ‘ ఇది పూర్తిగా అన్యాయం. జాతీయ చాంపియన్ జోడీకి భారత జట్టులో చోటు దక్కలేదు. ‘బాయ్’ ఈ అంశంపై ఎందుకు దష్టి సారించలేదు’ అంటూ ఆమె నిలదీసింది. ఈ వ్యాఖ్యలను ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ఖండించారు. జట్టు ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం చేశారు. నియమాలకు లోబడి నిర్ణీత ప్రమాణాల ఆధారంగానే ఆటగాళ్లని ఎంపిక చేశామన్నారు. నేపాల్ వేదికగా దక్షిణాసియా క్రీడలు జరుగనున్నాయి. ఆదివారం నుంచి టీమ్ ఈవెంట్లలో పోటీలు జరుగనుండగా... మంగళవారం నుంచి వ్యక్తిగత విభాగాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. -
పతాకధారిగా తేజిందర్ పాల్
న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బందానికి పతాకధారిగా షాట్‌పుట్ క్రీడాకారుడు తేజిందర్ సింగ్ పాల్ తూర్ వ్యవహరించనున్నాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో 25 ఏళ్ల తేజిందర్ స్వర్ణ పతకం సాధించాడు. దక్షిణాసియా క్రీడలు నేపాల్ రాజధాని కఠ్మాండూలో నేడు ప్రారంభమవుతాయి. 10 రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవులు దేశాల నుంచి 2,715 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 26 క్రీడాంశాల్లో 1119 పతకాల కోసం క్రీడాకారులు పోటీపడతారు. భారత్ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో బరిలో ఉన్నారు. అథ్లెటిక్స్‌లో భారత్ తరఫున 75 మంది బరిలోకి దిగుతున్నారు. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్ 188 స్వర్ణాలు, 90 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి మొత్తం 308 పతకాలు సాధించింది. ఫైనల్లో భారత మహిళల జట్టు వాలీబాల్ క్రీడాంశంలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి సెమీఫైనల్లో భారత్ 25–14, 25–6, 25–17తో మాల్దీవులు జట్టును ఓడించింది. ఫైనల్లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో నేపాల్ 25–14, 25–18, 25–21తో శ్రీలంకపై గెలిచింది. పురుషుల విభాగంలో నేడు జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంకతో భారత్; పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడతాయి. దక్షిణాసియా క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... కొన్ని క్రీడాంశాల్లో మాత్రం ముందే మ్యాచ్‌లు మొదలయ్యాయి. -
ముగిసిన దక్షిణాసియా క్రీడలు
-
వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన భారత్
గుహవాటి: దక్షిణాసియా క్రీడల్లో తొలిరోజే భారత వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటారు. పురుషుల, మహిళల విభాగాల్లో రెండు స్వర్ణపతకాలు సాధించి శభాష్ అనిపించారు. తొలుత మహిళల 48 కేజీల విభాగంలో సికోమ్ మీరాభాయ్ చాను పసిడిని దక్కించుకోగా, అనంతరం పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా స్వర్ణాన్ని సాధించాడు. గత 2014 కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకం సాధించిన సికోమ్.. దక్షిణాసియా క్రీడలు ఆరంభంలోనే మెరిసి స్వర్ణాన్ని దక్కించుకుంది. సికోమ్ మొత్తంగా 169 కేజీలు(స్నాచ్‌లో 79కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 90 కేజీలు) ఎత్తి ప్రథమ స్థానంలోనిలిచింది. ఇదే విభాగంలో శ్రీలంకకు చెందిన క్రీడాకారిణి దినుషా హన్సానీ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా, బంగ్లాదేశ్ క్రీడాకారిణి మొల్లా షబిరియా మూడో స్థానం దక్కించుకుని కాంస్యంతో సరిపెట్టుకుంది. మరోపక్క పురుషుల విభాగంలో గురురాజ్ 241 కేజీలు ( స్నాచ్ లో 104 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 137 కేజీలు) బరువును ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా సైక్లింగ్ లో భారత ఆటగాళ్లు రాణించిన సంగతి తెలిసిందే. 30 కిలోమీటర్ల సైక్లింగ్ విభాగంలో మణిపూర్ కు చెందిన సైక్లిస్ట్ టీ విజయలక్ష్మీ బంగారు పతకాన్ని సాధించింది. తద్వారా 12వ శాఫ్ గేమ్స్ లో స్వర్ణాన్ని గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నమోదుచేసింది. 30 కిలోమీటర్ల మహిళల సైక్లింగ్ విభాగంలో 49 నిమిషాల 24 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజయలక్ష్మీ తొలి స్థానంలో నిలిచింది. మణిపూర్ కే చెందిన మరో సైక్లిస్ట్ ఛోబా దేవి శనివారం జరిగిన ఫైనల్స్ లో 49 నిమిషాల 31 సెకన్లలో టార్గెట్ చేరుకుని రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. -
ఆడలేనన్నా... ఇంటికి విమాన టిక్కెట్లు
- కశ్యప్ న్యూఢిల్లీ: కడుపులో కండరాల గాయం కారణంగా దక్షిణాసియా గేమ్స్‌లో పాల్గొనలేనని చెప్పినా... గువహాటికి వెళ్లేందుకు తనకు విమాన టిక్కెట్లు పంపించారని స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశాడు. టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేసినా... ‘బాయ్’ తనను మరో రకంగా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శిం చాడు. ‘గాయం కారణంగా నేను చాలా సమయాన్ని కోల్పోయా. దాదాపు ఏడు టోర్నీలకు గైర్హాజరైనా... తప్పనిసరి పరిస్థితుల్లో పీబీఎల్, సయ్యద్ మోదీలో బరిలోకి దిగా. దీంతో గాయం తిరగబెట్టింది. ఫలితంగా థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగా. కానీ ఇప్పుడు దక్షిణాసియా గేమ్స్‌లో ఆడాలని బాయ్, క్రీడాశాఖ కోరుతోంది. అయితే నేను ఆడే పరిస్థితుల్లో లేను. ఇందుకు సంబంధించి లేఖలు కూడా పంపా. అయినాగానీ గువహాటి వెళ్లేందుకు నాకు విమాన టిక్కెట్లు పంపారు. ఇది చాలా నిరాశ కలిగించే అంశం’ అని కశ్యప్ చెప్పాడు.