ద్రవిడ్ ఉంటే ఇంకా బాగుండేది
న్యూఢిల్లీ: బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఉంటే మరింత బాగుండేదని భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ద్రవిడ్‌తో కలిసి నలుగురు దిగ్గజాలు సలహా కమిటీలో ఉంటే చక్కగా ఉండేది. అయితే తనకు ఇతరత్రా ఏమైనా కమిట్‌మెంట్స్ ఉన్నాయేమో.. చాలా మంది యువ ఆటగాళ్లు వారి ఆటతీరును చూస్తూనే ఎదిగారు. ఇప్పుడు చాలా విషయాల్లో వారి సలహాలు తీసుకోవడం అద్భుతంగా ఉండనుంది. ఇక రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా ఉన్నంతకాలం జట్టుకు అది లాభదాయకమే. ఆటగాళ్లలో ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపారు. టెస్టు కెప్టెన్‌గా నేను ఇతర ఆటగాళ్లతో చాలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. ఎలాంటి విషయాన్నైనా నాతో వారు పంచుకునేలా తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాను’ అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి అన్నాడు.
నేడు కోల్‌కతాకు కోహ్లి బృందం
కోల్‌కతా: రెండు రోజుల శిబిరం కోసం భారత టెస్టు జట్టు నేడు (శుక్రవారం) కోల్‌కతాకు చేరుకోనుంది. ఆటగాళ్లు విడతల వారీగా మధ్యాహ్నం వరకు చేరుకుంటారని సమాచారం. శని, ఆదివారాలు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అనంతరం 10 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం సోమవారం ఉదయం జట్టు ఢాకాకు పయనమవుతుంది. మరోవైపు బోర్డు కొత్తగా ఏర్పాటు చేసిన సలహా కమిటీ కూడా శనివారం తొలిసారిగా ఇక్కడే సమావేశం కానుంది.