మాజీ క్రికెట్ కెప్టెన్లకు సన్మానం
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ను పురస్కరించుకుని మాజీ కెప్టెన్లను సన్మానించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో భారత జట్టుకు సేవలందించిన మాజీ టెస్టు కెప్టెన్లను సత్కరించారు. ఈ సన్మానం అందుకున్న భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్లలో అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగసర్కార్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిశాస్త్రి, మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోనిలు ఉన్నారు. గురువారం న్యూజిలాండ్తో కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆరంభమయ్యే తొలి టెస్టుకు ముందు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్టు హోదా సంపాదించిన ఆరో జట్టుగా గుర్తింపు పొందిన భారత్.. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో తొలి టెస్టును ఆడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ భారత టెస్టు జట్టుకు 32 మంది కెప్టెన్లగా వ్యవహరించారు. భారత టెస్టు కెప్టెన్లలో సీకే నాయుడు మొదలుకొని, విరాట్ కోహ్లి వరకూ భారత టెస్టు జట్టుకు సారథులుగా చేశారు. ఇప్పటివరకూ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ 976 టెస్టు మ్యాచ్లతో తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 791 టెస్టు మ్యాచ్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత 500 టెస్టు మ్యాచ్ల మార్కును అందుకున్న జట్లలో వెస్టిండీస్(517), భారత్ లు ఉన్నాయి.