కేజ్రీవాల్‌కు బీసీసీఐ షాక్
క్రికెటర్ల సన్మానానికి అనుమతివ్వని బోర్డు
న్యూఢిల్లీ: రెండుసార్లు భారత్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన జట్లలోని తమ రాష్ట్ర ఆటగాళ్లకు సన్మానం చేయాలనుకున్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలకు బీసీసీఐ అడ్డు తగిలింది. దీంతో ఈ కార్యక్రమం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 1983, 2011 టోర్నీల్లో ఆడిన ఢిల్లీ క్రికెటర్లు అమర్‌నాథ్, మదన్ లాల్, సెహ్వాగ్, గంభీర్, కోహ్లిలతోపాటు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడిని దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టులో సన్మానిస్తామని ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డీడీసీఏకు తెలిపారు. దీనికి మూడో రోజు లంచ్ విరామాన్ని వినియోగించుకోవాలని భావించారు. అయితే ఇలా ఆట మధ్యలో కార్యక్రమాలు నిర్వహించడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయం తెలియని బేడీ మైదానానికి వచ్చి... ఆ తర్వాత వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై మాజీ ఆటగాళ్లు బీసీసీఐని విమర్శించారు.
కే జ్రీవాల్ ఒత్తిడి తెచ్చారు: జస్టిస్ ముద్గల్
ఆటగాళ్లకు సన్మానం చేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఒత్తిడి చేశారని... ఈ మ్యాచ్ కోసం హైకోర్టు నియమించిన పరి శీలకులు జస్టిస్ ముకుల్ ముద్గల్ తెలిపారు. అయితే బీసీసీఐ సూచనల మేరకు తాను ఇందుకు అంగీకరించలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ ప్రభుత్వ కౌన్సిల్ రాహుల్ మెహ్రా, తన కు మధ్య జరిగిన సందేశాల వివరాలను ఆయన వెల్లడించారు. మరోవైపు స్టేడియంలో పాఠశాల విద్యార్థులు కూర్చున్న స్టాండ్స్ దగ్గరకు వెళ్లి ఢిల్లీ సీఎం మాట్లాడతారని మెహ్రా డిమాండ్ చేశారు. అయితే భద్రతాపరంగా ఇబ్బంది ఎదురవుతుందని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘సన్మానానికి దూరంగా ఉండు’
ఒకవేళ ఢిల్లీ స్టేట్ తమ ఆటగాళ్లకు సన్మానం చేస్తే దానికి దూరంగా ఉండాలని స్థానిక క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి బీసీసీఐ సూచించింది. ‘కోహ్లి బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాడు. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో మూడో పార్టీ నిర్వహించే కార్యక్రమానికి భారత కెప్టెన్‌ను అనుమతించలేము’ అని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. అలాగే ఈ సిరీస్‌లోనే రెండో టెస్టు దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్‌కు వందో మ్యాచ్ కావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడికి సన్మానం చేద్దామని భావించింది. అయితే దీనికి కూడా బీసీసీఐ అంగీకరించలేదు.