బీసీసీఐలో పారదర్శకత పెంచుతా
- మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలి
- తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ వ్యాఖ్య
దుబాయ్: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. తాను బోర్డును మరింత పారదర్శకంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సన్నీ ఐపీఎల్ ముగిసే జూన్ 1 వరకు ఈ పదవిలో కొనసాగనున్న విషయం తెలిసిందే. అయితే అప్పటిలోగానే బోర్డుపై ఉన్న అపోహలను తొలగించడంతో పాటు అసలు బీసీసీఐలో ఏం జరుగుతుందో మీడియా ద్వారా ప్రజానీకానికి తెలపాలనే ఆలోచనతో ఉన్నారు. ‘ఇక నుంచి బీసీసీఐ మరింత ఓపెన్‌గా ఉంటుందని ఆశిస్తున్నాను.
కనీసం ఐపీఎల్ ముగిసేదాకా అయినా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఆ తర్వాత బీసీసీఐ ఇదే పద్ధతిని మున్ముందు కూడా కొనసాగిస్తే బావుంటుంది. ఎందుకంటే ఇలాంటి పద్ధతిలో ఆరోగ్యకర చర్చలు, సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా తెలపడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అందరి ప్రమేయం ఉంటుంది.
తప్పులు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పులను అంగీకరించి ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి.వచ్చే నెల నుంచి ఈ కొత్త పద్ధతి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇదంతా బీసీసీఐకి కొత్త. కానీ మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని విలేకరులతో జరిగిన సమావేశంలో గవాస్కర్ తెలిపారు.