బీసీసీఐ మేల్కోవాలి | Rahul Dravid floats an idea for BCCI to curb illegal bowling | Sakshi
Sakshi News home page

బీసీసీఐ మేల్కోవాలి

Published Wed, Dec 2 2015 1:08 AM | Last Updated on Wed, Oct 3 2018 7:16 PM

బీసీసీఐ మేల్కోవాలి - Sakshi

బీసీసీఐ మేల్కోవాలి

* జూనియర్ క్రికెట్‌కు బ్లూప్రింట్ అవసరం
* పటౌడీ స్మారకోపన్యాసంలో ద్రవిడ్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ భవిష్యత్తు కోసం జూనియర్ స్థాయిలో ఆటను అభివృద్ధి చేసేందుకు బీసీసీఐ చొరవ చూపించాలని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయ పడ్డారు. వివిధ వయో విభాగాల కోసం ప్రత్యేక బ్లూప్రింట్‌ను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. మంగళవారం ఇక్కడ ‘మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసం’లో ప్రసంగిస్తూ ద్రవిడ్ పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ప్రధానంగా జూనియర్ స్థాయి క్రికెట్‌లోని కొన్ని లోపాలపై బోర్డును హెచ్చరించారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ అకాడమీలు భారీ ఫీజులు తీసుకుంటూ సరైన శిక్షణ ఇవ్వడం లేదని, ఒక ప్రత్యేక పాలసీ రూపొందిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు. క్రికెట్ కోచింగ్ ఇప్పుడు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని... ప్రతి ఏటా దాదాపు రూ. 30 కోట్ల వరకు తీసుకునే రాష్ట్ర క్రికెట్ సంఘాలు కొంత మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత క్రికెట్ కోచింగ్‌కు కేటాయిస్తే పేదవారికి కూడా న్యాయం జరుగుతుందని ద్రవిడ్ వ్యాఖ్యానించారు.

స్కూల్ స్థాయి క్రికెట్ మ్యాచ్‌లలో ఫుట్‌బాల్ తరహాలో సబ్‌స్టిట్యూషన్, రొటేషన్ పద్ధతి పెట్టి అందరు ఆటగాళ్లకు అవకాశం ఇస్తే ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని గుర్తు చేశారు. అండర్-14 స్థాయిలో రాణించకపోతే తమ పిల్లాడి ప్రపంచం ముగిసిపోయినట్లు తల్లిదండ్రులు భావించరాదని ఆయన చెప్పారు. ఒక వేళ ఆటలో ముందుకు వెళ్లకపోయినా తిరిగి తమ చదువులో కొనసాగే ధైర్యం వారికివ్వాలన్నారు.

సచిన్ టెండూల్కర్‌ది ప్రత్యేకమైన ఘనత అని, అతడితో పోల్చి ఒత్తిడి పెంచవద్దని ద్రవిడ్ కోరాడు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయసు తక్కువగా చూపించడం కూడా ఫిక్సింగ్‌లాంటి జాడ్యమే అని...కఠిన నిబంధనలతో బోర్డు దీనికి అడ్డుకట్ట వేయాలని ద్రవిడ్ సూచించారు. ఈ సందర్భంగా పటౌడీతో తనకు ఉన్న అనుబంధాన్ని ద్రవిడ్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement