సచిన్ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి: కపిల్
న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్‌గా తాను సరిగా పని చేయలేకపోయానని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిరాకరించారు. అది మాస్టర్ వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. ‘అభిప్రాయాలు వెల్లడించడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. కాబట్టి వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తా. సచిన్‌కు మంచి జరగాలని మాత్రమే నేను కోరుకుంటా. మిగతా వాటిపై మాట్లాడలేను’ అని కొత్త బిజినెస్ వెంచర్ ‘స్లోపో.కామ్’ను ప్రారంభించిన సందర్భంగా ఈ మాజీ ఆల్‌రౌండర్ పేర్కొన్నారు.
20 ఏళ్ల అమన్ సహానీ అనే టెకీ తయారు చేసిన ఈ సోషల్ గేమింగ్ సైట్‌కు కపిల్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. 1999-2000లో జరిగిన ఆసీస్ పర్యటనలో భారత కోచ్‌గా ఉన్న కపిల్ జట్టు వ్యూహాలను రచించడంలో అసలు కల్పించుకునేవారు కాదని అప్పటి కెప్టెన్ సచిన్... తన ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్స్ మై వే’లో ఆరోపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌ను భారత్ నిలబెట్టుకోవడంపై కపిల్ ఎలాంటి ఊహాగానాలు చేయలేదు.
అయితే వరల్డ్ కప్‌లో ఆడనున్న సహచరులకు శుభాకాంక్షలు మాత్రం తెలిపారు. ఆసీస్ పర్యటనకు తనతో పాటు గవాస్కర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించడం తెలివైన నిర్ణయం అని కపిల్ అభివర్ణించారు. అయితే ప్రతినిధుల బృందంలో తన పాత్ర ఏంటో ఇంకా తెలియదన్నారు. తనను ఎలా వినియోగించుకోవాలన్నది ప్రధానికే వదిలేశానని స్పష్టం చేశారు.