దేశంకంటే క్రికెట్ ఎక్కువేమీ కాదు!
- భారత్, పాక్ సిరీస్‌పై గంగూలీ
- రవిశాస్త్రి సమర్థంగా పని చేస్తున్నారు
- కుర్రాళ్లు రాటుదేలారన్న మాజీ కెప్టెన్
న్యూఢిల్లీ: ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతుండగా... మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అతను మద్దతు పలికాడు. ‘భారత్, పాక్ సిరీస్ జరగాలని, ఎక్కువ వినోదం దక్కుతుందని చాలా మంది ఆశించడం సహజమే. అయితే సరిహద్దులో భయాందోళనతో జీవిస్తున్న మన ప్రజల మనోభావాలు ఎంతో ముఖ్యం. ఆట జరిగే ముందు తీవ్రవాదం పూర్తిగా ఆగిపోవాలని బీసీసీఐ చెప్పడం సరైన నిర్ణయం. సాధారణ ప్రజలు కోరుకునేది కూడా అదే. క్రికెట్ కంటే దేశం ముఖ్యం’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
ఢిల్లీ కోర్టు తీర్పుతో బీసీసీఐ సంతృప్తి చెందితే శ్రీశాంత్ తిరిగి రావడం సమస్య కాదని, ఈ విషయంలో తన వివరణ ఇచ్చుకునేందుకు ఆటగాడికి బోర్డు అవకాశం ఇస్తుందని భావిస్తున్నానన్నాడు. లోధా కమిటీ తీర్పుపై ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న గంగూలీ, తాము శిక్షలు ఖరారు చేయమని, ఐపీఎల్‌ను బాగా నిర్వహించేందుకు కావాల్సిన సూచనలు మాత్రమే ఇస్తామని వెల్లడించాడు. అయితే గతంలో స్పాన్సర్లు, ప్రసారకర్తలతో చేసుకున్న ఒప్పందాల మేరకు కనీసం ఎనిమిది జట్లతోనే లీగ్ జరుగుతుందని గంగూలీ చెప్పాడు.
కోచ్‌కు డెరైక్టర్‌కు తేడా లేదు!
శ్రీలంక పర్యటన ముగిసేవరకు టీమిండియాకు రవిశాస్త్రినే డెరైక్టర్‌గా కొనసాగుతారని బీసీసీఐ సలహా కమిటీ సభ్యుడైన గంగూలీ స్పష్టం చేశాడు. మరీ అవసరమనిపిస్తే ఆ తర్వాత కొత్త కోచ్ ఎంపికపై ఆలోచిస్తామన్నాడు. ‘రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా బాగా పని చేస్తున్నారు. నా దృష్టిలో కోచ్‌కు, డెరైక్టర్‌గా తేడా ఏమీ లేదు. పైగా ఆయనకు అండగా సమర్థులైన సహాయక సిబ్బంది ఉన్నారు.
మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇదే బృందాన్ని కొనసాగించడంలో తప్పేముంది’ అని ఈ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టులోని యువ ఆటగాళ్లను రాటుదేల్చిందని, ఆ అనుభవం శ్రీలంకలో ఉపయోగపడుతుందని సౌరవ్ అన్నాడు. లంక పటిష్టమైన ప్రత్యర్థే అయినా భారత్‌కు మంచి విజయావకాశాలు ఉన్నాయన్నాడు. ప్రధాన ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న జింబాబ్వే పర్యటన ఫలితం గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. రహానే తదితరులు దానిని మరచి రాబోయే లంక సిరీస్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు.
గెలిస్తే అంతా బాగుంటుంది!
టెస్టు, వన్డే జట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించడం గతంలో అనేక జట్లు చేశాయని, భారత్‌కు మాత్రం ఇది కొత్త అని ఈ మాజీ కెప్టెన్ అన్నాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ వల్లే ఇది జరిగిందని అతను గుర్తు చేశాడు. ‘టీమ్ గెలిస్తే ఈ ప్రయోగం పని చేసినట్లు, ఓడితే విఫలమైనట్లు’ అని గంగూలీ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు.