కరాచీ/లాహోర్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని పాకిస్తాన్ తెహ్రీక్–ఇన్సాఫ్ (పీటీఐ) యోచిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. మిగతా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈనెల 11న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ సహా సార్క్ దేశాధినేతలను ఆహ్వానించాలని ఇమ్రాన్ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ అంశంతోపాటు ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలు భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అయినప్పటికీ, ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు విభేదాలను పరిష్కరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment