Sworn ness
-
మే 30, రాత్రి 7 గంటలు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. ఎన్డీయే కూటమి మోదీని తమ నాయకుడిగా శనివారం ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన లేఖను బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉద్ధవ్ ఠాక్రే, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, నితీశ్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి అందచేశారు. దీంతో ఎన్డీయేకు లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ తన రాజ్యాంగాధికారాలను ఉపయోగించి మోదీని ప్రధానిగా నియమించారు. మంత్రివర్గంలో చేరే సభ్యుల పేర్లు, ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ, సమయం పై మోదీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. తొలి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి బీజేపీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీకి ముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. ఇరుదేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేద్దామని కోరారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఇందుకోసం మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి మాల్దీవుల్లో తొలి పర్యటన.. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ తన తొలి పర్యటనను మాల్దీవుల్లో చేపట్టే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి భూటాన్‌ను సందర్శించారు. జూన్ నెలలో మొదటి లేదా రెండో వారంలో మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తారని దౌత్యవర్గాలు చెప్పాయి. మోదీ పర్యటన జూన్ 7–8 తేదీల మధ్య ఉంటుందని సమాచారం. వెంకయ్య ఇంటికి మోదీ కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయాన్నే మోదీ వెంకయ్య ఇంటికి వెళ్లగా, ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. మోదీ మర్యాదపూర్వకంగానే వెంకయ్యను కలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశాభివృద్ధిని వేగవంతం చేయడం, పార్లమెంటరీ వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధానితో చర్చించినట్లు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. -
‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
-
మేనిఫెస్టో హామీలు నెరవేర్చాలి
‘‘మా’ ఎన్నికల సందర్భంగా నరేష్ ప్యానెల్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని హామీలను వారికున్న రెండు సంవత్సరాల కాలంలో నెరవేర్చి, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నూతనంగా ఎన్నికైన వారందరికీ అభినందనలు’’ అని నటులు కృష్ణ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్, ఇతర సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. నటి, దర్శకురాలు విజయ నిర్మల మాట్లాడుతూ– ‘‘మీ అందర్నీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లోనే ‘మా’ పుట్టింది. ఈ సంఘం అభివృద్ధి కోసం ఇదివరకు నేను ఇస్తున్న డబ్బుకంటే ఎక్కువే ఇచ్చి ఋణం తీర్చుకుంటాను’’ అన్నారు. నటులు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘చెన్నైలో ఉన్నప్పుడు కృష్ణగారు, మేము అంతా ‘మా’ అసోసియేషన్‌ని చాలా బాగా నడిపాం. అప్పుడు ఎలక్షన్స్ లేవు.. ఇప్పుడు వచ్చాయి. ప్యానెల్‌లోని అందరూ కలిసికట్టుగా పనిచేసి, ‘మా’ అసోసియేషన్ ప్రతిష్టని ఎంతో ఎత్తుకు చేర్చాలి’’ అన్నారు. ‘‘మా’ అంటేనే అమ్మ. ఈ కళకి కులం, మతం అంటూ భేదం లేదు.. అందరూ కలిసికట్టుగా పనిచేసి, ‘మా’ అభివృద్ధికి కృషి చేయాలి’’ అన్నారు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ‘మా’ నూతన అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ– ‘‘ఈ కార్యక్రమానికి విచ్చేసిన కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, శ్యామల, కోటా శ్రీనివాసరావు, జయసుధ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ‘మా’ అసోసియేషన్‌కి నేను ఇచ్చే మొదటి బహుమతి ‘మా’ గీతం. రెండో బహుమతిగా లక్షా వెయ్యినూటపదహార్లు నా సోదరుల సంక్షేమం కోసం ఇస్తున్నాను. ‘మా’ సభ్యత్వం గతంలో లక్ష ఉండగా 10,000 తగ్గిస్తూ 90,000 చేస్తున్నాం.. ఇది నా మూడో గిఫ్ట్.. మా అమ్మ విజయనిర్మలగారు ‘మా’కి ప్రతినెలా 15,000 ఇస్తున్నారు. ‘మా’ లో 24 గంటల హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసాం. సలహాల పెట్టెను ఏర్పాటు చేసి అందరి విన్నపాలు స్వీకరిస్తాం. మహిళల సాధికారత, సంక్షేమం కోసం జీవితగారి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఈ సందర్భంగా ‘మా’ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన గీతాన్ని కృష్ణ, విజయనిర్మల విడుదల చేశారు. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, రాజశేఖర్, జీవిత, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. -
అది కరెక్ట్ కాదు
2019–2021 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీనియర్ నరేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఈ నెల 22న ముహూర్తం నిర్ణయించుకున్నారు నరేశ్. అయితే అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేయడానికి శివాజీ రాజా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నరేశ్. 2017–2019 కాలపరిమితికి శివాజీ రాజా ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్ ప్రమాణ స్వీకారం చేయాలంటే తన పదవీ కాలం ముగియాలని శివాజీరాజా అంటున్నారని నరేశ్ చెబుతున్నారు. ఇంకా నరేశ్ మాట్లాడుతూ– ‘‘మా’లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయటపడకుండా అందరినీ కలుపుకుపోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని పని చేయకుండా వెనక్కి లాగుతున్నారు. ఇండస్ట్రీ పెద్దల అంగీకారంతో, వారి సమక్షంలో ఈ 22న మంచి మూహుర్తం ఖరారు చేసుకుని ప్రమాణా స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం. ‘నా పదవీకాలం 31వరకు ఉంది. అప్పటి వరకు ఎవరూ మా కుర్చీలో కూర్చోవద్దు. కోర్టుకి వెళతా అని శివాజీ రాజా ఫోన్లో బెదిరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు ఎలా చెబితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు. -
జోసెఫ్ సీనియార్టీపై అసంతృప్తి
న్యూఢిల్లీ: జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించడంపై సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేశారు. మంగళవారం జస్టిస్ జోసెఫ్‌తోపాటు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఈ నిరసన వ్యక్తమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీజేఐని కలిసి నిరసన తెలిపిన వారిలో కొలీజియంలోని ఇద్దరు సీనియర్ జడ్జీలు జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీ ఉన్నారు. కేంద్ర నోటిఫికేషనే ఫైనల్! కేంద్రం శుక్రవారం ముగ్గురు జడ్జీల పేర్లతో విడుదల చేసిన నియామకపు నోటిఫికేషన్లో జస్టిస్ జోసెఫ్ పేరును ప్రకటించినప్పటికీ ఆయన సీనియారిటీని తగ్గిస్తూ మూడోస్థానంలో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును పేర్కొంది. దీనిని రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. జనవరి 10న కొలీజియం సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాతోపాటుగా జస్టిస్ జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రతిపాదించింది. అయితే, ఇందు మల్హోత్రా పేరును అంగీకరించిన కేంద్రం.. జోసెఫ్ పేరును తిరస్కరించింది. మే 16న మరోసారి కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును ప్రతిపాదనల్లో పెట్టింది. జూలైలో దీన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జోసెఫ్ పేరును పేర్కొనడంతో కొలీజియం, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి తెరపడ్డట్లేనని అర్థమవుతోంది. షెడ్యూల్ ప్రకారమే బాధ్యతల స్వీకరణ ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ బాధ్యతల స్వీకరణ మంగళవారం జరగనుంది. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడం, రాష్ట్రపతి ఆమోదం అయిపోయిన తర్వాత ఈ దశలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని కోర్టు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆలిండియా జాబితాలో జోసెఫ్ః39 ‘హైకోర్టు జడ్జీల ఆలిండియా సీనియారిటీ లెక్కల్లో జస్టిస్ బెనర్జీ 4వ స్థానంలో, జస్టిస్ సరన్ 5వ స్థానంలో, జస్టిస్ జోసెఫ్ 39వ స్థానంలో ఉన్నారు’ అని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు జడ్జీలూ సీజేఐ కాలేరని.. ఎందుకంటే ఇప్పటికే సుప్రీం జడ్జీలుగా ఉన్న వారు వీరికంటే సీనియర్లని తెలిపాయి. ఈ ముగ్గురిలో జస్టిస్ జోసెఫ్ 2023లో రిటైరవుతుండగా.. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 2024 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారన్నాయి. అప్పటికి ఆయనే సీజేఐగా ఉండొచ్చన్నాయి. కాగా, సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, జాబితాను మార్చేందుకు వీలుందని మాజీ సీజేఐ జస్టిస్ లోధా పేర్కొన్నారు. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్వాగతించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సీనియారిటీ ఆధారంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియారిటీని పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్: కేంద్రం జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించారంటూ నెలకొన్న వివాదంపై కేంద్రం స్పందించింది. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్లో సీనియారిటీ (హైకోర్టు సీనియారిటీ ఆధారంగా) నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సరన్‌లతో పోలిస్తే జస్టిస్ కేఎం జోసెఫ్ రెండేళ్లు జూనియర్ కాబట్టే ఆయన్ను సీనియారిటీలో మూడోస్థానం కల్పించినట్లు పేర్కొంది. జస్టిస్ జోసెఫ్ 2004 అక్టోబర్ 14న హైకోర్టు న్యాయమూర్తిగా.. 2014, జూలై 31న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన 2023 జూన్ 16న రిటైరవుతారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ 2002, ఫిబ్రవరి 5న హైకోర్టు జడ్జిగా 2017, ఏప్రిల్ 5న హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు. ఈమె 2022, సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరవుతారు. జస్టిస్ సరన్ 2002, ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా, 2016 ఫిబ్రవరి 26న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022, మే 10న ఈయన పదవీ విరమణ చేస్తారు. జోసెఫ్‌తో పోలిస్తే మిగిలిన ఇద్దరు రెండేళ్ల ముందుగానే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన అంశాన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది. -
ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి మోదీ!
కరాచీ/లాహోర్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని పాకిస్తాన్ తెహ్రీక్–ఇన్సాఫ్ (పీటీఐ) యోచిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. మిగతా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈనెల 11న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ సహా సార్క్ దేశాధినేతలను ఆహ్వానించాలని ఇమ్రాన్ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ అంశంతోపాటు ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలు భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అయినప్పటికీ, ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు విభేదాలను పరిష్కరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. -
యడ్యూరప్ప ఏలుబడి
కర్ణాటక ఓటర్లు నికరమైన తీర్పు ఇవ్వని పర్యవసానంగా అక్కడ కొనసాగుతున్న ఉత్కంఠభరిత డ్రామాలో తొలి అంకం బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. బల నిరూపణ కోసం గవర్నర్ వాజూభాయ్ వాలా ఆయనకు పక్షం రోజుల వ్యవధి ఇచ్చారు గనుక మున్ముందు ఈ డ్రామాలో మరిన్ని మలుపులు ఉండటం ఖాయం. ఈ పదిహేను రోజుల్లో ప్రతిపక్ష శిబిరం నుంచి ఎందరు కొత్త కండువాలు కప్పుకుని సరికొత్త మాటలు మాట్లాడతారో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు నోట్ల కట్టలు పంపి ప్రలోభపెట్టిన ఉదంతాల వంటివి కర్ణాటకలో చోటుచేసుకోకూడదని ప్రజాస్వామ్యవాదులు గట్టిగా కోరుకుంటారు. అలాంటి మరక పడకుండా యడ్యూరప్ప గట్టెక్కగలరా అన్నది చూడాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం సుస్థిరంగా నిలబడటానికి బీజేపీకి ఇప్పుడున్న 104మంది ఎమ్మెల్యేలు సరిపోరు. అదనంగా కనీసం 9మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. కనుకనే బేరసారాలు మొదలయ్యాయన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని పిలవాలన్న అంశంలో బుధవారమంతా వాదోపవా దాలు జోరుగా సాగాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని పిలవాలా లేక జేడీ(ఎస్)– కాంగ్రెస్‌లు ఏర్పాటుచేసుకున్న ఎన్నికల అనంతర కూటమికి అవకాశమివ్వాలా అన్న విషయం చుట్టూ ఇవి తిరిగాయి. తమ కూటమికి మొత్తంగా 116మంది మద్దతు ఉంది గనుక ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని జేడీ(ఎస్)–కాంగ్రెస్... తమది అతి పెద్ద పార్టీ గనుక అవకాశమీయాలని బీజేపీ వాదించాయి. రాజ్యాంగ నిపుణులు సైతం ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. రాత్రి 11 గంటల వేళ కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అప్పటికప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను ఏర్పాటైంది. ఆ బెంచ్ దాదాపు మూడున్నర గంటలపాటు వాదప్రతివాదాలు విని గవర్నర్ ఉత్తర్వుపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని రాత్రి 2 దాటాక తేల్చింది. అయితే శుక్రవారం కొనసాగే వాదనల తర్వాత యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల వ్యవధి యధాతథంగా ఉంటుందా, మారుతుందా అన్న విషయం తేలుతుంది. గవర్నర్ల వ్యవస్థ తటస్థంగా ఉండి ఉంటే అసలు ఈ వివాదమంతా వచ్చేదే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు గవర్నర్లను నియమించడం, కీలక సమయాల్లో ఆ గవర్నర్లు కేంద్ర పాలకుల అభీష్టాన్ని నెరవేర్చడం ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. నిరుడు గోవా, మణిపూర్, మేఘా లయల్లో అక్కడి గవర్నర్లు ఎన్నికల అనంతర కూటములను గుర్తించి అధికారం కట్టబెట్టకుండా అతి పెద్ద పార్టీనే పిలిచి ఉన్నా తాజా వివాదం ఏర్పడేది కాదు. ఆ రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరించిన విధానం కర్ణాటకలో ఎందుకు మాయమైందన్న జేడీ(ఎస్)–కాంగ్రెస్‌ల ప్రశ్న సమంజసమైనదే. అయితే గోవా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించదగ్గది. అతిపెద్ద పార్టీగా అవ తరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమీయకుండా గోవా గవర్నర్ అన్యాయం చేశా రంటూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు గవర్నర్‌కు విచక్షణాయుత అధికారాలుంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పేంత స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి లేన ప్పుడు అతి పెద్ద పార్టీని కాదని కొత్తగా ఏర్పడిన కూటమికి అవకాశమీయడంలో తప్పులేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఇదే సూత్రం వర్తింపజేయాలని ఇప్పుడు కాంగ్రెస్ వాదిస్తోంది. గోవా, మణిపూర్, మేఘాలయల్లో గతంలో కాంగ్రెస్ చేసిన వాదనను కర్ణాటకలో బీజేపీ నెత్తికెత్తుకుంటే... ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అప్పట్లో చేసిన తర్కాన్ని ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ సమర్థిస్తోంది. అయితే ఈ నాలుగుచోట్లా లబ్ధి పొందిన ఏకైక పార్టీ మాత్రం బీజేపీయే! అయితే ఈ పరిణామాలపై నిర్ద్వంద్వంగా, నిజాయితీగా స్పందించగల నైతిక స్థైర్యం ఉన్న పార్టీల, నేతల సంఖ్య అరుదుగా మారడం ఆందోళన కలిగించే అంశం. కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి లోపాయికారీగా, బాహా టంగా కృషి చేసిన చంద్రబాబు ఇందుకు ఉదాహరణ. కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై ఆయన బహి రంగంగా మాట్లాడలేక కేబినెట్ సమావేశంలో అభిప్రాయాలు వెల్లడించి, వాటిని లీక్ చేయించి సరిపెట్టుకున్నారు. బీజేపీకి మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు దాన్ని ఆహ్వానించడం సరి కాదని ఆయన కేబినెట్ సమావేశంలో అన్నారట! పైగా అవి ప్రమాదకర రాజకీయాలట!! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన 23మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అంతటితో ఊరుకోక పొరుగునున్న తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు. బాబుకు కర్ణాటక గవర్నర్‌ను తప్పుబట్టే నైతిక అర్హత ఉంటుందా? రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్నప్పుడు జాగ్రత్తగా అడుగేయాలి. కానీ కర్ణాటక బీజేపీ ఎందుకనో తొట్రుపాటుకు లోనయింది. యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించడాన్ని మొదటగా బీజేపీ ట్వీటర్ ద్వారా వెల్లడించడం, ఆ తర్వాత దాన్ని తొలగించడం, మళ్లీ కొత్తగా పెట్టడం వంటివి ఉన్న సవాలక్ష సందేహాలను మరింత పెంచాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇక ఏడాదే గడువున్నది గనుక ఇప్పుడు కర్ణాటకను చేజిక్కించుకోవడం మాత్రమే కాదు...జేడీ(ఎస్)ను మచ్చిక చేసుకో వడం కూడా మున్ముందు బీజేపీకి చాలా అవసరం. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తుంటే తప్ప అధిక స్థానాలు సంపాదించలేమని కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఈ ఎన్నికలతో అర్ధమై ఉంటుంది. అయితే జేడీ(ఎస్) నేత కుమారస్వామికి రావలసిన సీఎం పదవిని కాస్తా తన్నుకుపోయిన బీజేపీకి అది అంత సులభమేమీ కాదు. ఏదేమైనా కర్ణాటక పరిణామాలు మరిన్నిరోజులపాటు పతాక శీర్షిక లకు ఎక్కుతూనే ఉంటాయి. ఇవన్నీ త్వరగా కొలిక్కి వచ్చి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందా లని అందరూ ఆశిస్తారు. -
ఏడాది తర్వాత కొలువు
ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఏడాది తర్వాత ఏర్పడిన ఈ మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ సుధాకర్‌యాదవ్, 12మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆది నుంచి బోర్డు విషయంలో టీడీపీ నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వచ్చింది. దీంతో అసంతృప్తి స్వరం పెరిగింది. మరోపక్క మిత్రులుగా ఉన్న బీజేపీతో అంతరం పెరిగింది. తప్పని పరిస్థితుల్లో సీఎం బోర్డు ఏర్పాటుచేసినా పలు వివాదాలు చుట్టుముట్టాయి. బోర్డులో అవకాశం దక్కిన ఒక సభ్యురాలు అన్యమత వివాదంతో పక్కకు తొలగాల్సి వచ్చింది. కొత్త బోర్డు నియమించాక టీడీపీలో అసంతృప్తుల స్వరం పెరిగింది. అలకలూ పెరిగాయి. సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ధర్మకర్తల మండలి కొలువుదీరింది. శనివారం చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్‌తోపాటు మరో 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త బోర్డు నియామకంతో ఏడాది నిరీక్షణకు తెర పడింది. గత బోర్డు పదవీ కాలం గత ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగిసింది. దాదాపు ఏడాది కాలం అధికారుల పాలనలో గడిపేశారు. తెలుగుదేశం ప్రభుత్వ నాలుగేళ్ల హయాంలో కేవలం రెండేళ్లు్ల మాత్రమే బోర్డు పనిచేసింది. మరో రెండేళ్లు ఖాళీగా ఉంచారు. ఏడాదిగా అధికారుల పాలన ఉండడంతో రూ.2,894 కోట్ల వార్షిక బడ్జెట్‌తో కూడిన టీటీడీలో కీలక నిర్ణయాలు అమ లులో లేవు. రూ.500 కోట్ల మేరకు ఏటా మార్కెటింగ్ కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటివి బోర్డు అనుమతులు కోసం ఎదురుచూస్తున్నాయి. శ్రీవారి దర్శనం, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం సరికొత్త పథకాలు, కీలక నిర్ణయాల అమలుకు మార్గం ఏర్పడింది. ఇదే టీటీడీ కొత్త బోర్డు టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్, సభ్యులుగా రాయపాటి సాంబశివరావు (ఎంపీ), జీఎస్ఎస్. శివాజీ (ఎమ్మెల్యే), బోండా ఉమామహేశ్వరరావు (ఎమ్మెల్యే), బీకే పార్థసారథి (ఎమ్మెల్యే), చల్లా రామచంద్రారెడ్డి , పొట్లూరి రమేష్‌బాబు, ఇ. పెద్దిరెడ్డి (తెలంగాణ),రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, డొక్కా జగన్నాథం ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫి షియో సభ్యులుగా ఎండోమెంట్, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ,టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ బోర్డులో సలహా మండలి సభ్యుడి హోదాలో హైదరాబాద్‌కు చెందిన బోదనపు అశోక్‌రెడ్డి కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర బీజేపీకి చెందిన స్వప్న, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సంఘ సేవకురాలు సుధానారాయణమూర్తి, ఎండోమెంట్ కమిషనర్ హాజరుకాలేదు. కాగా, పాయకరావు పేట ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ప్రైవేట్ బ్యాంకు రూ.వెయ్యికోట్లపై నిర్ణయం ఎటో? ఇటీవల టీటీడీ రూ.3వేల కోట్లు ఆంధ్రాబ్యాంకు, రూ.వెయ్యికోట్లు ఇండస్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఎక్కువ కోట్ చేసిన తమబ్యాంకును కాదని, ఆంధ్రా బ్యాంకుకు టెండర్ కేటాయించారని విజయాబ్యాంకు ప్రతినిధులు ఆరోపించారు. ఏకంగా రూ.వెయ్యి కోట్లమేర భక్తుల కానుకలతో వచ్చిన డిపాజిట్లను ప్రైవేట్ బ్యాంకు అయిన ఇండస్‌లో డిపాజిట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తుల్లో ఆందోళన ఉంది. ఈవిషయంలో టీటీడీ బోర్డు ఎలాంటి వైఖరి తీసుకుంటోందోనని అందరూ వేచిచూస్తున్నారు. దీనిపై త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో తప్పనిసరిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు సభ్యుడు బోండా ఉమాతోపాటు మరికొంతమంది తెలి పారు. శ్రీవారి లడ్డూ ధరలు, సేవా టికెట్ల ధరల పెంపు అని వార్యమవుతోంది. చాలా కాలంగా చర్చ సాగుతోంది. ధరల పెంపు అంశంపై బోర్డు ఎలాంటి వైఖరి అవలంభిస్తోందనని భక్తులు ఎదురుచూస్తున్నారు. -
త్రిపుర సీఎంగా విప్లవ్ ప్రమాణం
అగర్తలా: సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్(48) శుక్రవారం ప్రమాణం చేశారు. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగతరాయ్ విప్లవ్‌తో సీఎంగా ప్రమాణంచేయించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ , కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ నాయకులు అడ్వాణీ, ఎంఎం జోషి, తాజా మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విప్లవ్‌తో పాటు బీజేపీకే చెందిన జిష్ణు దేవ్ వర్మన్ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఏడుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ సీఎంలు రూపానీ(గుజరాత్), శివరాజ్ సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), సర్బానంద సోనోవాల్(అసోం), రఘువర్ దాస్(జార్ఖండ్)లూ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రిపురకు పూర్తి మద్దతు: మోదీ త్రిపుర సమగ్రాభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా మద్దతిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. విప్లవ్ ప్రమాణ స్వీకారం చేశాక మోదీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని, వాటిని వెతికిపట్టుకోవాలని పిలుపునిచ్చారు. ‘ త్రిపుర ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రతి భారతీయుడు ఈశాన్య వాసులకు అండగా ఉంటాడు’ అని అన్నారు. ఆరెస్సెస్ నుంచి మరో సీఎం.. విప్లవ్ రాజకీయ ప్రస్థానం ఆరెస్సెస్‌తో∙మొదలైంది. గోమతి జిల్లా రాజ్‌ధార్ నగర్ గ్రామంలోని మధ్య తరగతి కుటుంబంలో 1971, నవంబర్ 25న విప్లవ్ జన్మించారు. ఆయన తండ్రి జనసంఘ్‌లో పనిచేశారు. డిగ్రీ పూర్తిచేసిన విప్లవ్ ఆరెస్సెస్‌లో చేరి సుమారు 16 ఏళ్లు సేవలందించారు. -
కొలువుదీరిన జైరామ్ ప్రభుత్వం
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. షిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి అలుపెరగకుండా కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. దాదాపు 30వేల మంది పార్టీ కార్యకర్తలు సాంప్రదాయ దుస్తులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త, పాతల మిశ్రమం కేబినెట్ కూర్పులో అనుభవజ్ఞులైన వారితోపాటు కొత్తవారికీ చోటుకల్పించారు. ఐదుగురు గతంలో మంత్రులుగా చేసిన వారు కాగా.. ఆరుగురు కొత్తవారు. సీఎం సహా ఆరుగురు రాజ్‌పుత్‌లు, ముగ్గురు బ్రాహ్మణులు, ఓ ఎస్టీ, ఇద్దరు ఓబీసీలతో మంత్రివర్గ కూర్పు చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సర్వీన్ చౌదరి తాజా కేబినెట్లో ఏకైక మహిళా మంత్రిగా ఉన్నారు. రాజీవ్ బిందాల స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. గతనెల్లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పీకే ధుమాల్ ఓడిపోవటంతో పార్టీ జైరాంను శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసింది. అనుకోకుండా కాఫీ దుకాణంలో.. షిమ్లాలోని ‘ఇండియన్ కాఫీ హౌజ్’ చాలా ఫేమస్. ఇక్కడి కాఫీకి వీరాభిమానుల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్నప్పుడు ఇక్కడికి తరచూ కాఫీ తాగేందుకు మోదీ వచ్చేవారు. పార్టీ నాయకులు, జర్నలిస్టులతో ఇక్కడే ఇష్టాగోష్టి జరిపేవారు. కాగా, జైరామ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రధాని మోదీకి ఆ రోడ్డుగుండా వెళ్తున్నపుడు ఆ దుకాణంలో మధురజ్ఞాపకాలు గుర్తొచ్చినట్లున్నాయి. భద్రతను పక్కనబెట్టి దుకాణం ముందు కాన్వాయ్‌ను ఆపి.. కాఫీ తాగారు. ఈ పరిణామంతో దుకాణ యజమానులతోపాటు రోడ్డుపై ఉన్నవారూ ఆశ్చర్యపోయారు. -
రూపానీ ప్రమాణం
గాంధీనగర్: వరుసగా రెండోసారి విజయ్ రూపానీ గుజరాత్ పీఠం అధిష్టించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణం చేశారు. వీరిలో నితిన్ పటేల్ సహా 9 మంది కేబినెట్ మంత్రులు కాగా.. మిగతా 10 మంది సహాయ మంత్రులు. మంత్రివర్గంలో పటేల్, ఓబీసీ వర్గాలకు చెరో ఆరు పదవులు దక్కగా.. ముగ్గురు క్షత్రియ, ఇద్దరు ఎస్టీ, ఒకరు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ఉన్నారు. సీఎంగా రూపానీ ప్రమాణస్వీకారం అనంతరం..వరుసగా కేబినెట్, సహాయ మంత్రుల ప్రమాణస్వీకారం కొనసాగింది. బీజేపీ శాసన సభా పక్షం ఉపనేతగా ఎన్నికైన నితిన్ పటేల్ డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. భావ్‌నగర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న విభావరి బెన్ దవే ఒక్కరే మహిళా మంత్రి. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ‘2001, 2002, 2007, 2012ల నాటి ప్రమాణస్వీకారోత్సవాల్ని ఈ రోజు కార్యక్రమం గుర్తుకు తెచ్చింది’ అని అన్నారు. ‘మోదీ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే ఇక గుజరాత్లో బీజేపీ రాదని కొందరు భావించారు. బీజేపీ దాదాపు 50 శాతం ఓట్లను సాధించడం గొప్ప విషయం’ అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలనే ఆహ్వానించారని, అందుకు నిరసనగా కార్యక్రమానికి గైర్హాజరయ్యామని కాంగ్రెస్ ప్రతినిధి మనీశ్ దోషి చెప్పారు. కాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు జై రామ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. -
ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన అంగర రామ్మోహన్రావు, చిక్కాల రామచంద్రరావు ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం వెలగపూడి అసెంబ్లీలోని బీఏసీ సమావేశ మందిరంలో మండలి చైర్మన్ చక్రపాణి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. వెనుకబడిన తరగతులకు చెందిన తనకు టీడీపీ రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందని అంగర రామ్మోహన్రావు (ప.గోదావరి జిల్లా) పేర్కొన్నారు. కాగా, తనను గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు టీడీపీకి రుణపడి ఉంటానని చిక్కాల రామచంద్రరావు (తూ.గోదావరి జిల్లా) తెలిపారు.