షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. షిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్‌కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి అలుపెరగకుండా కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. దాదాపు 30వేల మంది పార్టీ కార్యకర్తలు సాంప్రదాయ దుస్తులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కొత్త, పాతల మిశ్రమం
కేబినెట్ కూర్పులో అనుభవజ్ఞులైన వారితోపాటు కొత్తవారికీ చోటుకల్పించారు. ఐదుగురు గతంలో మంత్రులుగా చేసిన వారు కాగా.. ఆరుగురు కొత్తవారు. సీఎం సహా ఆరుగురు రాజ్‌పుత్‌లు, ముగ్గురు బ్రాహ్మణులు, ఓ ఎస్టీ, ఇద్దరు ఓబీసీలతో మంత్రివర్గ కూర్పు చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సర్వీన్ చౌదరి తాజా కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా ఉన్నారు. రాజీవ్ బిందాల స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. గతనెల్లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పీకే ధుమాల్ ఓడిపోవటంతో పార్టీ జైరాంను శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసింది.
అనుకోకుండా కాఫీ దుకాణంలో..
షిమ్లాలోని ‘ఇండియన్ కాఫీ హౌజ్’ చాలా ఫేమస్. ఇక్కడి కాఫీకి వీరాభిమానుల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్నప్పుడు ఇక్కడికి తరచూ కాఫీ తాగేందుకు మోదీ వచ్చేవారు. పార్టీ నాయకులు, జర్నలిస్టులతో ఇక్కడే ఇష్టాగోష్టి జరిపేవారు. కాగా, జైరామ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రధాని మోదీకి ఆ రోడ్డుగుండా వెళ్తున్నపుడు ఆ దుకాణంలో మధురజ్ఞాపకాలు గుర్తొచ్చినట్లున్నాయి. భద్రతను పక్కనబెట్టి దుకాణం ముందు కాన్వాయ్‌ను ఆపి.. కాఫీ తాగారు. ఈ పరిణామంతో దుకాణ యజమానులతోపాటు రోడ్డుపై ఉన్నవారూ ఆశ్చర్యపోయారు.
కొలువుదీరిన జైరామ్ ప్రభుత్వం
Published Thu, Dec 28 2017 2:55 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment