మండి: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో మాదిరిగా మళ్లీ బీజేపీకే అధికారమివ్వాలని హిమాచల్ ఓటర్లు నిశ్చయించుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండికి చెందిన బీజేపీ యువజన విభాగం కార్యకర్తలనుద్దేశించి ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. అననుకూల వాతావరణం కారణంగా మండిలోని పడ్డల్ మైదాన్‌లో భారతీయ జనతా యువమోర్చా ఏర్పాటు చేసిన ‘యువ విజయ్ సంకల్ప్ ర్యాలీ’కి హెలికాప్టర్ ద్వారా చేరుకోవడం సాధ్యం కాకపోవడంతో ఆయన ఆన్‌లైన్‌లోనే ప్రసంగించారు.
ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చాలన్న సంప్రదాయాన్ని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఓటర్లు పక్కనబెట్టారని ఆయన చెప్పారు. అదేవిధంగా, బీజేపీ పాలన, అభివృద్ధి పనులను చూసి హిమాచల్ ఓటర్లు, యువత కూడా మరోసారి బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ యువత ప్రాతినిథ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఫార్మా హబ్‌గా రూపుదాలుస్తోందని, డ్రోన్ విధానం రూపకల్పనలో ముందుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment