ఢిల్లీ ఎన్నికల పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బీజేపీ తరపున ప్రధాని మోదీ గ్యారంటీల హామీలనిస్తుండగా, మరోవైపు సీఎం కేజ్రీవాల్ పలు పథకాల అమలుకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజా సంక్షేమం, దేశ ప్రయోజనాలతో కూడిన ఈ హామీలతో వారు ఓటర్ల మనసు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై మోదీ గ్యారంటీ హామీల ప్రభావం కనిపించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రధాని మోదీ చేస్తున్న హామీలు ప్రజలకు ఆకట్టుకునేలా ఉన్నాయి.
న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తన ప్రచారంలో మోదీ హామీలను అధికంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటే మోదీ హామీలను నెరవేరుస్తారని చెబుతున్నారు. ఇక గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హామీ పథకాలు ఆ పార్టీకి అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ సాధించిపెట్టాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ హామీలను ఢిల్లీ ఓటర్లు విశ్వసిస్తారనే నమ్మకంలో ఆ పార్టీ ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చాక నిర్వహిస్తున్న బహిరంగ సభలు, రోడ్ షోలలో తాము అమలు చేస్తున్న ఉచిత పథకాలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నంత వరకు ఉచిత విద్యుత్, మంచినీరు, ఆరోగ్య సౌకర్యాల హామీని కొనసాగిస్తానని చెబుతున్నారు.
ఆ మధ్య ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన భారత కూటమి ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తన ప్రసంగంలో సీఎం తెలిపిన ఆరు హామీలను ప్రస్తావించారు. దాదాపు 50 రోజుల పాటు జైలులో ఉండి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులకు పది హామీలు ఇచ్చారు. వీటిలో ఉచిత విద్యుత్, ఆరోగ్య పథకాలతో పాటు చైనా ఆక్రమించిన భారత భూ భాగాన్ని స్వాధీనం చేసుకోవడంపై కూడా హామీనిచ్చారు. గతంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా బీహార్‌లో ఇటువంటి హామీలతోనే విజయం సాధించారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఢిల్లీ పోరులో అక్కడి జనం అటు మోడీ గ్యారంటీలను నమ్ముతారో లేక ఇటు కేజ్రీవాల్ పథకాలను విశ్వస్తారో మే 25న జరిగే ఎన్నికల్లో నిర్ణయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment