2024 లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల ఓటింగ్ పూర్తియ్యింది. ఇంతలో ఇండియా అలయన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి శుభవార్త వినిపించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో స్కామ్ ఆరోపణలపై 40 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ బెయిల్ సమయంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపిరి అందినట్లయ్యింది. భారత కూటమిలోనూ ఉత్సాహం నెలకొంది. అయితే ఇది ఇండియా కూటమికి ఎంతవరకూ లాభం చేకూరుస్తుందనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది.
కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కేజ్రీవాల్ ప్రచారంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేజ్రీవాల్ విడుదల ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని 18 లోక్‌సభ స్థానాలపై ప్రభావం చూపనుంది. మే 25న ఢిల్లీ, హర్యానాలలో ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. కాగా పంజాబ్‌లో జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఆ రోజుతో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ముగియనుంది.
బెయిల్ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని నాలుగు ఆప్ స్థానాలలో ప్రచారం చేయడమే కాకుండా, పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడిన మూడు స్థానాలలో కూడా ప్రచారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. ఇక్కడ ఆప్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. అటువంటి పరిస్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంతో ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ కూడా లాభపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment