కర్ణాటక ఓటర్లు నికరమైన తీర్పు ఇవ్వని పర్యవసానంగా అక్కడ కొనసాగుతున్న ఉత్కంఠభరిత డ్రామాలో తొలి అంకం బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. బల నిరూపణ కోసం గవర్నర్ వాజూభాయ్ వాలా ఆయనకు పక్షం రోజుల వ్యవధి ఇచ్చారు గనుక మున్ముందు ఈ డ్రామాలో మరిన్ని మలుపులు ఉండటం ఖాయం. ఈ పదిహేను రోజుల్లో ప్రతిపక్ష శిబిరం నుంచి ఎందరు కొత్త కండువాలు కప్పుకుని సరికొత్త మాటలు మాట్లాడతారో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు నోట్ల కట్టలు పంపి ప్రలోభపెట్టిన ఉదంతాల వంటివి కర్ణాటకలో చోటుచేసుకోకూడదని ప్రజాస్వామ్యవాదులు గట్టిగా కోరుకుంటారు. అలాంటి మరక పడకుండా యడ్యూరప్ప గట్టెక్కగలరా అన్నది చూడాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం సుస్థిరంగా నిలబడటానికి బీజేపీకి ఇప్పుడున్న 104మంది ఎమ్మెల్యేలు సరిపోరు. అదనంగా కనీసం 9మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. కనుకనే బేరసారాలు మొదలయ్యాయన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని పిలవాలన్న అంశంలో బుధవారమంతా వాదోపవా దాలు జోరుగా సాగాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని పిలవాలా లేక జేడీ(ఎస్)– కాంగ్రెస్‌లు ఏర్పాటుచేసుకున్న ఎన్నికల అనంతర కూటమికి అవకాశమివ్వాలా అన్న విషయం చుట్టూ ఇవి తిరిగాయి. తమ కూటమికి మొత్తంగా 116మంది మద్దతు ఉంది గనుక ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని జేడీ(ఎస్)–కాంగ్రెస్... తమది అతి పెద్ద పార్టీ గనుక అవకాశమీయాలని బీజేపీ వాదించాయి. రాజ్యాంగ నిపుణులు సైతం ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. రాత్రి 11 గంటల వేళ కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అప్పటికప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను ఏర్పాటైంది. ఆ బెంచ్ దాదాపు మూడున్నర గంటలపాటు వాదప్రతివాదాలు విని గవర్నర్ ఉత్తర్వుపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని రాత్రి 2 దాటాక తేల్చింది. అయితే శుక్రవారం కొనసాగే వాదనల తర్వాత యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల వ్యవధి యధాతథంగా ఉంటుందా, మారుతుందా అన్న విషయం తేలుతుంది.
గవర్నర్ల వ్యవస్థ తటస్థంగా ఉండి ఉంటే అసలు ఈ వివాదమంతా వచ్చేదే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు గవర్నర్లను నియమించడం, కీలక సమయాల్లో ఆ గవర్నర్లు కేంద్ర పాలకుల అభీష్టాన్ని నెరవేర్చడం ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. నిరుడు గోవా, మణిపూర్, మేఘా లయల్లో అక్కడి గవర్నర్లు ఎన్నికల అనంతర కూటములను గుర్తించి అధికారం కట్టబెట్టకుండా అతి పెద్ద పార్టీనే పిలిచి ఉన్నా తాజా వివాదం ఏర్పడేది కాదు. ఆ రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరించిన విధానం కర్ణాటకలో ఎందుకు మాయమైందన్న జేడీ(ఎస్)–కాంగ్రెస్‌ల ప్రశ్న సమంజసమైనదే. అయితే గోవా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించదగ్గది. అతిపెద్ద పార్టీగా అవ తరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమీయకుండా గోవా గవర్నర్ అన్యాయం చేశా రంటూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు గవర్నర్‌కు విచక్షణాయుత అధికారాలుంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పేంత స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి లేన ప్పుడు అతి పెద్ద పార్టీని కాదని కొత్తగా ఏర్పడిన కూటమికి అవకాశమీయడంలో తప్పులేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఇదే సూత్రం వర్తింపజేయాలని ఇప్పుడు కాంగ్రెస్ వాదిస్తోంది. గోవా, మణిపూర్, మేఘాలయల్లో గతంలో కాంగ్రెస్ చేసిన వాదనను కర్ణాటకలో బీజేపీ నెత్తికెత్తుకుంటే... ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అప్పట్లో చేసిన తర్కాన్ని ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ సమర్థిస్తోంది. అయితే ఈ నాలుగుచోట్లా లబ్ధి పొందిన ఏకైక పార్టీ మాత్రం బీజేపీయే! అయితే ఈ పరిణామాలపై నిర్ద్వంద్వంగా, నిజాయితీగా స్పందించగల నైతిక స్థైర్యం ఉన్న పార్టీల, నేతల సంఖ్య అరుదుగా మారడం ఆందోళన కలిగించే అంశం. కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి లోపాయికారీగా, బాహా టంగా కృషి చేసిన చంద్రబాబు ఇందుకు ఉదాహరణ. కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై ఆయన బహి రంగంగా మాట్లాడలేక కేబినెట్ సమావేశంలో అభిప్రాయాలు వెల్లడించి, వాటిని లీక్ చేయించి సరిపెట్టుకున్నారు. బీజేపీకి మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు దాన్ని ఆహ్వానించడం సరి కాదని ఆయన కేబినెట్ సమావేశంలో అన్నారట! పైగా అవి ప్రమాదకర రాజకీయాలట!! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన 23మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అంతటితో ఊరుకోక పొరుగునున్న తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు. బాబుకు కర్ణాటక గవర్నర్‌ను తప్పుబట్టే నైతిక అర్హత ఉంటుందా?
రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్నప్పుడు జాగ్రత్తగా అడుగేయాలి. కానీ కర్ణాటక బీజేపీ ఎందుకనో తొట్రుపాటుకు లోనయింది. యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించడాన్ని మొదటగా బీజేపీ ట్వీటర్ ద్వారా వెల్లడించడం, ఆ తర్వాత దాన్ని తొలగించడం, మళ్లీ కొత్తగా పెట్టడం వంటివి ఉన్న సవాలక్ష సందేహాలను మరింత పెంచాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇక ఏడాదే గడువున్నది గనుక ఇప్పుడు కర్ణాటకను చేజిక్కించుకోవడం మాత్రమే కాదు...జేడీ(ఎస్)ను మచ్చిక చేసుకో వడం కూడా మున్ముందు బీజేపీకి చాలా అవసరం. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తుంటే తప్ప అధిక స్థానాలు సంపాదించలేమని కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఈ ఎన్నికలతో అర్ధమై ఉంటుంది. అయితే జేడీ(ఎస్) నేత కుమారస్వామికి రావలసిన సీఎం పదవిని కాస్తా తన్నుకుపోయిన బీజేపీకి అది అంత సులభమేమీ కాదు. ఏదేమైనా కర్ణాటక పరిణామాలు మరిన్నిరోజులపాటు పతాక శీర్షిక లకు ఎక్కుతూనే ఉంటాయి. ఇవన్నీ త్వరగా కొలిక్కి వచ్చి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందా లని అందరూ ఆశిస్తారు.
యడ్యూరప్ప ఏలుబడి
Published Fri, May 18 2018 2:16 AM | Last Updated on Wed, Sep 5 2018 1:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment