పుట్టా సుధాకర్‌యాదవ్, చైర్మన్
ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఏడాది తర్వాత ఏర్పడిన ఈ మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ సుధాకర్‌యాదవ్, 12మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆది నుంచి బోర్డు విషయంలో టీడీపీ నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వచ్చింది. దీంతో అసంతృప్తి స్వరం పెరిగింది. మరోపక్క మిత్రులుగా ఉన్న బీజేపీతో అంతరం పెరిగింది. తప్పని పరిస్థితుల్లో సీఎం బోర్డు ఏర్పాటుచేసినా పలు వివాదాలు చుట్టుముట్టాయి. బోర్డులో అవకాశం దక్కిన ఒక సభ్యురాలు అన్యమత వివాదంతో పక్కకు తొలగాల్సి వచ్చింది. కొత్త బోర్డు నియమించాక టీడీపీలో అసంతృప్తుల స్వరం పెరిగింది. అలకలూ పెరిగాయి.
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ధర్మకర్తల మండలి కొలువుదీరింది. శనివారం చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్‌తోపాటు మరో 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త బోర్డు నియామకంతో ఏడాది నిరీక్షణకు తెర పడింది. గత బోర్డు పదవీ కాలం గత ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగిసింది. దాదాపు ఏడాది కాలం అధికారుల పాలనలో గడిపేశారు. తెలుగుదేశం ప్రభుత్వ నాలుగేళ్ల హయాంలో కేవలం రెండేళ్లు్ల మాత్రమే బోర్డు పనిచేసింది. మరో రెండేళ్లు ఖాళీగా ఉంచారు. ఏడాదిగా అధికారుల పాలన ఉండడంతో రూ.2,894 కోట్ల వార్షిక బడ్జెట్‌తో కూడిన టీటీడీలో కీలక నిర్ణయాలు అమ లులో లేవు. రూ.500 కోట్ల మేరకు ఏటా మార్కెటింగ్ కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటివి బోర్డు అనుమతులు కోసం ఎదురుచూస్తున్నాయి. శ్రీవారి దర్శనం, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం సరికొత్త పథకాలు, కీలక నిర్ణయాల అమలుకు మార్గం ఏర్పడింది.
ఇదే టీటీడీ కొత్త బోర్డు
టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్, సభ్యులుగా రాయపాటి సాంబశివరావు (ఎంపీ), జీఎస్‌ఎస్. శివాజీ (ఎమ్మెల్యే), బోండా ఉమామహేశ్వరరావు (ఎమ్మెల్యే), బీకే పార్థసారథి (ఎమ్మెల్యే), చల్లా రామచంద్రారెడ్డి , పొట్లూరి రమేష్‌బాబు, ఇ. పెద్దిరెడ్డి (తెలంగాణ),రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, డొక్కా జగన్నాథం ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫి షియో సభ్యులుగా ఎండోమెంట్, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ,టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేశారు.
టీటీడీ బోర్డులో సలహా మండలి సభ్యుడి హోదాలో హైదరాబాద్‌కు చెందిన బోదనపు అశోక్‌రెడ్డి కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర బీజేపీకి చెందిన స్వప్న, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సంఘ సేవకురాలు సుధానారాయణమూర్తి, ఎండోమెంట్ కమిషనర్ హాజరుకాలేదు. కాగా, పాయకరావు పేట ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ స్థానంలో కొత్తవారిని నియమించలేదు.
ప్రైవేట్ బ్యాంకు రూ.వెయ్యికోట్లపై నిర్ణయం ఎటో?
ఇటీవల టీటీడీ రూ.3వేల కోట్లు ఆంధ్రాబ్యాంకు, రూ.వెయ్యికోట్లు ఇండస్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఎక్కువ కోట్ చేసిన తమబ్యాంకును కాదని, ఆంధ్రా బ్యాంకుకు టెండర్ కేటాయించారని విజయాబ్యాంకు ప్రతినిధులు ఆరోపించారు. ఏకంగా రూ.వెయ్యి కోట్లమేర భక్తుల కానుకలతో వచ్చిన డిపాజిట్లను ప్రైవేట్ బ్యాంకు అయిన ఇండస్‌లో డిపాజిట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తుల్లో ఆందోళన ఉంది. ఈవిషయంలో టీటీడీ బోర్డు ఎలాంటి వైఖరి తీసుకుంటోందోనని అందరూ వేచిచూస్తున్నారు.
దీనిపై త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో తప్పనిసరిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు సభ్యుడు బోండా ఉమాతోపాటు మరికొంతమంది తెలి పారు. శ్రీవారి లడ్డూ ధరలు, సేవా టికెట్ల ధరల పెంపు అని వార్యమవుతోంది. చాలా కాలంగా చర్చ సాగుతోంది. ధరల పెంపు అంశంపై బోర్డు ఎలాంటి వైఖరి అవలంభిస్తోందనని భక్తులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment